ఇక అసైన్డ్ ల్యాండ్స్​ రెగ్యులరైజేషన్!

ఇక అసైన్డ్ ల్యాండ్స్​  రెగ్యులరైజేషన్!
  • ఎల్ఆర్ఎస్ తర్వాత ప్రకటించే చాన్స్
  • మార్కెట్ వాల్యూ ఆధారంగా రెగ్యులరైజేషన్ చార్జీలు
  • అర్హులైన వారికి నామమాత్రపు ఫీజుతో రీఅసైన్
  • హెచ్ఎండీఏ పరిధిలోని అసైన్డ్ ల్యాండ్స్ సర్కార్ స్వాధీనంలోకి
  • పీఓటీ కేసుల పరిష్కారం దిశగా అడుగులు
  • రాష్ట్రవ్యాప్తంగా మరోసారి అసైన్డ్ ల్యాండ్ స్టేటస్​పై సర్వే

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో అన్యాక్రాంతమై, పీఓటీ కేసుల్లో ఉన్న సుమారు 2.41 లక్షల ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ రెగ్యులరైజేషన్ కు ప్రభుత్వం ప్లాన్లు సిద్ధం చేస్తోంది. చట్ట ప్రకారం భూములను తొలుత వెనక్కి తీసుకుని.. ఆ భూములు అర్హులైన పేదల చేతుల్లో ఉంటే రీఅసైన్ చేయాలని, అనర్హులుగా తేలితే నిర్ణీత ఫీజు వసూలు చేసి క్రమబద్ధీకరించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది. అర్హులైన వారికి నామమాత్రపు ఫీజుతో రీఅసైన్ చేసి.. మిగతా వారికి మార్కెట్ వాల్యూ ఆధారంగా రెగ్యులరైజేషన్ చార్జీలు వసూలు చేయనున్నట్లు సమాచారం. అయితే హెచ్‌‌ఎండీఏ పరిధిలోని భూములను మాత్రం రెగ్యులరైజ్ చేయకుండా స్వాధీనం చేసుకుని వేలం వేయనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ముందస్తుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసైన్డ్ భూముల వివరాలు, వాటి ప్రస్తుత స్థితిపై రెవెన్యూ అధికారులు రిపోర్టులు రూపొందిస్తున్నారు. వ్యవసాయేతర ఆస్తుల ఎల్ఆర్ఎస్​ ప్రోగ్రాం ఓ కొలిక్కి రాగానే అసైన్డ్ భూముల రెగ్యులరైజేషన్ కు ఆర్డినెన్స్ జారీ చేసి, ఈ ప్రక్రియను మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్లాట్లుగా అసైన్డ్ స్థలాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1977లో అసైన్డ్‌‌ భూముల బదలాయింపు నిషేధ (పీఓటీ) చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్‌‌ 3 ప్రకారం 1977కు ముందుగాని, తర్వాత గానీ ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూములను ఇతరులకు అమ్మడం నిషేధం. ఆ కుటుంబ సభ్యులు అర్హులైతే వారసత్వంగా పట్టా చేయించుకునే అవకాశం ఉంది. అసైన్డ్‌‌ భూమిని ఇతరులకు అమ్మినా, గిఫ్ట్ ఇచ్చినా, తాకట్టు పెట్టినా, కౌలుకు ఇచ్చినా, ఇతర భూములకు బదులుగా మార్చుకున్నా ట్రాన్ఫ్​ఫర్ కిందికే వస్తుందని ఈ చట్టం చెబుతోంది. కానీ పెరుగుతున్న అర్బనైజేషన్ తో పట్టణాలు, నగరాల శివారులోని అసైన్డ్ స్థలాలు ప్లాట్లుగా మారిపోయి ఇళ్లు వెలిశాయి. వీరిలో పైసాపైసా కూడబెట్టుకుని ఇండ్లు కొన్న నిరుపేదలు కూడా ఉన్నారు. అసైన్డ్ ల్యాండ్స్​ క్రమబద్ధీకరణ నేపథ్యంలో ముందుగా పీఓటీ చట్టానికి సవరణలు చేస్తూ త్వరలో ఆర్డినెన్స్​ జారీ చేసే అవకాశముందని రెవెన్యూ శాఖ పెద్దాఫీసర్ ఒకరు వెల్లడించారు.

హెచ్ఎండీఏ ల్యాండ్స్​పై ఫోకస్

ప్రభుత్వం ప్రధానంగా హైదరాబాద్ శివారులో అన్యాక్రాంతమైన అసైన్డ్ ల్యాండ్స్​పై దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఈ భూములను స్వాధీనం చేసుకుని, వేలం ద్వారా అమ్మేసి ఖజానా నింపుకోవాలని భావిస్తోంది. ఏడాది క్రితమే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్, గండిపేట మండలాల పరిధిలో ఉన్న రెవెన్యూ గ్రామాల పరిధిలోని 1,636 ఎకరాల అసైన్డ్‌‌, ప్రభుత్వ భూముల వివరాలను సర్కార్ సేకరించింది. బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం ఈ భూములను వేలం వేసి సుమారు రూ.6 వేల కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది.

మొత్తం 2.41 లక్షల ఎకరాలు

రాష్ట్రంలో 15.83 లక్షల మంది వద్ద 22,63,139 ఎకరాల అసైన్డ్‌‌ భూములు ఉన్నట్లు భూరికార్డుల ప్రక్షాళన లో తేలింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌ జిల్లాలో అత్యధికంగా 1,85,101 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్​ ఉండగా, భద్రాద్రి కొత్తగూడెంలో 1,66,557 ఎకరాలు, నల్గొండ జిల్లాలో 1,38,686 ఎకరాలు, కామారెడ్డిలో 1,33,157 ఎకరాలు ఉన్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన 6,33,451 మందికి 8,14,008 ఎకరాలు, ఎస్సీలకు 5,75,497 ఎకరాలు, ఎస్టీలకు 6,72,959 ఎకరాలు, ఓసీలకు 1,46,102 ఎకరాలు, మైనార్టీలకు 54,565 ఎకరాలు పంపిణీ చేసినట్లుగా రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇందులో 2.41 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు భూరికార్డుల ప్రక్షాళన సమయంలో రెవెన్యూ అధికారులు గుర్తించారు. కబ్జాలో ఉన్న వారికి అసైన్డ్‌‌ భూముల బదలాయింపు నిషేధ చట్టం కింద నోటీసులు జారీ చేశారు.