
- గతేడాది డిసెంబర్ తో పోలిస్తే తక్కువ వసూలు
- ఆర్థిక ఏడాదికి మరో మూడు నెలలే గడువు
- ఇప్పటివరకు రూ.1,182 కోట్ల కలెక్షన్
- మరో రూ. 918 కోట్లు వసూలు కావాలి
- ఫోకస్ పెట్టిన జీహెచ్ఎంసీ అధికారులు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ బల్దియా ప్రాపర్టీ ట్యాక్స్ పై పడింది. దీంతో బల్దియా రెవెన్యూ ఒక్కసారిగా తగ్గిపోయింది. వసూలుపై ఫోకస్ పెట్టాల్సిన అధికారులు ఎన్నికల డ్యూటీలో బిజీ అయ్యారు. ట్యాక్స్ పేయర్స్ కూడా ఎన్నికల సాకుతో చెల్లించలేదు. ప్రస్తుత (2023–24) ఆర్థిక ఏడాదికి రూ.2100 కోట్ల పన్ను వసూలును బల్దియా లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు రూ.1,182 కోట్ల కలెక్షన్ వచ్చింది. గత ఆర్థిక ఏడాదిలో డిసెంబర్ నాటికి రూ.1,416 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెలలో ఇంకా 20 రోజుల సమయం ఉండగా ఆదాయం మాత్రం తగ్గింది. జనవరి1 నుంచి చెల్లించేవారి ఆస్తి పన్నుపై 2 శాతం పెనాల్టీతో పడనుంది. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిన బల్దియాను కొత్త ప్రభుత్వం ఆదుకోవడం తప్ప ఇతర ఆదాయమార్గాలు లేవు. బల్దియాలో కొందరు ఉద్యోగులకు నేటికి జీతాలు అందలేదు. వచ్చే ఆదాయంలో ఎక్కువగా ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారానే వస్తుంది. ఎన్నికల కారణంగా ఈసారి పన్ను సరిగా వసూలు కాకపోవడంతో ఆ ఎఫెక్ట్ మిగతా వాటిపై పడింది.
స్కీమ్ ల అమలప్పుడే స్పందన
ప్రతి ఏటా ప్రాపర్టీ ట్యాక్స్‌పై బల్దియా లక్ష్యం చేరుకోవడంలేదు. 2019–20 ఆర్థిక ఏడాదికి రూ.1357 కోట్లు, 2020–21కి రూ.1633 కోట్లు, 2021–22 రూ.1681కి కోట్లు వచ్చింది. గతేడాది ఆర్థిక ఏడాదికి రూ.1658 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి ఆర్థిక ఏడాదిలో ఇప్పటివరకు రూ.1,182 కోట్లు మాత్రమే వచ్చింది. మరో మూడు నెలల గడువు ఉండగా ఇంకా రూ. 918 కోట్లు కలెక్ట్ కావడం కష్టమని బల్దియా వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్‌కు సంబంధించి బల్దియా స్కీమ్‌లను అమల్లోకి తెచ్చినప్పుడే జనం నుంచి భారీగా స్పందన వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అమల్లో ఉన్న ఎర్లీబర్డ్ స్కీమ్‌కు ఊహించని విధంగా కలెక్షన్ వచ్చింది. రూ.782 కోట్లు వసూలైంది. వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్కింద రూ.80 కోట్లకుపైగానే కలెక్ట్ అయింది.
ప్రభుత్వం ఆదుకోకుంటే..
తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం బల్దియాకు ఎలాంటి ఫండ్స్ ఇవ్వడం లేదు. కనీసం ప్రభుత్వ భవనాలకు చెందిన రూ.5,564 కోట్ల ఆస్తిపన్ను బకాయిలు చెల్లించలేదు. దీంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి బల్దియా చేరుకోగా అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్కలెక్షన్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఆ కలెక్షన్ కూడా రాకపోగా జీతాలకు ఇబ్బంది అవుతుంది. ఇక ఎన్నికలు అయిపోవడంతో మళ్లీ ట్యాక్స్ కలెక్షన్ పై ఫోకస్ పెట్టారు. కొత్త ప్రభుత్వం ఏర్పడగా.. మున్సిపల్ శాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉంది. బల్దియాపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రక్షాళన చేపట్టేందుకే సీఎం తన వద్ద పెట్టకున్నారనే చర్చ బల్దియాలో జోరుగా నడుస్తుంది. వెంటనే ప్రక్షాళన జరిపి బల్దియాను గట్టెక్కించాలని సిటిజన్ల నుంచి వినిపిస్తుంది.