
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో సింగరేణి సంస్థ నుంచి రావాల్సిన డిస్ర్టిక్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. మూడు సంవత్సరాల నుంచి సకాలంలో ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో నిధులకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ఇప్పటివరకు డీఎంఎఫ్ టీ అకౌంట్లో జమ అయిన మొత్తానికి మించి వర్క్ సాంక్షన్లు ఇవ్వడం వల్ల కాంట్రాక్టర్లకు చెల్లింపులు నిలిచిపోయి పనులు ఆగిపోతున్నాయి. ఇప్పటికే చేసిన పనులకు ఏడాది రెండేండ్ల నుంచి బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఎన్నికల సంవత్సరం కావడం, వివిధ పథకాల కింద ప్రభుత్వం నుంచి ఆశించినన్ని ఫండ్స్రాకపోవడంతో ఎమ్మెల్యేలు ప్రతి పనికీ డీఎంఎఫ్ పైనే ఆధారపడుతున్నారు. సీఎంఓలో పైరవీలు చేసి ఇష్టారీతిన సాంక్షన్లు ఇచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఎన్నికల లోపు ఈ పనులన్నీ పూర్తయితేనే నాలుగు ఓట్లు రాలుతాయని, లేదంటే మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
బకాయిలు రూ.105 కోట్లు ప్రభుత్వం 2016–17 సంవత్సరంలో డిస్ర్టిక్ట్ మినరల్ పౌండేషన్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాలో సింగరేణి బొగ్గు తవ్వకాలతో పాటు ఇతర మైనింగ్ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయంపై ఆయా సంస్థలు డీఎంఎఫ్ నిధులు చెల్లించాలి. ఈ నిధులతో మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన పనులు చేపట్టాలి. జిల్లాలో డీఎంఎఫ్‌టీకి ప్రధాన ఆదాయ వనరు సింగరేణే. 2016–17 సంవత్సరం నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరం వరకు రూ.423.09 కోట్ల డిపాజిట్లు వచ్చాయి. ఇందులో కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్భూపాలపల్లి జిల్లాల వాటా రూ.41.98 కోట్లు పోగా, రూ.381.11 కోట్లు ఉన్నాయి. డీఎంఎఫ్ డిపాజిట్లలో 15 శాతం నిర్వహణ ఖర్చులకు కేటాయించగా, 85 శాతం నిధులను అభివృద్ధి పనులకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లెక్కన నిర్వహణ ఖర్చుల కింద రూ.57.16 కోట్లు పోగా, రూ.323.94 మిగిలాయి. ఇప్పటివరకు రూ.362.96 కోట్ల పనులు సాంక్షన్ చేశారు. మరో రూ.60 కోట్లు ఇతర జిల్లాలకు కేటాయించారు. మొత్తం రూ.422.96 కోట్ల విలువైన పనులు సాంక్షన్ చేశారు. ఈ ఏడాది మార్చి నాటికి రూ.99.01 కోట్ల లోటు ఉండగా, ఆ తర్వాత ఎమ్మెల్యేలు మరో రూ.6 కోట్ల పనులకు సాంక్షన్ ఆర్డర్లు తెచ్చుకున్నారు. ఈ లెక్కన దాదాపు రూ.105 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.
2019–20 నుంచి రావట్లే....
సింగరేణి ప్రభావిత జిల్లాలకు డీఎంఎఫ్ బంగారు బాతులా మారింది. 2016–17లో రూ.32.75 కోట్ల డిపాజిట్లు మాత్రమే వచ్చాయి. 2017–18లో రూ.199.92 కోట్లు, 2018–19లో రూ.113.24 కోట్లు జమయ్యాయి. ఈ రెండేండ్లు సింగరేణి నుంచి భారీగా ఫండ్స్ రావడంతో డిపాజిట్లు రూ.350 కోట్లు దాటాయి. ఆ తర్వాత 2019–20 సంవత్సరం నుంచి సింగరేణి వాటా పూర్తిస్థాయిలో రావడం లేదు. అయినప్పటికీ ఎమ్మెల్యేలు ప్రతి పనికీ డీఎంఎఫ్పైనే ఆధారపడి ఇష్టారీతిన వర్క్ సాంక్షన్లు ఇచ్చారు. మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్లు ఉండడంతో వివిధ అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయిస్తున్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు స్కూళ్లు, లైబ్రరీల డెవలప్మెంట్ వర్క్స్‌కు డీఎంఎఫ్ కిందే సాంక్షన్లు ఇస్తున్నారు. ఎన్నికల నాటికైనా పెండింగ్ఫండ్స్వస్తాయా, పనులు పూర్తవుతాయా లేదా అని టెన్షన్ పడుతున్నారు.
డీఎంఎఫ్పై సీఎంఓ పెత్తనం
డీఎంఎఫ్ మానిటరింగ్ కోసం ప్రభుత్వం డిస్టిక్ మినరల్ పౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ)ను ఏర్పాటు చేసి జిల్లా ఇన్చార్జి మినిస్టర్‌కు పూర్తి పవర్స్ అప్పగించింది. ఈ ట్రస్ట్‌కు ఇన్చార్జి మంత్రి చైర్మన్‌గా, కలెక్టర్కన్వీనర్గా వ్యవహరిస్తారు. వివిధ డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు మెంబర్లుగా ఉంటారు. మొదట్లో ఈ కమిటీ బాగానే పనిచేసినప్పటికీ ప్రభుత్వం క్రమంగా డీఎంఎఫ్‌ను సీఎంఓ (చీఫ్ మినిస్టర్స్ఆఫీస్) ఆధీనంలోకి తీసుకుంది. సీఎంఓ నుంచే పూర్తి స్థాయిలో మానిటరింగ్చేస్తూ వచ్చిన నిధులను వచ్చినట్టే పక్కదారి పట్టిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు సింగరేణి నుంచి డీఎంఎఫ్‌టీకి ఎన్ని ఫండ్స్రావాలి, ఎంత వచ్చాయో కూడా అధికారులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. వర్క్ సాంక్షన్ ఆర్డర్లు, బిల్లులు సైతం సీఎంఓ నుంచే రిలీజ్అవుతున్నాయి. ఎమ్మెల్యేలు ఏదైనా పని కావాలంటే సీఎంఓలో పైరవీలు చేసుకోవాల్సిన
పరిస్థితి నెలకొంది.