8 రాష్ట్రాలకు కేంద్రం లేఖలు..వైరస్ కట్టడికి సలహాలు, సూచనలు

8 రాష్ట్రాలకు కేంద్రం లేఖలు..వైరస్ కట్టడికి సలహాలు, సూచనలు

కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. కోరలు చాస్తూ..మనుషుల ప్రాణాలు తీస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకు వైరస్ విస్తరిస్తోంది. దేశంలో కరోనా కల్లోకలం మరోసారి ఆందోళన కల్గిస్తోంది. ఇండియాలో కోవిడ్ -19 కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. శుక్రవారం (ఏప్రిల్ 21) ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది.

కరోనా మహమ్మారి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తూ.. ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్  రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలు రాశారు. కరోనా వైరస్ నిర్మూళనకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని లేఖలో స్పష్టం చేశారు. 
 
మార్చి, 2023 నుంచి ఇండియాలో కోవిడ్ కేసులు పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. ఏప్రిల్, 20, 2023 నాటికి10,262 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉందని లేఖలో హెచ్చరించారు. అత్యధిక సంఖ్యలో కేసులు నమోదువుతున్న జిల్లాలు, పట్టాణాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని, వైరస్ కట్టడికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది.

కోవిడ్ వైరస్ నియంత్రణకు ఐదు రెట్లు వ్యూహాన్ని అనుసరించాలని, అంటే టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్ తో పాటు పబ్లికే స్వతహాగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని రాష్ట్రాలకు సూచించారు. తాము జారీ చేసిన అన్ని రకాల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని లేఖలో కోరారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్. 

కోవిడ్ వైరస్ వ్యాప్తి ముగియలేదని, ఇంకా తీవ్రస్థాయిలో విజృంభిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వివరించారు. వైరస్ నిర్మూళనలో అలసత్వం వహించకుండా.. ప్రజల్లోనూ అవగాహన పెంచేలా చూడాలని కోరారు. 

భారతదేశంలో కోవిడ్ కేసులు

భారతదేశంలో కొత్తగా 11,692 కరోనా కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 66,170కి పెరిగాయని శుక్రవారం (ఏప్రిల్ 21) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో28 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకూ మరణాల సంఖ్య 5,31,258కి పెరిగింది.