అపాచీ బైక్ ట్రబుల్..టీవీఎస్ కంపెనీకి రూ.60 వేల ఫైన్

అపాచీ బైక్ ట్రబుల్..టీవీఎస్ కంపెనీకి రూ.60 వేల ఫైన్
  • సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన షోరూం నిర్వాహకులు
  • వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించిన బాధితుడు
  • ఖమ్మం జిల్లాలో అపరిచితుడు సినిమా సీన్

ఖమ్మం, వెలుగు: ఓ వినియోగదారుడు దిగ్గజ కంపెనీపై న్యాయపోరాటంలో నెగ్గాడు. తన బైక్​ ట్రబుల్​ ఇవ్వగా షోరూం నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో లీగల్​గా ముందుకెళ్లి నష్టపరిహారం పొందేలా చేసుకున్నాడు. అపరిచితుడు సినిమాలో బ్రేక్​ వైర్​ తెగిపోవడంతో సినీ హీరో కంపెనీపై కేసు వేసి గెలుస్తాడు. ఇలాంటి దృశ్యమే ఖమ్మం జిల్లాలో జరిగింది. జిల్లాకు చెందిన వినియోగదారుడి పోరాటంతో టీవీఎస్ కంపెనీకి ఖమ్మం వినియోగదారుల కమిషన్ రూ.60 వేల జరిమానా విధించింది. 

వినియోగదారుడు ఎదుర్కొన్న మానసిన ఇబ్బందిని, పెట్టిన ఖర్చును కూడా లెక్కకట్టి అపరాధ రుసుముకు జోడించడం విశేషం. ఈ మేరకు ఖమ్మం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇన్​చార్జి చైర్మన్ వడ్లమాని లలిత, సభ్యురాలు మాధవీలత తీర్పునిచ్చారు. ఖమ్మం నగరం నరసింహ స్వామి గుట్ట ప్రాంతానికి చెందిన రామిశెట్టి నితిన్ విజేత అనే విద్యార్థి హైదరాబాద్​ మలక్ పేట టీవీఎస్ షోరూంలో 2021 మే నెలలో టీవీఎస్ అపాచీ బైక్​ను రూ.2.65 లక్షలతో కొన్నాడు. 

కొంతకాలం తర్వాత బైక్​ లో సమస్యలు తలెత్తాయి. వాహనం నడుపుతుండగా ఇంజిన్ బాగా వేడెక్కడంతో పాటు  సడన్​గా ఆగుతూ ఉండేది. దీంతో నితిన్​ విజేత షోరూం నిర్వాహకులను ఆశ్రయించాడు. వారు పట్టించుకోకపోవడంతో ఖమ్మం జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కమిషన్ తుది తీర్పును తాజాగా వెలువరించింది.

బైక్​ మెరుగ్గా నడిచేందుకు ఉండేలా అవసరమైన స్పేర్​ పార్ట్స్​ ఉచితంగా అందజేయాలని టీవీఎస్​ కంపెనీని కమిషన్ ఆదేశించింది. అలాగే రూ.50 వేల అపరాధ రుసుమును విధించింది. ఫిర్యాదుదారుడు ఇన్నేళ్లు ఎదుర్కొన్న మానసిక వేదనను కమిషన్ పరిగణలోకి తీసుకుంది. ఇందుకు మరో రూ.10 వేల మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.