ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

అధికారికంగా విమోచన దినోత్సవం
రామచంద్రాపురం : ఎంఐఎం పార్టీకి భయపడి ఎనిమిదేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని, కానీ తెలంగాణ విముక్తి కోసం అసువుల బాసిన అమరుల త్యాగాలను స్మరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహిస్తోందని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్​ రెడ్డి అన్నారు. శుక్రవారం రామచంద్రాపురంలో నిర్వహించిన పార్టీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 75 ఏండ్ల  స్వతంత్ర హైదరాబాద్​ విమోచన  ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో శనివారం హైదరాబాద్​లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. బీజేపీ  రాష్ట్ర కార్యదర్శి అట్లూరి రామకృష్ణ, లీడర్లు బాబుమోహన్​, విష్ణువర్ధన్ రెడ్డి, దేశ్​ పాండే, మహిళా మోర్చా లీడర్ ​గోదావరి అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్​ గౌడ్​ పాల్గొన్నారు.

సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే ఊరుకోం
కోహెడ(హుస్నాబాద్​) : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పునాది వేసింది కమ్యూనిస్టులని, ఈ చరిత్రను  బీజేపీ వక్రీకరించాలని చూస్తే ఊరుకోబోమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ సాయుధ పోరాట 74వ వారోత్సవాల సందర్భంగా హుస్నాబాద్​లోని అనభేరి ప్రభాకర్ రావు విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హుస్నాబాద్ నుంచి మండలంలోని మహ్మదాపూర్ వరకు 500 బైక్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మహ్మదాపూర్ గుట్టలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి ఎలాంటి సంబంధం లేని బీజేపీ, ఆర్ఎస్ఎస్ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. హిందూ, ముస్లిం పేరుతో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు.  తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న సమరయోధులకు గతంలో పెన్షన్ ఇచ్చేవారని, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ స్కీంను రద్దు చేసిందన్నారు.

  • ఆశా వర్కర్లకు ఫిక్స్​డ్​ సాలరీలు చెల్లించాలి
  • సీఐటీయూ జిల్లా నాయకురాలు నర్సమ్మ

మెదక్​ టౌన్ : - ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఫిక్స్​డ్​ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ మెదక్​ జిల్లా కోశాధికారి నర్సమ్మ  డిమాండ్ చేశారు. గురువారం మెదక్​లోని కేవల్​ కిషన్​ భవనంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్​లో ఆశా వర్కర్స్​కు ప్రతినెలా పదివేల ఫిక్స్​డ్​ వేతనాలు చెల్లిస్తున్నట్లుగానే  తెలంగాణలోనూ ఇవ్వాలని కోరారు. ఆశా వర్కర్స్ 20 ఏండ్లుగా సేవలందిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పారితోషికాలు మాత్రమే చెల్లిస్తుందన్నారు. ఆశా వర్కర్లతో వెట్టిచాకిరీ చేయిస్తూ వారికి అన్యాయం చేయడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచి ఫిక్స్​డ్​ వేతనాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆశా యూనియన్ నాయకులు కవిత, సబిత, చంద్రకళ, రాములమ్మ, దుర్గాభవాని, విజయ,  రమ్య పాల్గొన్నారు.

అత్యాచారం కేసులో నేరస్తుడికి 20 ఏండ్ల జైలు శిక్ష
సిద్దిపేట రూరల్, వెలుగు: బాలికపై అత్యాచారం కేసులో నేరస్తుడికి 20 ఏండ్ల కఠిన కారాగార జైలు శిక్షతో పాటుగా, రూ.10 వేలు జరిమానా విధిస్తూ సిద్దిపేట ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ అండ్ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. సిద్దిపేట పట్టణం హనుమాన్ నగర్ కు చెందిన పానేటి నర్సింలు(20) తన కాలనికి  ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడి చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అప్పటి సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, టూటౌన్ సీఐ ఆంజనేయులు పరిశోధన పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పూర్తి విచారణ అనంతరం శుక్రవారం జడ్జి నిందితుడికి ఈ మేరకు శిక్ష విధించారు. ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ అధికారులను సీపీ ఎన్. శ్వేత అభినందించారు.

