జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ యమ డేంజర్!

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ యమ డేంజర్!
  • రోజురోజుకు పెరుగుతున్న లోడ్
  • గ్రేటర్ సిటీ నుంచి డైలీ 7 వేల టన్నుల చెత్త అక్కడికే..
  • మరో మూడు ప్లాంట్లు ఏర్పాటు చేయలే
  • ఎన్జీటీ ఆదేశాలను సైతం సర్కార్ లెక్కచేయట్లే
  • ఎన్నికల సమయంలోనే డంపింగ్ యార్డు ముచ్చట
  • లీచెట్ ట్రీట్​మెంట్ ప్లాంట్ ఏర్పాటైనా ఫలితం లేదు 

హైదరాబాద్, వెలుగు : సిటీలో రోజురోజుకు చెత్త పెరుగుతుండగా జవహర్ నగర్​ డంపింగ్ ​యార్డ్  పరిస్థితి మరింత డేంజర్​గా తయారైంది. యార్డు సమస్య ఏ మాత్రం తీరడం లేదు. గ్రేటర్​లో రోజుకు 7 వేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా.. అదంతా డంపింగ్ యార్డుకు తరలిస్తుండటంతో ప్రాబ్లమ్ పెరిగిపోతున్నది.  యార్డు సమస్యను పరిష్కరించేందుకు దుండిగల్, సంగారెడ్డి జిల్లా ప్యారనగర్, బీబీనగర్​లోని యాచారం, పఠాన్ చెరువులోని లక్డారం ప్రాంతాల్లో కొత్తగా డంపింగ్ యార్డ్​లు నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా పూర్తి చేయలేదు.

ఒక్క దుండిగల్ ప్లాంట్ పనులు మాత్రమే తుది దశకు వచ్చాయి. మిగతాచోట్ల పనులను పూర్తి చేయలేదు. జవహర్​నగర్ డంపింగ్ యార్డ్​లో ఏండ్లుగా పేరుకుపోయిన చెత్తకు మూడేళ్ల కిందట రూ. 147 కోట్లతో క్యాపింగ్ ​చేశారు.  సమస్య రాకుండా ఆ తర్వాత క్యాపింగ్ చేసిన చెత్తలోంచి వచ్చే నీటిని శుద్ధి చేసి బయటకు పంపేందుకు రూ.251 కోట్లతో లీచెట్ ట్రీట్​మెంట్ ప్లాంట్​ను 2020లో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 2 వేల కేఎల్​డీ సామర్థ్యం కలిగిన లీచెట్ ట్రీట్​మెంట్ ప్లాంట్​ను పదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలను రాంకీ సంస్థకి అప్పగించారు. ఏళ్లు గడిచినా మల్కారం చెరువు శుద్ధి కాలేదు. ట్రీట్​మెంట్ ప్లాంట్​తో డంపింగ్ ​యార్డ్ వద్ద సమస్య పోలేదు. ఇదంతా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టులను తప్పుదారి పట్టించేందుకే చేస్తున్నట్లు కనిపిస్తుందని స్థానికులు అంటున్నారు.
 
టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్త 

డంపింగ్‌‌‌‌ యార్డ్ నిర్వహణ పనులు స్టార్ట్​ చేసినప్పుడు  గ్రేటర్‌‌‌‌ సిటీ నుంచి రోజుకు 2,500 - నుంచి 3 వేల  టన్నుల చెత్త యార్డ్​కు వచ్చేది. అప్పట్లో దానికి తగ్గట్లు నిర్వహణ సంస్థ రాంకీ ఏర్పాట్లు చేసుకుంది. ప్రస్తుతం రోజుకు 7 వేల టన్నుల చెత్త  వస్తుండగా సమస్య మరింత తీవ్రమైంది. నిర్వహణ లోపాలతో పాటు సామర్థ్యం సరిపోకపోవడంతో సగం చెత్తను డంపింగ్‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌ పైనే రాంకీ సంస్థ బహిరంగంగా పడేస్తుంది.

ఇప్పటికే 14 మిలియన్‌‌‌‌ టన్నులకుపైగా పేరుకుపోయింది. దీంతో యార్డుపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని, మరో రెండు ప్రత్యామ్నాయ యార్డులు ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు. కొత్తవాటి నిర్మాణాలు జరుగుతున్నట్లు చెబుతున్నా అందుబాటులోకైతే రాలేదు. అప్పట్లో 4 డంపింగ్​ యార్డ్​లు ఏర్పాటు చేయాలని అనుకోగా  అందులో జవహర్ నగర్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దీంతో చెత్తంతా ఇక్కడకే తరలిస్తుండగా సమస్య పెరుగుతున్నది. మరో మూడు చోట్ల అందుబాటులోకి వచ్చి ఉంటే సమస్య ఉండేది కాదు.  

వాటర్ పొల్యూషన్..

