
ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. కలెక్టరేట్ లో ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తో కలిసి రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, జిల్లా రవాణా శాఖ, జాతీయ రహదారుల సంస్థ తదితర శాఖల అధికారులతో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు.
రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు, కల్వర్టులకు అవసరమైన చోట వెంటనే రిపేర్లు చేయాలన్నారు. ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో 19 ప్రమాదాలు జరిగాయని, మద్యం తాగి వాహనాలు నడిపిన 3,124 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.
ఇసుక లభ్యతపై నివేదికలు రూపొందించాలి
జిల్లాలో ఇసుక లభ్యతపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక రూపొందించాలని కలెక్టర్ ధోత్రే సూచించారు. కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్ తో కలిసి జిల్లాలో ఇసుక లభ్యతపై సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో ఇసుక లభ్యతపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలోని నదులు, వాగులు, చెక్ డ్యాములు, చెరువులు, ప్రాజెక్టుల్లో ఉన్న ఇసుక లభ్యతపై సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అంచనాలు రూపొందించి ఈ నెల 20లోగా నివేదికలు సమర్పించాలన్నారు. నివేదికను పబ్లిక్ డొమైన్ లో ఉంచి అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు.
నాణ్యమైన విద్య అందించాలి
ప్రభుత్వ స్కూళ్లలో చదివే స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ బాయ్స్హైస్కూల్ను కలెక్టర్ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్లాస్‌రూమ్‌లు, కిచెన్, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో విద్యనభ్యసిస్తున్నవారికి నాణ్యమైన చదువు, మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలన్నారు.
టెన్త్స్టూడెంట్లను ఇప్పటి నుంచి వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని.. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులను స్టూడెంట్లకు అర్థమయ్యే రీతిలో బోధించాలని సూచించారు. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టలన్నారు.