కరెంట్ షాక్​ తో రైతు మృతి
మెదక్ :  ప్రమాదవశాత్తు కరెంట్​షాక్​తగలి కి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన హవేలీఘనపూర్ మండలం కూచన్​పల్లిలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన ఆకుల వెంకటి (44) పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. బోరు ఆన్ ​కాకపోవడంతో పరిశీలిస్తుండగా కరెంట్​షాక్ ​కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

20న సంగారెడ్డి జడ్పీ సమావేశం
సంగారెడ్డి :  జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 20న నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో సీహెచ్ ఎల్లయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్ పర్సన్ మంజుశ్రీ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 

సిద్దిపేటలో ప్రైవేట్​హాస్పిటల్ సీజ్
సిద్దిపేట రూరల్, వెలుగు : పేదలకు ఉచితంగా అందించే ప్రభుత్వ ఆసుపత్రి మందులను అక్రమంగా నిల్వ ఉంచిన సిద్దిపేట పట్టణంలోని విజయలక్ష్మి హాస్పిటల్ ను శుక్రవారం రెవెన్యూ అధికారులు, పోలీసులు సీజ్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని విజయలక్ష్మి హాస్పిటల్ లో ప్రభుత్వ మందులు వాడుతున్నారన్న ఫిర్యాదు మేరకు గురువారం రాత్రి అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి మందులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. కాగా ఆ హాస్పిటల్​లో మరో గదికి తాళం వేసి ఉండడంతో వారు తనిఖీ చేయలేకపోయారు. ఈ క్రమంలో 
డీఎంహెచ్​వో కాశీనాథ్, ఎమ్మార్వో విజయ్ సాగర్​ ఆ ఆసుపత్రిని శుక్రవారం ఉదయం మరోసారి తనిఖీ చేశారు. ఆ గదిలో ఏమీ లేకపోవడంతో గురువారం దొరికిన మెడిసిన్ ను డ్రగ్ ఇన్స్ పెక్టర్ అందజేసి హాస్పిటల్ ను సీజ్ 
చేశారు.

పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం.. 
మెదక్​ టౌన్ :  తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మెదక్​, నర్సాపూర్ పట్టణాల్లో నిర్వహించిన ర్యాలీలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని మెదక్​ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. 

అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం
చేర్యాల : వీరబైరాన్​పల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్​రెడ్డి భరోసానిచ్చారు. శుక్రవారం దూల్మిట్ట మండలంలోని బైరాన్​పల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదేండ్లుగా తెలంగాణ విమోచన దినం జరుపని సీఎం కేసీఆర్​కు ప్రజలు దూరమవుతున్నారని గమనించే జాతీయ సమైక్యతా దినంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినం అధికారికంగా జరపాలని డిమాండ్​ చేసిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎంకు భయపడి నిర్వహించలేదని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జనగామ, మెదక్​ జిల్లాల అధ్యక్షులు ఆరుట్ల దశమంతరెడ్డి, గడ్డం శ్రీనివాస్​, సిద్దిపేట జిల్లా కార్యదర్శి బూర్గు సురేశ్ గౌడ్, కేవీఎల్​ఎన్​ రెడ్డి, ముక్కెర తిరుపతిరెడ్డి, ఎ. శశిధర్​రెడ్డి, ఉమారాణి, పాండు, సురేందర్, భిక్షపతినాయక్​ పాల్గొన్నారు.

క్రాప్ లోన్లు ఇన్​టైంలో రెన్యువల్ చేసుకోవాలి
సిద్దిపేట రూరల్ : క్రాప్ లోన్లు సరైన సమయంలో రెన్యువల్ చేసుకోవాలని మాచాపూర్ గ్రామ సర్పంచ్ పంజాల భాగ్యలక్ష్మి బాలయ్య అన్నారు. శక్రవారం సిద్దిపేట రూరల్ మండలం మాచాపూర్ గ్రామంలో ఆమె ఏపీజీవీపీ బ్యాంక్ మేనేజర్ హేమ తో కలసి గ్రామ సభ ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులంతా బ్యాంకుల ద్వారా వచ్చే లాభాలు, ఇన్సూరెన్స్ వివరాలను తెలుసుకోవాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు ఎప్పటికప్పుడు రుణాలను చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో రీజినల్ ఆఫీసర్ సంతోష్, ఫీల్డ్ అసిస్టెంట్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.

