ఆస్క్​ కేటీఆర్​: కొన్ని అంశాలపైనే మంత్రి స్పందన

ఆస్క్​ కేటీఆర్​: కొన్ని అంశాలపైనే మంత్రి స్పందన
  • ‘ఆస్క్​ కేటీఆర్​’లో రాజకీయాలు, ఇతర అంశాలపైనే మంత్రి కేటీఆర్​ స్పందన
  • 317 జీవో, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్​మెంట్​పై ప్రశ్నలకు నో ఆన్సర్​
  • హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ చెప్తే లాక్‌‌డౌన్‌‌పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
  • యూపీలో సమాజ్‌‌వాదీ పార్టీ గెలిచే చాన్స్‌‌ ఉందని జోస్యం
  • జాతీయ రాజకీయాలపై ఇంట్రస్ట్​ లేదని కామెంట్​

హైదరాబాద్​, వెలుగు: ప్రజా సమస్యలపై నెటిజన్స్​అడిగిన అనేక ప్రశ్నలకు టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ సప్పుడు చేయలేదు. నెలరోజులుగా 317 జీవో వల్ల ఉద్యోగులు, టీచర్లు తిప్పలు పడుతుంటే, ఆ జీవోపై లేవనెత్తిన క్వశ్చన్లకు కూడా బదులివ్వలేదు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్​మెంట్​ తదితర ప్రశ్నలనూ దాటవేశారు. గురువారం ‘ఆస్క్‌‌ కేటీఆర్‌‌’ పేరుతో ట్విట్టర్‌‌లో కేటీఆర్​ చాట్​ చేశారు. రాజకీయాలు, ఇతర అంశాలపై తప్ప.. ప్రజా సమస్యలపై అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించలేదు. జీవో 317 వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కనీసం దానిలో సవరణలైనా  చేయించండని ఓ ఉద్యోగి కోరగా.. కేటీఆర్​ నుంచి రిప్లై రాలేదు. ఇదే అంశంపై పలువురు ప్రశ్నించగా.. ఏ ఒక్కదానికీ బదులు రాలేదు. ‘‘జాబ్స్​ నోటిఫికేషన్స్ గురించి ఎదురుచూస్తున్నాం.. ఒక్క మాటన్నా చెప్పండి’’ అని నిరుద్యోగులు కోరగా.. స్పందన లేదు. 
వీఆర్ఏలకు స్కేల్ ఇవ్వాలన్న ట్వీట్​నూ పట్టించుకోలేదు. ‘‘నిరుద్యోగ భృతి కూడా జుమ్లానే కదా సార్’’ అన్న ప్రశ్ననూ వదిలేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల పరిరక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలన్న ప్రజల డిమాండ్ పైనా,  ఎంఎంటీఎస్ ఫేజ్ --2 పైనా సప్పుడు చేయలేదు. ‘‘పేదలు, మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ తరహా నిర్ణయాలు తీసుకోవచ్చు కదా’’ అనే సూచనలను కూడా కేటీఆర్​ పరిగణనలోకి తీసుకోలేదు. కరోనా వైరస్ పెరుగుతున్న వేళ రైతుబంధు సంబురాలు అవసరమా? అన్న ప్రశ్నకూ జవాబు చెప్పలేదు. స్వయంగా కేటీఆర్ సిఫార్సు చేసినా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదు అని ఓ నెటిజన్​ చెప్పగా.. స్పందించలేదు. దళితబంధు ఎందుకు అమలు చేయడం లేదు?  2008 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్లకు పోస్టింగులు ఎప్పుడిస్తారు? కొత్తగూడెం ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వంటి ప్రశ్నలకు కూడా కేటీఆర్​ సమాధానం చెప్పలేదు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక నాయకుడు రైతువేదిక బిల్లు ఇప్పించాలని కోరినా ఆయన నుంచి రిప్లై రాలేదు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలనే దానికీ కేటీఆర్​ నుంచి ఆన్సర్​ రాలేదు. 
క్రిమినల్స్​తో చర్చించను
సాయికుమార్‌ అనే నెటిజన్‌.. ‘‘కేటీఆర్‌తో బహిరంగ చర్చ కోసం పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఒక యూట్యూబ్‌ చానెల్‌ ఆఫీస్‌లో ఉన్నరు. ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ఆయన చాలెంజ్‌ చేస్తున్నరు. మీరు చర్చకు వెళ్తరా?” అని ప్రశ్నించగా.. క్రిమినల్స్‌తో చర్చించేందుకు తాను రానని, రేవంత్‌ ముందుగా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చర్చించాలని కేటీఆర్​ బదులిచ్చారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ లాంటి ఆంక్షలు పెడుతారా అని విక్రాంత్‌సింగ్‌ అనే నెటిజన్​ అడుగగా.. హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ ఇచ్చే సూచన మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. దేశ ప్రజల ఎకౌంట్లలో రూ. 15 లక్షల చొప్పున జమ చేస్తానని మోడీ చెప్పారని, అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద అబద్ధమని (జుమ్లా)  కేటీఆర్​ విమర్శించారు. ఉత్తరప్రదేశ్​లో సమాజ్‌వాదీ పార్టీ గెలిచే అవకాశముందన్నారు. అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంపై సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘ఐటీలో హైదరాబాద్‌ కన్నా పుణె మంచి గ్రోత్‌ కనబరుస్తున్నదని బీజేపీ ఎంపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నరు. ఇలాంటి మూర్ఖులు చేసే ప్రచారం వదిలేయడమే మంచిది”అని వ్యాఖ్యానించారు. 
జాతీయ రాజకీయాలపై ఇంట్రస్ట్​ లేదు
జాతీయ రాజకీయాలపై తనకు ఇంట్రస్ట్‌ లేదని, రాష్ట్రానికి సేవ చేయడంలోనే సంతోషం ఉందని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేతపై రానున్న పార్లమెంట్‌ సమావేశాలతో పాటు ఇతర జాతీయ వేదికలపైనా ప్రశ్నిస్తామన్నారు. బహదూర్‌పుర ఫ్లై ఓవర్‌ పనులు త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన దేవరకొండ కోట సంరక్షణపై మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో మాట్లాడుతానన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ చివరి నాటికి రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్‌ తొలిదశ పూర్తి చేస్తామని చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనేవారికి సబ్సిడీ ఇస్తున్నామని, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుపై టీఎస్‌ రెడ్కోతో కలిసి అనేక కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయన్నారు.

200 మందికి పైగా దివ్యాంగులకు ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’లో భాగంగా ట్రై స్కూటర్లు అందజేశానని కేటీఆర్​ చెప్పారు. సుచిత్ర జంక్షన్‌లో ఫ్లై ఓవర్‌ నిర్మిస్తామన్నారు. మణికొండ మున్సిపాలిటీలోని అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లో స్పోర్ట్స్‌, పార్క్‌ కోసం ఎంపిక చేసిన ఓపెన్‌ స్పేస్‌ ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని సీడీఎంఏను కేటీఆర్​ ఆదేశించారు. వరంగల్‌ బస్టాండ్‌ అభివృద్ధిపై ‘కుడా’ అధికారులతో మాట్లాడుతానన్నారు. ములుగు జిల్లాలోని బిల్ట్‌ కంపెనీ పునరుద్ధరణ కోసం తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.