కుకీస్‌ మేడ్‌ ఇన్‌ స్పేస్‌

కుకీస్‌ మేడ్‌ ఇన్‌ స్పేస్‌

మామూలుగా అయితే కుకీస్‌ తయారు చేయడానికి 15 నుంచి 20 నిమిషాల టైం పడుతుంది. ఇంకా ఎక్కువంటే ఓ 25 నిమిషాలవుతుంది. కానీ అక్కడ కుకీస్‌ చేయడానికి గంటన్నర టైం పట్టింది. అప్పటికీ అవి కాలుతూనే ఉన్నాయి. రెండు గంటలకు గానీ రెడీ అవలేదు. ఎందుకంత టైం పట్టిందంటారు? అంటే అవి చేసింది అంతరిక్షంలో మరి. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లోని ఆస్ట్రోనాట్‌లు తొలిసారి అంతరిక్షంలో కుకీస్‌ తయారు చేశారు. ఇటాలియన్‌ కమాండర్‌ లుకా పర్మిటానో ఈ ‘చాకొలేట్‌ చిప్‌ కుకీస్‌’ ప్రయోగాన్ని చేశారు. నాసా ఆస్ట్రోనాట్‌క్రిస్టినా కోచ్‌ ఆయనకు సహకరించారు. ఇదే విషయాన్ని కోచ్‌ ట్విట్టర్‌ ద్వారా గత నెలలో తెలిపారు. ‘2019 క్రిస్మస్‌కు శాంటా కోసం కుకీస్‌, పాలు రెడీ’ అని ట్వీట్‌ చేశారు. ఇంత చేసినా వాటిని ఎవరూ తినలేదు. వాసన చూసి వదిలేశారంతే. తయారు చేసిన వాటిలో 3 కుకీలు స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌ స్పేస్‌ ‌క్రాఫ్ట్‌ లోజనవరి 7న భూమ్మీదకొచ్చాయి. అవి తినొచ్చో లేదో సైంటిస్టులు పరీక్షలు చేస్తున్నారు. ఐఎస్‌ఎస్‌ కోసం తక్కువ గ్రావిటీలో పని చేసే మైక్రోఓవెన్‌ను నానోరాక్స్‌, జీరో జీ కిచెన్‌ వాళ్లు తయారు చేశారు.