డంపింగ్ ​యార్డులో ఆసరా అప్లికేషన్లు

డంపింగ్ ​యార్డులో ఆసరా అప్లికేషన్లు
  • సిరిసిల్ల జిల్లా ఆవునూరులో దర్శనమిచ్చిన దరఖాస్తులు
  • విచారణ జరిపిస్తామన్న ఎంపీడీవో

ముస్తాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం కొత్తగా అప్లై చేసుకుంటున్నవాళ్ల దరఖాస్తులకు ఏడాదిన్నరగా మోక్షం లభించడం లేదు. 2021 వరకు అడపాదడపా కొత్త పింఛన్లు మంజూరు చేసిసినా తర్వాత తీసుకుంటున్న అప్లికేషన్లు బుట్టదాఖలవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షన్నర మంది అప్లికేషన్లు పెట్టుకొని పింఛన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా  ముస్తాబాద్ మండలంలోని ఆవునూరులో 2021లో పింఛన్​కోసం అప్లై చేసుకున్న వారి దరఖాస్తు ఫారాలు మంగళవారం స్థానిక డంపింగ్ యార్డ్ లో దర్శనమివ్వడం కలకలం రేపింది. వీరిలో చాలా మంది అర్హులైనప్పటికీ పింఛన్లు అందలేదు. గ్రామానికి చెందిన కాసారపు బాలయ్య అప్లికేషన్​ కూడా ఇందులో ఉంది. ఆయన వయస్సు 2021లో 65 కాగా పింఛన్​ రావట్లేదు.

దరఖాస్తు డంపింగ్​ యార్డులో పడి ఉందన్న విషయం తెలుసుకున్న బాలయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాలయ్య మాట్లాడుతూ ‘ నా వయస్సు డెబ్బైకి దగ్గర పడ్తంది. ఎనిమిదేండ్ల నుంచి దరఖాస్తులు పెడ్తనే ఉన్నా. తిరగనీకే వేలు ఖర్సు చేసిన..అయినా పింఛన్​ రాలే. ఎక్కడెక్కడనో అడిగినా..ఏం చెప్తలేరు’ అని వాపోయాడు. ఆవునూరు సెక్రెటరీ మల్లికార్జున్ ను  సంప్రదించగా, ఎంపీడీఓ ఆఫీసులో ఉండాల్సిన అప్లికేషన్లు డంపింగ్​ యార్డులోకి ఎలా వచ్చాయో తెలియదన్నారు. ఎంపీడీవో రమాదేవిని వివరణ కోరగా,  ఎవరో కావాలనే అప్లికేషన్లను డంప్​యార్డులో పడేసినట్లు తెలుస్తోందని, ఎంక్వైరీ చేయిస్తామని చెప్పారు.