లంక బచ్​గయా..సూపర్‌‌-4కు శ్రీలంక.. పోరాడి ఓడిన అఫ్గాన్​

లంక బచ్​గయా..సూపర్‌‌-4కు శ్రీలంక.. పోరాడి ఓడిన అఫ్గాన్​
  • సూపర్​4లో నేడు
  • పాకిస్తాన్ x బంగ్లాదేశ్‌‌
  • మ. 3 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో

లాహోర్‌‌: ఆసియా కప్‌‌లో గ్రూప్​ దశలోనే వెనుదిరిగే ప్రమాదాన్ని డిఫెండింగ్​ చాంపియన్​ శ్రీలంక తప్పించుకుంది. ఆ జట్టును వణికించిన అఫ్గానిస్తాన్‌‌ కొద్దిలో సూపర్‌‌–4 బెర్త్‌‌ను దూరం చేసుకుంది. స్టార్టింగ్‌‌లో అద్భుతంగా ఆడినా ఆఖర్లో తడబడింది. మంగళవారం జరిగిన గ్రూప్​–బి చివరి మ్యాచ్​లో  లంక నిర్దేశించిన 292 రన్స్‌‌ టార్గెట్‌‌ను అఫ్గాన్​ 37.1 ఓవర్లలో ఛేజ్​ చేస్తే సూపర్​4 చేరుకునేది.  ఛేజింగ్‌‌లో అద్భుతంగా ఆడిన అఫ్గాన్‌‌ 37 ఓవర్లలో 289/8 రన్స్‌‌ చేసింది. మరో  బాల్‌‌కు మూడు రన్స్‌‌ కొడితే సూపర్​4  బెర్త్​ దక్కేది. కానీ, ఈ బాల్​కు ముజీబుర్‌‌ (0) ఔటయ్యాడు. మరో మూడు బాల్స్‌‌లో ఆరు రన్స్‌‌ కొడితే  టోర్నీలో ముందుకెళ్లే అవకాశం ఉండగా..  ఫజల్‌‌హక్‌‌ (0) ఆఖరి వికెట్​గా ఔటయ్యాడు. దాంతో, 37.4 ఓవర్లలో 289 రన్స్‌‌కు ఆలౌటైన అఫ్గాన్​ 2 రన్స్‌‌ తేడాతో ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది. ఓటమి  తప్పించుకున్న  శ్రీలంక సూపర్​4 బెర్తు దక్కించుకుంది. 

మహ్మద్‌‌ నబీ (65), హష్మతుల్లా షాహిది (59), రెహమత్‌‌ షా (45), రషీద్‌‌ (27 నాటౌట్‌‌) పోరాడినా అఫ్గాన్​ నెగ్గలేకపోయింది. లంక బౌలర్లలో  కాసున్‌‌ రజిత 4 వికెట్లు తీశాడు. తొలుత  శ్రీలంక 50 ఓవర్లలో 291/8 స్కోరు చేసింది. కుశాల్‌‌ మెండిస్‌‌ (84 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 92) చెలరేగాడు. పాథుమ్‌‌ నిశాంక (41), కరుణరత్నె (32), చరిత్‌‌ అసలంక (36)తో పాటు చివర్లో దునిత్‌‌ (33 నాటౌట్‌‌), తీక్షణ (28) విలువైన రన్స్​తో ఆకట్టుకున్నారు. గుల్బాదిన్‌‌ నైబ్‌‌ 4, రషీద్‌‌ 2 వికెట్లు తీశారు. కుశాల్​ మెండిస్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. గ్రూప్​–ఎ నుంచి ఇండియా, పాక్​, గ్రూప్​–బి లంక, బంగ్లా సూపర్​–4 చేరుకున్నాయి. మరోవైపు సూపర్‌‌–4, ఫైనల్‌‌ మ్యాచ్‌‌లను హంటన్‌‌టోటాకు తరలించాలని భావించిన ఏసీసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 
ఈ మ్యాచ్‌‌లు కొలంబోలోనే జరుగుతాయి.