మొదలైన అసెంబ్లీ ఎన్నికల సందడి

మొదలైన అసెంబ్లీ ఎన్నికల సందడి
  • అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి

మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట/వెలుగు:  ఉమ్మడి మెదక్ జిల్లాలో అప్పుడే  ఎన్నికల సందడి మొదలైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు,    పోటీచేసి ఓడిపోయిన లీడర్లతో పాటు ఈసారి పలువురు సెకండ్ క్యాడర్ లీడర్లూ   రెడీ అవుతున్నారు.  హైకమాండ్​ దృష్టిలో పడేందుకు, ప్రజల మద్దతు కూడగట్టేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు.  

మెదక్ జిల్లాలో... 

నర్సాపూర్​ అసెంబ్లీ స్థానంలో బీఆర్​ఎస్​ పార్టీలో సిట్టింగ్​ఎమ్మెల్యే మదన్​ రెడ్డితోపాటు, మాజీ మంత్రి, మహిళా కమిషన్​ చైర్​ పర్సన్​ సునీతారెడ్డి టికెట్​ ఆశిస్తుండగా, కొత్తగా శివ్వంపేట ఎంపీపీ, జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ తాను సైతం అంటున్నాడు.  తన అనుచరుల  ద్వారా సోషల్​ మీడియాలో సర్వేలు చేయిస్తు, తనకు అనుకూలంగా ఓటింగ్​ నిర్వహిస్తూ హైకమాండ్​ దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీలో గత ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగాయిపల్లి గోపి, పార్టీ లీడర్లు  రఘువీరారెడ్డి, మల్లేశ్​ గౌడ్​ తోపాటు, కొన్నాళ్ల కింద బీఆర్​ఎస్​ నుంచి బీజేపీలో చేరిన నర్సాపూర్ మున్సిపల్​ చైర్మన్​ మురళీ యాదవ్​ టికెట్​ ఆశిస్తున్నారు. మెదక్ నియోజకవర్గ స్థానంలో బీజేపీ తరపున పోటీకి పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, హైకోర్టు అడ్వకేట్​ తాళ్లపల్లి రాజశేఖర్​, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్ధన్​ రెడ్డితోపాటు, కొత్తగా చేగుంటకు చెందిన ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగి ప్రయత్నాలు చేస్తున్నారు.   

సంగారెడ్డి జిల్లాలో...

సంగారెడ్డి జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండగా, ప్రధానంగా సంగారెడ్డి, పటాన్ చెరు, నారాయణఖేడ్ నియోజకవర్గల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల తరపున ఈసారి పోటీ చేసేందుకు కొత్త క్యాండిడేట్లు ముందుకొచ్చి ప్రజల్లో తిరుగుతూ మమేకమవుతున్నారు.  సంగారెడ్డి సెగ్మెంట్లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ కు టికెట్ విషయంలో సొంత పార్టీ నుంచి ఈసారి గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా డీసీసీబీ  వైస్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పట్నం మాణిక్యం అనూహ్యంగా తెరపైకి వచ్చి సీఎం కేసీఆర్ అండదండలు తనకు ఉన్నాయంటూ ఎమ్మెల్యే కావాలన్నా తన కోరిక తీరబోతోందని ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు.  అలాగే బీజేపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రాజేశ్వర్ రావు దేశ్ పాండేకు పోటీగా ఈసారి  దయాకర్ రెడ్డి పోటీకి సిద్ధమై హైకమాండ్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు.  పటాన్​  చెరు సెగ్మెంట్లో  బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మళ్లీ పోటీకి సై అంటుండగా,  చిట్కుల్ సర్పంచ్, యువ నాయకుడు నీలం మధు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ లక్ష్యంగా  మధు యువసేన పేరుతో సామాజిక కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, గోదావరి అంజిరెడ్డికి పోటీగా మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ పేరు కొత్తగా తెరపైకి వస్తోంది. కాంగ్రెస్ లో మెదక్ పార్లమెంట్ నుంచి ఇదివరకు పోటీ చేసి ఓటమి పాలైన గాలి అనిల్ కుమార్ ఈసారి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. నారాయణఖేడ్ సెగ్మెంట్లో బీజేపీ తరఫున 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డితోపాటు కొత్తగా లింగాయత్ వర్గానికి చెందిన, సీనీయర్​ జర్నలిస్ట్​ సంగప్ప టికెట్​ రేసులో ఉన్నారు. తాను ఎమ్మెల్యే రేస్ లో ఉన్నానంటూ లింగాయత్ వర్గాలతో పాటు యువతను మమేకం చేస్తూ నియోజకవర్గంలో   ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

సిద్దిపేట జిల్లాలో...

సిద్దిపేట అసెంబ్లీ స్థానంలో కొన్నికొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. సిద్దిపేట కేంద్రంగా కార్యక్రమాలను ప్రారంభించిన ఒక స్వచ్చంద సంస్థ నిర్వాహకుడు సైతం ఎన్నికల బరిలో నిలవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకున్నా,  ఎన్నికల్లో పోటీపడే  అవకాశమున్నట్టు తెలుస్తోంది.   బీఆర్ఎస్ ముఖ్య నాయకుని కుటుంబీకుడు ఒకరు అవకాశం వస్తే సిద్దిపేట బరిలో దిగడానికి సన్నద్దం అవుతున్నాడు.  గతంలో పీఆర్పీ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేసి విఫలమైన నియోజకవర్గానికి దూరమైన అతను, ఇటీవలి కాలంలో సిద్దిపేటపై దృష్టి సారించాడు.  తన అనుచరులతో సిద్దిపేట పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయిస్తున్నాడు. రాజకీయంగా ఏదైనా అనూహ్య మార్పు జరిగితే తనకే అవకాశం దక్కుతుందనే ఆశతో అతను ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.