
ఆసిఫాబాద్, వెలుగు : భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయడంతో ఆసిఫాబాద్ ఆర్డీవో ఆఫీస్ సామగ్రిని బుధవారం జప్తు చేశారు. వివరాల్లోకి వెళ్తే... వాంకిడి మండలం బంజర పరిధిలోని పెవుట గ్రామ శివారులో 2012లో చెరువును తవ్వి కాల్వలు నిర్మించారు. ఈ చెరువు కోసం 13 మంది రైతులకు సంబంధించిన 70 ఎకరాల భూమిని సేకరించారు. ఎకరం భూమికి రూ. 80 వేల చొప్పున అప్పటి ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించింది. అయితే తక్కువ పరిహారం ఇచ్చారంటూ రైతులు 2013లో ఆసిఫాబాద్ సివిల్ కోర్టును ఆశ్రయించారు.
విచారణ జరిపిన కోర్టు రైతులకు రూ. 2,24,58,137 చెల్లించాలని 2020లో తీర్పు ఇచ్చింది. అయినా ఆఫీసర్లు పరిహారం చెల్లించకపోవడంతో రైతుల తరఫు లాయర్లు తిరిగి కోర్టులో ఈపీ వేశారు. దీంతో ఆర్డీవో ఆఫీస్ సామగ్రిని జప్తు చేయాలని ఆసిఫాబాద్ సివిల్ కోర్టు జడ్జి యువరాజ తీర్పు ఇచ్చారు. దీంతో బుధవారం కోర్టు సిబ్బంది ఆర్డీవో ఆఫీస్‌కు చేరుకొని కార్యాలయంలోని సామగ్రిని జప్తు చేసి కోర్టుకు తరలించారు.