నేటి నుంచి అసెంబ్లీ .. ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్

నేటి నుంచి అసెంబ్లీ .. ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
  • రేపు ధన్యవాద తీర్మానం.. ఎల్లుండి ఓటాన్ అకౌంట్​ బడ్జెట్
  • ఇరిగేషన్​పై సభలో శ్వేతపత్రం విడుదలకు ఏర్పాట్లు
  • మేడిగడ్డపై విజిలెన్స్​ రిపోర్టు​ రిలీజ్ చేసే చాన్స్​

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ​ బడ్జెట్ ​సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్​ఉభయ సభలనుద్దేశించి గవర్నర్​తమిళిసై ప్రసంగించనున్నారు. గవర్నర్ ​ప్రసంగం తర్వాత సభ వాయిదా పడనుంది.  గురువారమే బీఏసీలను నియమించి వాటిని సమావేశ పరిచే అవకాశముంది. శుక్రవారం అసెంబ్లీ, కౌన్సిల్​ వేర్వేరుగా సమావేశమై గవర్నర్ ​ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి చర్చించనున్నారు. శనివారం ప్రభుత్వం ఉభయ సభల్లో ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. సోమవారం నుంచి బడ్జెట్ పై సభ్యులు చర్చిస్తారు. బడ్జెట్​ఆమోదం పొందిన తర్వాత ఇరిగేషన్​పై శ్వేతపత్రం ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్​ఇచ్చిన రిపోర్టును కూడా ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం టేబుల్​ చేయనుంది.కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డపై విజిలెన్స్​ ప్రిలిమినరీ రిపోర్టును ఈ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.

సమావేశాల నిర్వహణపై సమీక్ష

అసెంబ్లీ, కౌన్సిల్​సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి, స్పీకర్ ​గడ్డం ప్రసాద్​కుమార్​ ఆదేశించారు. సమావేశాల నిర్వహణపై అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్​లో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి వారు సమీక్ష నిర్వహించారు. సమావేశాల నిర్వహణ, భద్రత ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మండలి చైర్మన్​ సుఖేందర్​రెడ్డి మాట్లాడుతూ.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు త్వరగా సమాధాలు వచ్చేలా చూడాలన్నారు. సమావేశాలకు అధికారులు అందుబాటులో ఉండేలా అసెంబ్లీ ప్రాంగణంలోని పాత భవనంలోని మండలిని త్వరగా షిఫ్ట్​ చేసేలా చర్యలు తీసుకోవాలని, తర్వాతి సెషన్​ అసెంబ్లీ ప్రాంగణంలోనే  కౌన్సిల్​ నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 


సమావేశాల సమయంలో ధర్నాలు, ర్యాలీలకు అనుమతుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలన్నారు. స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్​ మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సమావేశాలు నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మండలి డిప్యూటీ చైర్మన్​ బండ ప్రకాశ్​ మాట్లాడుతూ.. మండలి సమావేశాలకు మంత్రులు అందుబాటులో ఉండాలని, అసెంబ్లీ కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓరియంటేషన్​ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలన్నారు. 

ప్రొటోకాల్ ​తప్పిదాలు జరగొద్దు: శ్రీధర్​ బాబు

మంత్రి శ్రీధర్​బాబు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని శాఖలను కో ఆర్డినేట్​చేయడానికి సీనియర్ ​ఐఏఎస్​ అధికారిని నియమించాలని సీఎస్​ను ఆదేశించారు. సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టుల వారీగా బాధ్యతలు ఇస్తున్నామని, సభ్యులు అడిగిన ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు ఇచ్చేలా చూడాలన్నారు. ప్రొటోకాల్ ​విషయంలో తప్పిదాలు జరగొద్దని, గతంలో తాను కూడా ప్రొటోకాల్​విషయంలో బాధితుడినని గుర్తు చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కొత్త సభ్యులకు రెండు రోజుల పాటు ఓరియంటేషన్ ​కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో సీఎస్ ​శాంతికుమారి, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు, ఫైనాన్స్​స్పెషల్ ​సీఎస్​రామకృష్ణారావు, ప్రభుత్వ విప్​లు అడ్లూరి లక్ష్మణ్​కుమార్, బీర్ల ఐలయ్య, డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్​చీఫ్ ​శివధర్​రెడ్డి, వివిధ శాఖల అధికారులు, పోలీస్​కమిషనర్లు పాల్గొన్నారు.