- ఎస్పీ నితికా పంత్
ఆసిఫాబాద్/బెల్లంపల్లి/ఇంద్రవెల్లి, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆసిఫాబాద్ఎస్పీ నితికా పంత్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలందరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిస్పక్షపాతంగా, శాంతియుతంగా జరగడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఏఎస్పీ చిత్తరంజన్, సీఐ బాలాజీ వరప్రసాద్, ఎస్సైలు పాల్గొన్నారు.
- ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి
పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరగడానికి అందరు సహకరించాలని బెల్లంపల్లి ఏసీపీ ఎ.రవికుమార్ కోరారు. తాండూరుతోపాటు మండలంలోని అంగడీబజార్, రాజీవ్‌నగర్‌కాలనీ, ఐబీ అండర్ బ్రిడ్జి వద్ద ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు, డబ్బుల పంపిణీ, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
సర్కిల్ సీఐ దేవయ్య, తహసీల్దార్ జోత్స్న ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని అంజీ, గౌరపూర్, బిక్కుతండా గ్రామాల్లో సీఐ మడావి ప్రసాద్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. వీధుల్లో తిరుగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై ఓటు హక్కు దాని ప్రాముఖ్యతను వివరించారు.

