
భద్రాచలం, వెలుగు : తెలంగాణ, -చత్తీస్గఢ్ బార్డర్లోని చర్ల మండలం చెన్నాపురం ఆదివాసీ గ్రామంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మంగళవారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ముందుగా గ్రామ అడవుల్లో కూంబింగ్ నిర్వహించిన అనంతరం గ్రామస్తులతో భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆదివాసీ మహిళలకు, చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు.
నిత్యావసర సరుకులు అందజేశారు. గ్రామంలోని ఆదివాసీ యువకులకు వాలీబాల్ కిట్లను ఇచ్చారు. ఆదివాసీ ప్రజలకు విద్య,వైద్యం, రవాణా లాంటి కనీస సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఏఎస్పీ వివరించారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మావోయిస్టులకు సహకరించొద్దన్నారు. ఈ కార్యక్రమంలో చర్ల సీఐ రాజువర్మ, ఎస్సైలు కేశవ, నర్సిరెడ్డి, సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.