భావప్రకటన స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం నిలవదు : బి.సుదర్శన్ రెడ్డి

భావప్రకటన స్వేచ్ఛ లేకపోతే  ప్రజాస్వామ్యం నిలవదు : బి.సుదర్శన్ రెడ్డి
  • సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి వ్యాఖ్య 

హైదరాబాద్, వెలుగు: భావప్రకటన స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం నిలవదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణలు తీసుకురావాలని ప్రయత్నించినా.. పత్రికల స్వేచ్ఛను ప్రజలు, కోర్టులు కాపాడాయని తెలిపారు. ప్రముఖ జర్నలిస్ట్, విశాలాంధ్ర పూర్వ సంపాదకుడు, అక్షరశస్త్రధారి సి. రాఘవాచారి 6వ స్మారకోపన్యాసం శనివారం సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూరాఘవచారికి భయమనే పదం తెలియదన్నారు. ఆయన విశాలాంధ్రను కేవలం పత్రికగా కాకుండా విలువలకు వేదికగా నిలబెట్టిన మహానుభావుడని కొనియాడారు. 

మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల పక్షాన పనిచేసేందుకే మీడియాను రాజ్యాంగంలో చేర్చలేదన్నారు. కార్యక్రమంలో పత్రికా రంగ ప్రముఖులు కె.రామచంద్రమూర్తి, ఆర్​వీ రామారావు (విశాలాంధ్ర ఎడిటర్), దేవులపల్లి అమర్(మన తెలంగాణ ఎడిటర్), టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ అజీజ్ పాషా తదితరులు పాల్గొన్నారు. కాగా, తొలుత ట్రస్ట్ సభ్యులు డి. సోమసుందర్ స్వాగతం పలుకగా, చివరలో డాక్టర్ సి.అనుపమ వందన సమర్పన చేశారు.