గెలుస్తామా.. లేదా..? .. గ్రేటర్ సెగ్మెంట్లలో అభ్యర్థులు, ఆశావహుల సర్వేలు 

గెలుస్తామా.. లేదా..? .. గ్రేటర్ సెగ్మెంట్లలో అభ్యర్థులు, ఆశావహుల సర్వేలు 
  • వ్యతిరేకంగా ఫలితాలు వస్తే సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు
  • ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏం చేయాలనేదానిపై కసరత్తు
  • ఇతర పార్టీల బలాలను సైతం అంచనా వేసేందుకు అవకాశం
  • కాంగ్రెస్​, బీజేపీ నుంచి పోటీ పడే వారిలో సైతం ఇదే తీరు!

హైదరాబాద్​,వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఆశావహులు తమ గెలుపు అవకాశాలను తెలుసుకుంటున్నారు. పార్టీ టికెట్​పక్కా అన్నది తేలక ముందే తాము బరిలో ఉంటే ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. కొన్ని సంస్థలు, లేదా వ్యక్తుల ద్వారా నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించుకుంటున్నారు. తమకు అనుకూలంగా వస్తుందని తేలితే ఎంత ఖర్చయినా సరే పోటీలో ఉండాలని భావిస్తున్నారు. ఒకవేళ సర్వేలో వ్యతిరేక ఫలితాలు వస్తే ఏ విధంగా గెలుపు బాట వేసుకోవాలన్నదానిపైనా కసరత్తు చేసుకుంటున్నారు.

అంతేకాకుండా తమ ప్రత్యర్థుల బలాన్ని కూడా అంచనా వేసుకుని బరిలోకి దిగాలని సమాలోచన చేస్తున్నారు. ఇలా గ్రేటర్​పరిధిలోని పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్​లతో పాటు, కాంగ్రెస్​, బీజేపీ ఆశావహులు వేసుకుంటున్న కొత్త ఎత్తుగడలు. ఎన్నికల్లోపు నియోజకవర్గాల నుంచి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తుందనే దానిపైనా పలు పార్టీల నేతలు ముందే తెలుసుకుంటున్నారు. 

ఓటర్ల నాడీ తెలుసుకునేందుకు..

గ్రేటర్​పరిధిలోని 24 స్థానాల్లో తమ సత్తా చాటేందుకు ఇప్పటికే బీఆర్ఎస్​ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అందుకు అనుగుణంగా ఆ పార్టీ ఇప్పటికే రెండు చోట్ల మినహా మిగిలిన స్థానాల్లో సిట్టింగ్ లనే మరోసారి బరిలోకి దింపింది. తమకు రెండోసారి చాన్స్​ వచ్చిందన్న సంతోషంగా కంటే ఈసారి గెలుస్తామా? లేదా? అనే అనుమానమే చాలామంది సిట్టింగ్ లో ఉంది. ఒక పక్క ప్రభుత్వంపై వ్యతిరేకత, మరో పక్క సెగ్మెంట్లలో సొంత పార్టీ నేతల నుంచి అసంతృప్తులను ఎదుర్కొంటున్నారు. దీంతో తమ గెలుపు పై చాలా  మందిలో అనుమానాలు నెలకొన్నాయి. పైకి తామే గెలుస్తామన్న ధీమాతో ఉన్నా లోలోపల.. సొంతపార్టీ నేతల నుంచి, ప్రభుత్వంపై వ్యతిరేకత, ప్రతిపక్ష పార్టీలు బలం పుంజుకోవడం వంటి పరిణామాలతో కొందరు అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది.

దీంతో తమ పరిస్థతి ఎలా ఉందనే దానిపై కొందరు సర్వేలు చేయించుకుంటున్నారు. వచ్చే రిపోర్ట్ ల ఆధారంగానే ఎన్నికల ప్రచారంలోకి దిగాలనుకుంటున్నారు. సికింద్రాబాద్​, సనత్​ నగర్​ సెగ్మెంట్లో పార్టీ కార్యకర్తలతోనే అభ్యర్థులు తమ గెలుపు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ పేరుతో పార్టీ తీరు ఎలా ఉందనే దానిపై ప్రజల వద్దకు వెళ్లి వాకబు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అంబర్​పేట, ముషీరాబాద్​లో కూడా ఆపార్టీ నేతలు సర్వేలు నిర్వహించుకుంటున్నారు. 

ప్రతిపక్ష నేతలు కూడా..

కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలు కూడా ముందుగానే తాము పోటీ చేసే చోట్ల సర్వేలు చేయించుకుంటున్నారు. ముషీరాబాద్​, అంబర్​పేట, సనత్​ నగర్​ లలో నేతలు కొందరు ఇప్పటికే సర్వే నిర్వహించినట్టు చెబుతున్నారు. బీజేపీ నుంచి కూడా నేతలు సర్వేలపై ఆధారపడుతున్నట్టు తెలిపారు హైదరాబాద్​సిటీలో బీజేపీకి పటిష్టమైన క్యాడర్​ ఉంది. దాదాపు ప్రతి సెగ్మెంట్ లో ఆ పార్టీకి సానుభూతి ఓటర్లు ఉన్నారు. ఈసారి పోటీలో ఉండే నేతలు సైతం తమ రాజకీయ భవిష్యత్​పై అంచనాకు రావడానికి సర్వేలనే ప్రామాణికంగా భావిస్తున్నారు. 

పట్టు కోసం ప్రయత్నాలు

గ్రేటర్​ పరిధిలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీలకు పటిష్టమైన కేడర్ ఉంది. బూత్​స్థాయిలో అన్ని పార్టీలకు కార్యకర్తలు ఉన్నారు. సర్వేల ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం, తమకు అనుకూలంగా మార్చుకునేందుకు దాదాపు అన్నిపార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్​ఎస్​ క్యాండిడేట్లు డబ్బు, కేడర్,  ప్రభుత్వం నుంచి సహకారం పూర్తిగా ఉండడంతో తమ ప్రాంతాలపై పూర్తిపట్టు సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  

ప్రజల్లో పార్టీపై ఉన్న అభిప్రాయాలకు అనుగుణంగా వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలన్న దానిపై పలు రకాలుగా కసరత్తు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్​ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారు కూడా సెగ్మెంట్లలో తమ సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ సైతం తమ కార్యకర్తల బలంతో సత్తా చాటుకునేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో గ్రేటర్​లో ఎన్నికల సందడి జోరుగా ఉంది.