  యార్డు పరిసరాల్లో నివసించే  ప్రజలు దుర్వాసన కారణంగా శ్వాస పీల్చుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  వ్యర్థాల నిర్వహణలో లోపాలతో తమ బతుకులు ఆగమైతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికార పార్టీ నేతలు సైతం ఈ సమస్యపై మండిపడుతున్నారు. చలికాలంలో వస్తే  ఇబ్బందులు మరింతగా ఉంటాయని పేర్కొంటున్నారు. చెత్త నుంచి వచ్చే మురుగుతో మల్కారం చెరువు ఇప్పటికే కలుషితమైంది. గాలి వీచినప్పుడల్లా చెరువు చుట్టూ వాసన తీవ్రంగా వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.  

దమ్మాయి గూడ, నాగారం ప్రాంతాల్లోని సీఎన్ ​ఆర్ కాలనీ, అంజనాద్రి కాలనీ, అంజనాద్రి ఎక్స్ టెన్షన్, ఎంఎల్ ఆర్ కాలనీ, సాయి శ్రీనివాస కాలనీల్లో డంపింగ్ యార్డు నుంచి వచ్చే నీటితో వాటర్ పొల్యూషన్ అవుతుందని, నీటిని తాగలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చాయంటూ ఈసారి ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 


‘‘జవహర్​ నగర్ డంపింగ్ యార్డ్ దుర్గంధం నుంచి స్థానిక ప్రజలకు శాశ్వత విముక్తి  కల్పిస్తాం. కాలుష్యం లేని వాతావరణం కల్పించేందుకు 30 ఎకరాల్లో విస్తరించిన మల్కారం చెరువులోని లీచెట్​ను పూర్తిగా శుద్ధి చేసి సమస్యకు చెక్ పెడతాం.’’.. అని 2020, నవంబర్​లో డంపింగ్​యార్డులో  వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌‌‌‌ను ప్రారంభించిన సందర్భంగా  మంత్రి కేటీఆర్  హామీ ఇచారు. కానీ నేటికీ జవహర్​నగర్​ ఏరియాలో ఎలాంటి మార్పు లేదు.  


 దుర్వాసన తట్టుకోలేక ఇళ్లు ఖాళీ

 యార్డు విస్తీర్ణం 351 ఎకరాలు ఉండగా,  దాని చుట్టు పక్కల 15 నుంచి 18 ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన సమస్య నెలకొంది. జవహర్‌‌‌‌నగర్‌‌‌‌, దమ్మాయిగూడ, కార్మికనగర్‌‌‌‌, బాలాజీనగర్‌‌‌‌, గబ్బిలాలపేట, అంబేద్కర్‌‌‌‌నగర్‌‌‌‌, మల్కారం, రాజీవ్‌‌‌‌గాంధీ నగర్‌‌‌‌, శాంతి నగర్‌‌‌‌, ప్రగతి నగర్‌‌‌‌, హరిదాసుపల్లి, చెన్నాయిపల్లి, బీజేఆర్‌‌‌‌ నగర్‌‌‌‌, అహ్మద్‌‌‌‌గూడ, తిమ్మాయపల్లి, నాగారం, బండ్లగూడ, రాంపల్లి, యాప్రాల్, సైనిక్ పురి, ఈసీఎల్ ప్రాంతాల్లో సాయంత్రమైందంటే  స్థానికులు బయటకు రాలేని దుస్థితి ఉంది.

యార్డులో చెత్త పేరుకుపోతుండగా  ఇప్పటికే స్థలం లేక కార్మికనగర్ లో 16 ఇండ్లను ఖాళీ చేయించారు. 2017లో నేషనల్​గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. యార్డులో 80 శాతం చెత్తను తగ్గించి మిగతా 20 శాతం రీ సైక్లింగ్ చేయాలని,    మూడేళ్లలోగా యార్డును తరలించాలని గతేడాది జులైలోనూ ఎన్టీటీ ఆర్డర్ ఇచ్చింది. అయినా ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగానే ఉంటున్నారు.  యార్డు నుంచి వచ్చే దుర్వాసన భరించలేక ఇండ్లను ఖాళీ చేస్తుండటమే కాకుండా, కొత్తగా ఎవరూ రావడం లేదని స్థానికులు వాపోయారు. 

యార్డు సమస్యను భరించలేకపోతున్నాం 

డంపింగ్ యార్డు సమస్య రోజురోజుకు డేంజర్ గా మారుతుంది. దుర్వాసన మరింత ఎక్కువైంది. ఇక్కడ సమస్య లేకుండా ఉండటానికి దుండిగల్, సంగారెడ్డి జిల్లా ప్యారనగర్, బీబీ నగర్ లోని యాచారం, లక్డారంలో కొత్తగా ప్లాంట్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇందులో దుండిగల్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీన్ని  త్వరగా ఓపెన్ చేయడంతో పాటు మిగతా చోట్ల త్వరగా నిర్మించాలి.

 – పద్మాచారి, డంపింగ్ యార్డు  వ్యతిరేక జేఏసీ కన్వీనర్