కాశ్మీర్లో ఎన్‌కౌంటర్..ఇద్దరు టెర్రరిస్టుల హతం

కాశ్మీర్లో ఎన్‌కౌంటర్..ఇద్దరు టెర్రరిస్టుల హతం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కుప్వారా జిల్లాలో శనివారం ఈ ఎన్‌‌కౌంటర్‌‌ జరిగింది. నియంత్రణ రేఖ వెంబడి టెర్రరిస్టులు చొరబాట్లకు ప్రయత్నిస్తున్నారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో శుక్రవారం కీరన్ సెక్టార్ లో భద్రతా దళాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో శనివారం భద్రతాదళాలు తమ కంటపడగానే టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. 

ప్రతిగా భద్రతాదళాలు కూడా ఎదురు కాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కోర్ ‘ఎక్స్’ లో వెల్లడించింది. ఆపరేషన్ ఇంకా ముగియలేదని.. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ఇటీవల నెల రోజుల క్రితం కూడా కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి టెర్రరిస్టులు భారత్‌‌ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. భద్రతా దళాలు ధీటుగా స్పందించి ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. అనుమానాస్పద కదలికలను గుర్తించిన భద్రతాదళాలు అప్రమత్తమై వారిని అంతమొందించాయని అధికారులు పేర్కొన్నారు.