స్వర్ణ పతకాలతో దూసుకెళ్తున్న భారత్.. సౌమ్య, రింకు, నిషాద్ అదుర్స్!

స్వర్ణ పతకాలతో దూసుకెళ్తున్న భారత్.. సౌమ్య, రింకు, నిషాద్ అదుర్స్!

Asian Para Games 2026: జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2026 (Asian Para Games 2026) లో భారత పారా అథ్లెట్లు సంచలనం సృష్టిస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిన అద్భుత విజయాలతో ఇండియా ఖాతాలో పసిడి పతకాలు వచ్చి చేరుతున్నాయి. కేవలం నిమిషాల వ్యవధిలోనే భారత అథ్లెట్లు మూడు స్వర్ణ పతకాలను సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు.

1500 మీటర్ల పరుగులో సౌమ్య కుమార్కి పసిడి: 

మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో తన గైడ్ భారత్ కుమార్ (Bharat Kumar)తో కలిసి బరిలోకి దిగిన సౌమ్య కుమార్ అద్భుతమైన టైమింగ్‌తో రేసును ముగించింది. పాయింట్ల ప్రాతిపదికన జరిగిన ఈ హోరాహోరీ పోరులో అగ్రస్థానంలో నిలిచి దేశానికి మరో స్వర్ణ పతకాన్ని అందించింది.

లాంగ్ జంప్లో నిషాద్కి గోల్డ్: 

హైజంప్‌లో అంతర్జాతీయంగా అగ్రగామిగా ఉన్న రెండుసార్లు పారాలింపిక్స్ రజత పతక విజేత నిషాద్ కుమార్, తొలిసారి లాంగ్ జంప్ ఈవెంట్‌లో బరిలోకి దిగాడు. ఏమాత్రం తడబడకుండా అద్భుతమైన జంప్ చేసి 7.11 మీటర్ల దూరంతో తొలిసారే పసిడి పతకాన్ని ముద్దాడి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

జావెలిన్ త్రోలో రింకూ సంచలన విజయం: 

పురుషుల ఎఫ్46 జావెలిన్ త్రో (Men's Javelin F46) ఫైనల్ పోటీ అత్యంత రసవత్తరంగా కొనసాగింది. తోటి భారత అథ్లెట్ అజిత్ సింగ్ చివరి క్షణాల వరకు స్వర్ణ పతకం సాధించేలా కనిపిపించినప్పటికీ, చివరి ప్రయత్నంలో అద్భుతమైన త్రో విసిరిన రింకూ అనూహ్యంగా అజిత్ సింగ్‌ను వెనక్కి నెట్టి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుని స్టేడియాన్ని హోరెత్తించాడు.