అక్టోబర్‌‌‌లో ఇవ్వాల్సిన ఆసరా పైసలు డిసెంబర్ వచ్చినా అందలే

అక్టోబర్‌‌‌లో ఇవ్వాల్సిన ఆసరా పైసలు డిసెంబర్ వచ్చినా అందలే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆసరా లబ్ధిదారులకు రెండు నెలలుగా పింఛన్లు అందడం లేదు. అక్టోబర్‌‌ మొదటి వారంలోనే పంపిణీ చేయాల్సిన పింఛన్లను డిసెంబర్ వచ్చినా ఇవ్వడం లేదు. ఆసరా పైసలు చేతికందక వృద్ధులు, దివ్యాంగులు దిక్కులు చూస్తున్నారు. పైసలు పడ్డాయో లేదో కనుక్కునేందుకు రోజూ పోస్టాఫీసులు, బ్యాంకులకు వెళ్లొస్తున్నారు. ఎలాంటి ఆర్థిక వనరు లేని అభాగ్యులు మందుగోలీలు, నిత్యావసరాల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబర్ వచ్చినందున అక్టోబర్‌‌‌‌తో పాటు నవంబర్ పిం ఛన్ కూడా జమ చేయాలని కోరుతున్నారు.

2020 లాక్ డౌన్ నుంచి..

రాష్ట్రంలో రెండున్నరేండ్లుగా ఆసరా పింఛన్లు టైమ్‌‌కు అందడం లేదు. 2020లో లాక్‌‌డౌన్‌‌తో మొదలైన ఈ పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతున్నది. రాష్ట్ర ఖజానాలో నిధులను బట్టి ప్రతి నెలా 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వం ఉద్యోగులకు జిల్లాల వారీగా జీతాలను జమ చేస్తున్నది. ఆసరా పింఛన్లను గతేడాది 15 నుంచి 23 తారీఖు మధ్య జమ చేసేది. కానీ ఈ ఏడాది నుంచి 22 నుంచి 27 తేదీ మధ్యన ఇస్తున్నది. డిసెంబర్ కూడా రావడంతో లెక్క ప్రకారం ఆసరా లబ్ధిదారులకు అక్టోబర్, నవంబర్ పింఛన్ అందాల్సి ఉంది. ఆసరా పింఛన్‌‌ కింద ప్రతి నెలా వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, నేత, గీత కార్మికులు, బోదకాలు బాధితులు, ఎయిడ్స్ రోగులకు రూ.2,016 చొప్పున, దివ్యాంగులు, వృద్ధ కళాకారులకు రూ.3,016 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నది. 45,80,746 మందికి ప్రతి నెలా రూ.975.75 కోట్లు చెల్లిస్తున్నది. ప్రభుత్వం నుంచి ఫండ్స్ రిలీజ్ కాకపోవడంతో పింఛన్లు సకాలంలో అందించలేకపోతున్నామని సెర్ప్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. చిల్లర ఖర్చులకు ఇబ్బంది పడుతున్నామని, రోజూ పోస్ట్‌‌ ఆఫీస్‌‌, బ్యాంకులు, పంచాయతీ కార్యాలయాలకు వచ్చి పోతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఆరో తారీఖు ఇచ్చేవారని, ఇప్పుడు నెల దాటినా ఇవ్వడం లేదని వాపోతున్నారు.