10 నిమిషాల్లో ల్యాప్‌టాప్ డెలివరీ.. హైదరాబాదీలకు ఆసుస్ ఆఫర్, స్విగ్గీతో ఒప్పందం..

10 నిమిషాల్లో ల్యాప్‌టాప్ డెలివరీ.. హైదరాబాదీలకు ఆసుస్ ఆఫర్, స్విగ్గీతో ఒప్పందం..

Swiggy Instamart: భారతదేశంలో ప్రస్తుతం క్విక్ కామర్స్ బూమ్ కొనసాగుతోంది. అనుకున్నదే తడవుగా నిమిషాల్లో అన్నీ డెలివరీ చేసేందుకు సంస్థలు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌‌, బిగ్ బాస్కెట్, జెప్టో లాంటి సంస్థలు పోటీని తారా స్థాయిలకు తీసుకెళ్లాయి. కూరగాయల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అన్నీ నిమిషాల్లో అందిస్తూ కస్టమర్ల మనసును చూరగొంటున్నాయి క్విక్ కామర్స్ సంస్థలు. 

ఈ క్రమంలోనే ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ సంస్థ ఆసుస్ తన ఉత్పత్తులను కేవలం నిమిషాల్లో డెలివరీ చేసేందుకు ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌‌తో జతకట్టింది. ఈ సేవలు బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్, చెన్నై, పూణే, కలకత్తా నగరాల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. Asus Vivobook Go 15, ASUS Vivobook 15, and TUF Gaming F16 మోడళ్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ చెప్పింది. 

గత ఏడాది ఆసుస్ సంస్థ తన యాక్సిసరీలను క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టోలో అమ్మటం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజా ఒప్పందంతో వేగంగా నిమిషాల్లో డెలివరీలను పూర్తి చేయాలని తైవాన్ సంస్థ చూస్తోంది. ప్రధాన మెట్రో నగరాల్లో కస్టమర్లకు కోరుకున్న వెంటనే ఉత్పత్తులను డెలివరీ చేయాలని నిర్ణయించింది. 

ప్రస్తుతం స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ లో అమ్మకానికి అందుబాటులో ఉంచిన మోడల్స్ వివరాలు..

  • Asus Vivobook Go 15 (AMD Ryzen 3, 8GB RAM, 512GB SSD, Windows 11, MS Office): రూ.33,990
  • Asus Vivobook 15 (Intel Core i5 13th Gen, 8GB RAM, 512GB SSD, Windows 11, MS Office): రూ.50,990
  • TUF Gaming F16 (Intel Core i5, RTX 3050 GPU, 16GB RAM, 512GB SSD, 144Hz display, Windows 11, MS Office): రూ.74,990