సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు రూ.50 లక్షల బీమా.

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు రూ.50 లక్షల బీమా.
  • .సహజ మరణానికి రూ.20 లక్షలు..
  • అమలు చేయాలని బ్యాంకర్లకు సీఎండీ బలరాం విజ్ఞప్తి

హైదరాబాద్,​ వెలుగు: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు రూ.50 లక్షల ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.20 లక్షల టర్మ్  ఇన్సూరెన్స్  అమలు చేయాలని బ్యాంకర్లను ఆ సంస్థ సీఎండీ ఎన్. బలరాం కోరారు. శనివారం సింగరేణి భవన్​లో ఎస్‌‌బీఐ, యూనియన్ బ్యాంక్  ఆఫ్​ ఇండియా, బ్యాంక్  ఆఫ్  బరోడా, పంజాబ్  నేషనల్  బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్  ఓవర్సీస్  బ్యాంక్, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్  ఉన్నతాధికారులతో  సీఎండీ సమావేశం నిర్వహించారు. బలరాం మాట్లాడుతూ సింగరేణిలో ప్రారంభించిన ఉచిత ప్రమాద బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 

ప్రభుత్వ, ప్రైవేట్  రంగ బ్యాంకుల సహకారంతో దేశంలో తొలిసారిగా సింగరేణిలో అమలులోకి వచ్చిన ఈ పథకం నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోనూ అమలు చేయడంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పథకం ప్రారంభంలో సహకారం అందించిన బ్యాంకులకు కృతజ్ఞతలు చెప్పారు. ‘‘ప్రమాద బీమా పథకం ద్వారా ఉద్యోగులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు, పొరుగుసేవల సిబ్బందికి రూ.40 లక్షల వరకు బీమా అందిస్తున్నాం. 

ఇప్పటివరకూ ప్రమాదాల్లో మరణించిన 34 మంది కుటుంబాలకు రూ.30 కోట్ల బీమా సొమ్ము అందజేశాం. ఇది వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించింది’’ అని సీఎండీ పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, కోలిండియాలోనూ అమలైందని గుర్తుచేశారు. థర్మల్ పవర్, సోలార్, పంప్డ్  స్టోరేజీ ప్లాంట్ల వంటి కొత్త ప్రాజెక్టులకు రుణ సదుపాయం కల్పించాలని కోరగా.. బ్యాంకర్లు సానుకూలంగా స్పందించారు. దీర్ఘకాల వాణిజ్య బంధానికి మెరుగైన ప్యాకేజీ అందిస్తామని హామీ ఇచ్చారు.