ఢిల్లీలో 3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత

ఢిల్లీలో 3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత

ఢిల్లీని చలి గజ...గజ వణికిస్తోంది. ఈ వింటర్ సీజన్ లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ దేశ రాజధానిలో 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  ఢిల్లీతో సహా ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఉదయం 5 గంటల 30 నిమిషాలకు కూడా పొగ మంచు కురుస్తూనే ఉంది. చలి పంజాకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. అటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

ఢిల్లీలో టెంపరేచర్లు భారీగా పడిపోవడంతో చలి గాలులు వీస్తున్నాయి. సఫ్దర్ గంజ్​లో మంగళవారం మినిమమ్ టెంపరేచర్ 8.5 డిగ్రీలు నమోదు కాగా, బుధవారం ఉదయం 4.4 డిగ్రీలకు పడిపోయింది. ఈ సీజన్ లో ఇదే అతి తక్కువ టెంపరేచర్ అని వాతావరణ శాఖ తెలిపింది. హిల్ స్టేషన్లు అయిన డెహ్రాడూన్ (4.5 డిగ్రీలు), ధర్మశాల (5.2 డిగ్రీలు), నైనిటాల్ (6 డిగ్రీలు) కంటే తక్కువ టెంపరేచర్ ఢిల్లీలో నమోదైందని వెల్లడించింది. 

రానున్న రెండ్రోజుల పాటు ఢిల్లీ,ఉత్తర భారతంలో చలిగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సిటీలో మ్యాగ్జిమమ్ టెంపరేచర్లు 15 డిగ్రీలలోపే  ఉండొచ్చని చెప్పింది. కాగా, చలి పెరగడంతో ఢిల్లీని పొగమంచు కప్పేసింది. రోడ్లపై వెహికల్స్ కనిపించడం లేదు. పొగమంచు వల్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీకి వచ్చే రైళ్లు ఆలస్యంగా నడిచాయి. 19 రైళ్లు ఆలస్యంగా వచ్చాయి.  

పంజాబ్, హర్యానాకు రెడ్ అలర్ట్... 

రానున్న నాలుగైదు రోజులు నార్త్ వెస్ట్ రాష్ట్రాలపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్​లో నార్మల్ కంటే తక్కువగా టెంపరేచర్లు నమోదవుతాయని చెప్పింది. హర్యానా, పంజాబ్​కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ లో మ్యాగ్జిమమ్ టెంపరేచర్లు 10 నుంచి 12 డిగ్రీల మధ్యే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

జమ్మూకాశ్మీర్ లో మైనస్ టెంపరేచర్లు.. 

జమ్మూకాశ్మీర్​లో విపరీతమైన మంచు కురుస్తోంది. నైట్ టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. మంగళవారం రాత్రి అతి తక్కువగా పహల్గామ్​లో మైనస్ 9.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైందని అధికారులు చెప్పారు. గుల్ మార్గ్​లో మైనస్ 8.4 డిగ్రీలు, కుప్వారాలో మైనస్ 6 డిగ్రీలు, శ్రీనగర్​లో మైనస్ 5.2 డిగ్రీలు, కోకర్ నాగ్​లో మైనస్ 3.8 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయని తెలిపారు.