మెడికోపై గ్యాంగ్ రేప్.. బెంగాల్లో ఘోరం.. పానీపూరి తినేందుకు వెళ్లిన యువతిపై దారుణం

మెడికోపై గ్యాంగ్ రేప్.. బెంగాల్లో ఘోరం.. 	పానీపూరి తినేందుకు వెళ్లిన యువతిపై దారుణం
  • ఫోన్ గుంజుకుని.. అడవిలోకి ఈడ్చుకెళ్లి అత్యాచారం
  • బాధితురాలి స్వస్థలం ఒడిశాలోని జలేశ్వర్

కోల్​కతా: బెంగాల్​లో దారుణం చోటు చేసుకుంది. దుర్గాపూర్​లోని శివపూర్ ఏరియాలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న 23 ఏండ్ల యువతి గ్యాంగ్​రేప్​కు గురైంది. ఆమె చదువుతున్న కాలేజీ వెనుకాలే కొందరు ఆమెపై దాడి చేసి.. ఫోన్ లాక్కున్నారు. పర్సులో ఉన్న డబ్బులు గుంజుకుని.. అడవిలోకి ఈడ్చుకెళ్లి రేప్ చేశారు. 

ఈ ఘటన శుక్రవారం (అక్టోబర్ 11) రాత్రి జరిగింది. ప్రస్తుతం బాధితురాలి హెల్త్ కండిషన్ సీరియస్​గా ఉంది. గ్యాంగ్ రేప్ ఘటనపై అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. తన కూతురు హెల్త్ కండిషన్ సీరియస్​గా ఉన్నా హాస్పిటల్ సిబ్బంది పట్టించుకోలేదని తండ్రి ఆరోపించారు.

అసలేం జరిగింది?

ఒడిశాలోని జలేశ్వర్​కు చెందిన 23 ఏండ్ల యువతి.. దుర్గాపూర్​లోని ఐక్యూ సిటీ మెడికల్ కాలేజీలో చదువుతోంది. శుక్రవారం రాత్రి 8.30 గంటల టైమ్​లో ఆమె తన స్నేహితుడితో కలిసి పానీపూరి తినేందుకు కాలేజీ నుంచి బయటకు వచ్చింది. అప్పటికే క్యాంపస్ గేటు వద్ద నలుగురైదుగురు యువకులు ఉన్నారు. 

అందులో ఒకడు యువతి ఫోన్ లాక్కున్నాడు. రూ.3 వేలు ఇస్తేనే ఫోన్ ఇస్తానని డిమాండ్ చేశాడు. మిగిలినవాళ్లు బాధితురాలితో వచ్చిన యువకుడిని పక్కకు నెట్టేశారు. దీంతో అతను పారిపోయాడు. ఆ తర్వాత అమ్మాయిని కాలేజీ వెనుక ఉన్న అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని హాస్పిటల్​కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్​గా ఉంది.

నా కూతురుకు న్యాయం చేయండి..

గ్యాంగ్ రేప్ ఘటనలో తన కూతురు స్నేహితుడు వసీఫ్ అలీ హస్తం కూడా ఉందని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘రేపిస్టులందరూ వసీఫ్ అలీకి తెలిసినవాళ్లే. వారంతా కలిసే ఈ దారుణం చేశారు. కాలేజీ ఆవరణలోనే ఇదంతా జరిగింది. డాక్టర్ కావాలన్న నా కూతురు కలను చిదిమేశారు. నా కూతురుకు న్యాయం చేయండి’’ అని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. 

వెస్ట్ బెంగాల్ డాక్టర్స్ ఫ్రంట్ (డబ్ల్యూబీడీఎఫ్) ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. బెంగాల్​లోని మెడికల్ క్యాంపస్​లు యువతులకు సేఫ్​గా లేవని మండిపడింది. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. మహిళా సీఎంగా ఉన్న వెస్ట్​బెంగాల్​లోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.