మల్లన్న ఆలయ కమిటీ నియామకం
కొమురవెల్లి : 15 మంది సభ్యులతో మురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ కొత్త పాలక మండలిని దేవాదాయ శాఖ ప్రకటించింది. శుక్రవారం దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులుగా గీస భిక్షపతి, మరుపల్లి శ్రీనివాస్, నర్ర రఘువీరరెడ్డి, చిట్కూరి తిరుపతి, శనిగరం లక్ష్మీనారాయణ, జటోత్ స్వప్న, ఎర్రగొల్ల మల్లేశం, కందుకూరి సిద్ధిలింగం, బోయిన సాయికుమార్, బుడిగే రమేశ్​గౌడ్, గడ్డం మహేశ్​యాదవ్, పచ్చిమడ్ల సిద్ధిరాములు, నమిరెడ్డి సౌజన్య, సూటిపల్లి బుచ్చిరెడ్డిని నియమించారు.  వీరితో పాటు ఎక్స్ఆఫిషియో మెంబర్ గా ఆలయ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్ వ్యవహరించనున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ గా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అనుచరుడు గీస భిక్షపతిని ఎన్నుకునే అవకాశం ఉంది అంటున్నారు.  కాగా, ఈ కమిటీ సంవత్సరకాలంపాటు
 కొనసాగనున్నది.

అంబేద్కర్ విగ్రహానికి మంత్రి నివాళులు
సిద్దిపేట : తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి సీఎం కేసీఆర్​ దార్శనికతను చాటారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పాత బస్టాండు సర్కిల్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని 207 మంది లబ్ధిదారులకు రూ.72 లక్షల విలువైన సీఏంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అంతకుముందు  సిద్దిపేట పట్టణ శివారు​ లోని  తేజో వనంలో బీట్ అధికారుల నివాస గృహాలు, మూషిక జింకల ఎన్ క్లోజర్ ను  మంత్రి ప్రారంభించారు. విపంచి ఆడిటోరియంలో రుతుప్రేమ కార్యక్రమ అవగాహన కార్యక్రమంలోనూ మంత్రి పాల్గొన్నారు. 

డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి
నారాయణ ఖేడ్ : డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం  ‘ప్రజాగోస  బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అవినీతి పాలనను అంతమొందించడానికి బీజేపీని  అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప, మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య
కంగ్టి : సీఎం కేసీఆర్ హయాంలో సర్కారు బడులో స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందుతోందని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని హై స్కూల్ లో ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంస పత్రాలతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో స్టూడెంట్లకు మంచి విద్యతో పాటు మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. 

అభివృద్ధికి అండగా ఉండండి
రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించి అండగా ఉండాలని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం మండల పరిధిలోని పలు గ్రామాలల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొత్తగా మంజూరైన పింఛన్లు, కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు 
అందజేశారు. 

ఘనంగా ‘సమైక్యతా’ ర్యాలీ
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి మెదక్​ జిల్లాలోని పలు పట్టణాల్లో భారీ ర్యాలీ, సభలు నిర్వహించారు. మంత్రి హరీశ్​రావుతోపాటు పలుచోట్ల, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు జెండా ఊపి ర్యాలీలు ప్రారంభించారు. సిద్దిపేట, దుబ్బాకలో మంత్రి హరీశ్​రావు, మెదక్, నర్సాపూర్, జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్​చెరు, అందోల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలెక్టర్లు, అడిషనల్​ కలెక్టర్లు, ఇతర నాయకులు, అధికారులు వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలుచోట్ల నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జాతీయ జెండాలతో వేలాదిమంది ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.