జర మేల్కొండి : బైక్పై మంత్రి వినూత్న ప్రచారం

జర మేల్కొండి : బైక్పై మంత్రి వినూత్న ప్రచారం

రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు అస్సాం రవాణాశాఖ మంత్రి పరిమాళ్‌ శుక్లబైద్య వినూత్న కార్యక్రమం చేపట్టారు. ‘పథ్‌ సురక్ష జన్‌ ఆందోళన్‌’ పేరిట అస్సాం వ్యాప్తంగా బైక్‌ ర్యాలీ చేయాలని నిర్ణయించారు. ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా బైక్ ర్యాలీ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ప్రపంచ రోడ్డు బాధితుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం (నవంబర్ 19న) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రెండో రోజు సోమవారం (నవంబర్ 20న) ర్యాలీకి సంబంధించిన వీడియోలను ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశారు మంత్రి పరిమాళ్​శుక్లబైద్య. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రోత్సాహంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం గువాహటిలో ర్యాలీ కొనసాగుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు. 

ర్యాలీలో భాగంగా సాధారణ ప్రజలు, ప్రభుత్వ అధికారులు, డ్రైవర్లు, ఇలా ప్రతీ వర్గంతోనూ సమావేశాలు నిర్వహించి వారిలో అవగాహన కల్పిస్తానని పరిమాల్‌ తెలిపారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తానని అన్నారు.

అస్సాం రవాణాశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..

2023 జనవరి నుంచి అక్టోబర్‌ వరకు అస్సాం రాష్ట్రంలో 6,001 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2 వేల 606 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40.89 శాతం ప్రమాదాలు సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలోనే జరిగాయి. ఈ క్రమంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని, వాళ్లకు అవగాహన కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని మంత్రి పరిమాల్‌ శుక్లబైద్య చెప్పారు. https://twitter.com/ParimalSuklaba1/status/1726520720329699654