కిందకి జారుతున్న గో ఫస్ట్​, స్పైస్​జెట్​...

కిందకి జారుతున్న గో ఫస్ట్​, స్పైస్​జెట్​...

బిజినెస్​ డెస్క్, వెలుగు​: విమాన ప్రయాణాలు మళ్లీ జోరందుకున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో మొత్తం 1.29 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేస్తే, జనవరి–మార్చి క్వార్టర్లో  3.75  కోట్ల మంది విమాన ప్రయాణాలు చేశారు. డొమెస్టిక్​ ఫ్లయిట్లలో ప్రయాణాలు ఇంతకు ముందు 2019 కేలండర్​ ఇయర్​ నాలుగో క్వార్టర్లో ఎక్కువగా సాగాయి. ఆ క్వార్టర్లో 3.81 కోట్ల మంది విమానాలలో ప్రయాణించారు. ఆ తర్వాత తాజా క్వార్టర్లో జరిగిన ప్రయాణాలే అత్యధికమని డైరెక్టర్​ జనరల్ ఆఫ్​​ సివిల్​ ఏవియేషన్​(డీజీసీఏ) డేటా వెల్లడించింది. దేశీ విమానయాన కంపెనీలు ఓవైపు సవాళ్లు ఎదుర్కొంటున్నా, ఈ ఏడాది మొదటి క్వార్టర్​ బెస్ట్​ క్వార్టర్​గా రికార్డవడం విశేషం. ఇండిగో, గో ఫస్ట్​ కంపెనీల విమానాలు కొన్ని గ్రౌండ్‌‌‌‌‌‌‌‌​కే పరిమితమయ్యాయి. గో ఫస్ట్​కి చెందిన ఏ320 విమానాలన్నింటిలోనూ ప్రాట్​ అండ్ ​విట్నీ ఇంజిన్లే ఉండగా, ఇండిగో విమానాలు కొన్నింటిలోనూ అవే ఇంజిన్లున్నాయి. ఈ ఇంజిన్లు బాగా సతాయిస్తున్న విషయం తెలిసిందే. మార్చి నెలలో ఇండిగో మార్కెట్​ వాటా సగమైతే, ఇతర ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్​ కంపెనీలేవీ పది శాతం వాటాను దాటలేకపోయాయి.

ఇండిగో లీడర్​....

విమానాల సంఖ్య పరంగా అతి పెద్దదైన ఇండిగో డొమెస్టిక్​ మార్కెట్​లో 55.7 శాతం వాటాతో 2023 కేలండర్​ ఇయర్​ మొదటి క్వార్టర్లో టాప్​ ప్లేస్​లో నిలిచింది. ఈ ఎయిర్​లైన్​ మార్చి నెలలో ఏకంగా 73.17 లక్షల మంది ప్రయాణీకులను మోసుకెళ్లింది. ఒక నెలలో 70 లక్షల మంది ప్రయాణీకుల మార్కును అందుకోవడం ఈ కంపెనీకి ఇదే మొదటిసారి. కొన్ని విమానాలు గ్రౌండ్​కే పరిమితమైనా, మిగిలిన విమానాలను సమర్ధంగా ఉపయోగించుకుంటూ తన వాటా పెంచుకుంది ఇండిగో. అంతకు ముందు కొన్ని నెలల పాటు నెంబర్​ 2 పొజిషన్​లోకి వచ్చిన ఎయిర్​ ఇండియా మార్చి నెలలో మూడో ప్లేస్​కి జారిపోయింది. విస్తారా ఎయిర్​లైన్​ ఈ కంపెనీని వెనక్కి నెట్టి  రెండో ప్లేస్​లో నిలిచింది. టాటా గ్రూప్​లోని మూడు ఎయిర్​లైన్స్​ కంపెనీలకు కలిపి ఇప్పుడు 25.1 శాతం వాటా ఉంది. ఆ గ్రూప్​ పెట్టుకున్న టార్గెట్​30 శాతం కంటే ఇది కొంచెమే తక్కువ. నిజానికి కెపాసిటీ ఎయిర్​ ఇండియాకే ఎక్కువ ఉన్నప్పటికీ, ఎక్కువ లోడ్​ ఫ్యాక్టర్​తో విస్తారా ముందంజలో ఉంది.

కిందకి జారుతున్న గో ఫస్ట్​, స్పైస్​జెట్​...

గతంలో రెండో పెద్ద ప్లేయర్​గా నిలిచిన స్పైస్​జెట్​ వేగంగా కిందకి జారిపోతోంది. ఈ ఏడాది మార్చిలోను, మొదటి క్వార్టర్లోనూ కూడా మార్కెట్​ వాటా పరంగా ఆరో ప్లేస్​లో ఈ ఎయిర్​లైన్​ నిలిచింది. ఇక గో ఫస్ట్​ మార్కెట్​ వాటా ఎయిర్ ఏషియా ఇండియా కంటే దిగువకు పడిపోయింది. కాకపోతే ఆశ్చర్యకరమైన విషయమేమంటే గో ఫస్ట్​, స్పైస్ జెట్​ ఎయిర్ ​లైన్స్​ రెండూ మార్చి నెలలో హయ్యస్ట్​ లోడ్​ ఫ్యాక్టర్​ సాధించాయి.