ODI World Cup 2023: అసలంక వీరోచిత సెంచరీ.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

ODI World Cup 2023: అసలంక వీరోచిత సెంచరీ.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

వరల్డ్ కప్ లో శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక బ్యాటర్లు పర్వాలేదనిపించారు. సెమీస్ రేస్ లో ఉండాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో బంగ్లా బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. 
         
మిడిల్ ఆర్డర్ బ్యాటర్ చరిత అసలంక 105 బంతుల్లో 108 పరుగులు చేసి శ్రీలంక భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు అసలంక వీరోచిత సెంచరీకి తోడు సధీర సమర విక్రమే(41), ఓపెనర్ నిస్సంక(41) రాణించారు.  ధనంజయ డిసిల్వా 34 పరుగులు చేస్తే తీక్షణ 22 పరుగులు చేసి తమ వంతు పాత్ర పోషించారు. 135 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా అసలంక లోయర్ ఆర్డర్ తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి లంక జట్టుకు భారీ స్కోర్ అందించాడు. బంగ్లా బౌలర్లలో హాసన్ షకీబ్ మూడు వికెట్లు తీసుకోగా.. కెప్టెన్ షకీబల్ హసన్, షోరిఫుల్ ఇస్లాం రెండేసి వికెట్లు తీసుకున్నారు. మెహదీ హసన్ మిరాజ్ కు ఒక వికెట్ దక్కింది. 
      .
ఇక ఈ మ్యాచ్ లో శ్రీలంక సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ ఊహించని రీతిలో ఔటయ్యాడు.సమయానికి క్రీజులోకి చేరుకోకపోవడంతో బంగ్లా ప్లేయర్లు అప్పీల్ చేసారు. దీంతో మాథ్యూస్ ను అంపైర్లు ఔట్‌గా ప్రకటించగా.. అరుణ్ జైట్లీ స్టేడియం ఒక్కసారి షాక్ కు గురైంది.   క్రికెట్ చరిత్రలో ఒక బ్యాటర్ ఇలా ఔటవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.