
- అన్ని నియోజకవర్గాల్లో ఇరు పార్టీలు ముమ్మరంగా ప్రచారం
- బీజేపీ నుంచి 11 మంది పేర్లు మాత్రమే వెల్లడి
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌లోని సెగ్మెంట్లలో బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహులు మూడో జాబితా కోసం ఎదురుచూస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కావడంతో ఆ పార్టీల క్యాండిడేట్లు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి ఇప్పటివరకు వచ్చిన రెండు లిస్టుల్లో గ్రేటర్ పరిధిలో కేవలం 11 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. మిగతా ప్రాంతాల్లో టికెట్లు ఎవరికి వస్తాయో తెలియక ఆయా నియోజకవర్గాల్లో ఆశావహులు పెద్దగా ప్రచారంపై ఫోకస్ పెట్టడం లేదు.
కొన్ని చోట్ల ఎవరికి టికెట్ వచ్చిన పార్టీకి లాభం చేకూరుతుందని ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి బీజేపీ టికెట్ ఆశిస్తున్న ఆశావహులు మూడో జాబితా కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అంబర్‌పేట, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మలక్‌పేట్, నాంపల్లి, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ స్థానాల్లో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై స్క్రీనింగ్ జరుగుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 10 మందికి పైగా ఆశావహులు ఉన్నారు. ఇలా టికెట్లు ప్రకటించని స్థానాల్లో ఒక్కో చోట నలుగురు, ఐదుగురు ఆశావహులు ఉండటంతో పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. ఆశావహులతో మరోసారి చర్చించిన తర్వాత ఈ స్థానాల్లో టికెట్లను ఖరారు చేయనున్నారు.
ఒక చోట మాత్రమే పెండింగ్
గ్రేటర్‌లోని 25 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నాంపల్లి, గోషామహల్ స్థానాలను పెండింగ్‌లో పెట్టగా, కాంగ్రెస్ ఒక్క పటాన్‌చెరువులో మాత్రమే అభ్యర్థిని పెండింగ్‌లో పెట్టింది. ఈ ప్రాంతాల్లో క్యాండిడేట్ల ఎంపిక పూర్తయింది. కానీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బీజేపీ ఇంకా 14 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆయా పార్టీలు నేడో, రేపో ఈ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఒక్కసారి అభ్యర్థుల ఎంపిక ఫైనల్ అయిందంటే ఆ తర్వాత అసలు సీన్ స్టార్ట్ అవుతుంది. నామినేషన్ల నుంచి మొదలు పెడితే పోలింగ్ అయ్యేంత వరకు ఓటర్ల చుట్టూ లీడర్లు ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. ఇప్పటికే తెల్లవారుజామున నుంచే ఓటర్ల ఇండ్ల ముందు ప్రత్యక్షమై ప్రచారం చేస్తున్నరు.
ఆ పార్టీల నేతలు జోరుగా ప్రచారం..
గ్రేటర్‌లోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతుంది. డోర్ టు డోర్ క్యాంపెయిన్‌తో పాటు కార్నర్ మీటింగ్‌లు, ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కాలనీలు, బస్తీలు ఎక్కడ కూడా వదలకుండా ప్రచారం చేస్తూ తమకే ఓటు వేయాలని ఓటర్లను వేడుకుంటున్నారు. అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు కూడా అదే తరహాలో ప్రచారం చేస్తుండగా, ప్రకటించని నియోజకవర్గాల్లో వీక్‌గా ఉంది. తమకు టికెట్ వస్తే చూసుకుందామని కిందిస్థాయి నేతలు అనుకుంటున్నారు. బీజేపీ మూడో విడత అభ్యర్థుల ప్రకటన తర్వాత మూడు పార్టీల ప్రచారం ముమ్మరంగా కొనసాగే అవకాశం ఉంది. అన్ని పార్టీల అభ్యర్థులు బలంగా ఉండటంతో ఈ సారి గెలుపు ఎవరిదో అని అంచనా కూడా వేయడం కష్టంగా ఉంది.