ఆసియా ఆర్చరీలో ఇండియకు 8 బంగారు పతకాలు

ఆసియా ఆర్చరీలో ఇండియకు 8 బంగారు పతకాలు
  • 8 గోల్డ్‌‌ సహా 14 మెడల్స్‌‌ కైవసం

సులేమానియా (ఇరాక్‌‌):  ఆసియా కప్‌‌ స్టేజ్‌‌2 ఆర్చరీ టోర్నమెంట్‌‌లో ఇండియా జూనియర్‌‌ ఆర్చర్లు టాప్‌‌ క్లాస్‌‌  పెర్ఫామెన్స్‌‌ చేశారు. మెగా టోర్నీలో ఎనిమిది గోల్డ్‌‌, నాలుగు సిల్వర్‌‌, రెండు బ్రాంజ్‌‌ మెడల్స్‌‌ సాధించారు. మొత్తంగా 14 పతకాలు నెగ్గిన ఇండియా టోర్నీలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. పోటీల చివరి రోజైన బుధవారం  ఐదు గోల్డ్‌‌, నాలుగు సిల్వర్‌‌, ఒక బ్రాంజ్‌‌ గెలుచుకుంది. మెన్స్‌‌ కాంపౌండ్‌‌ వ్యక్తిగత విభాగాన్ని క్లీన్‌‌స్వీప్‌‌ చేసింది. కాంపౌండ్‌‌లో ప్రథమేశ్‌‌ ఫుగె హ్యాట్రిక్‌‌ గోల్డ్‌‌ మెడల్స్‌‌ సాధించగా..   రికర్వ్‌‌ ఆర్చర్‌‌ మ్రినాల్‌‌ చౌహాన్‌‌ రెండు బంగారు పతకాలు నెగ్గాడు.

రికర్వ్‌‌ విమెన్స్‌‌ టీమ్‌‌ ఈవెంట్‌‌ ఫైనల్లో ఇండియా టీమ్‌‌..  బంగ్లాదేశ్‌‌ను ఓడించి ఆఖరి రోజు బంగారు పతకాల ఖాతా తెరిచింది. ఆపై, మెన్స్‌‌ రికర్వ్‌‌ టీమ్‌‌ కూడా బంగ్లాపైనే నెగ్గి స్వర్ణం ఖాతాలో వేసుకుంది. అయితే, రికర్వ్‌‌ మిక్స్‌‌డ్‌‌ టీమ్‌‌ ఫైనల్లో  మాత్రం  0–2తో ఉజ్బెకిస్తాన్‌‌  చేతిలో ఓడి సిల్వర్‌‌కు పరిమితమైంది. కాంపౌండ్‌‌ విమెన్స్‌‌ సెక్షన్‌‌ ఫైనల్లో నెగ్గిన  సాక్షి చౌదరి గోల్డ్‌‌ గెలవగా.. పర్నీత్‌‌ కౌర్‌‌ సిల్వర్‌‌ సాధించింది. ఆఖరిదైన మెన్స్‌‌ కాంపౌండ్‌‌ ఫైనల్లో ప్రథమేశ్‌‌ 146–144తో టీమ్‌‌మేట్‌‌ రిషబ్‌‌ యాదవ్‌‌ను ఓడించి మూడో గోల్డ్‌‌ కైవసం చేసుకున్నాడు.