పారదర్శకంగా ఆసరా పెన్షన్ల పంపిణీ : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

పారదర్శకంగా ఆసరా పెన్షన్ల పంపిణీ :  కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీతో కలసి బ్రాంచ్ పోస్టల్ ఆఫీసర్స్(బీపీఎం) లకు మొబైల్స్ అందజేశారు. ఈ  సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసరా పెన్షన్ల పంపిణీని మరింత పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం మొబైల్స్ అందజేసిందని తెలిపారు. 

మొబైల్​లో ప్రత్యేకంగా యాప్ ఉంటుందని, పెన్షన్ దారుల పూర్తి సమాచారం అందులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రతినెలా పెన్షన్ దారుల ఐరిస్, వేలిముద్ర ద్వారా పెన్షన్ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో  దత్తారావు తదితరులు పాల్గొన్నారు.

పూలాజీ బాబా జయంతిని ఘనంగా నిర్వహించాలి

జిల్లాలో పూలాజీ బాబా జయంతిని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్​లో ఐటీడీఏ పీవో ఖష్బూ గుప్తా, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జైనూర్ మండలం పట్నాపూర్​లోని పూలాజీ బాబా సంస్థాన్ లో ఈ నెల 30న జయంతిని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

 వేడుకలకు వచ్చే భక్తులు, ప్రముఖులకు వాహనాల పార్కింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. నిరంతరం విద్యుత్ సౌకర్యం కల్పించాలని, వీధి దీపాలు అమర్చాలని, పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా వేడుకల పోస్టర్లను రిలీజ్​ చేశారు.

లక్ష్యాలను ఎంచుకొని ముందుకు సాగాలి

కాగజ్ నగర్, వెలుగు: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటిని సాధించే దిశగా ముందుకు  సాగాలని కలెక్టర్ సూచించారు. కాగజ్ నగర్​లో జవహర్ నవోదయ విద్యాలయ లో నిర్వహించిన విద్యాలయం మేనేజ్​మెంట్ కమిటీ మీటింగ్​లో సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్​ మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో దూసుకెళ్లాలని, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్​తో పోటీపడాలన్నారు. వారికి పలు సలహాలిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు  ఆకట్టుకున్నాయి.