
హాయిగా రోజూ కాలేజీకి వెళ్లడం, చదువుకోవడం, ఫ్రెండ్స్‌తో కాసేపు సరదాగా గడపడం.. టీనేజీ కుర్రాళ్లు అంతకు మించి ఇంకేం చేస్తారు ? కానీ.. తిలక్ పండిట్ అందరిలా కాదు. కాలేజీలో చదువుతూనే ఒక ఎంట్రప్రెన్యూర్‌లా ఆలోచించాడు. అమ్మ ఇంట్లో చేసిపెట్టే శ్నాక్స్‌ని కాలేజీ ఫెస్ట్‌లో అమ్మి, డబ్బు సంపాదించాడు. అంతటితో ఆగకుండా స్టార్టప్ పెట్టాడు. ఇంటి వంట గదిలో తయారుచేసే థెకువా శ్నాక్స్‌ని దేశమంతా డెలివరీ చేస్తూ ఇరవై ఏండ్లు వచ్చేనాటికే లక్షల్లో సంపాదించే బిజినెస్‌మ్యాన్‌గా ఎదిగాడు.
తిలక్ పండిట్ అస్సాంలోని గువహటిలో పుట్టి పెరిగాడు. వయసు ఇరవై ఏండ్లు. వాళ్ల ఫ్యామిలీ ఒరిస్సాలో సెటిల్ అయినా ప్రతి సంవత్సరం బిహారీ సంప్రదాయ ఛత్ పండుగను ఘనంగా చేసుకునేవాళ్లు. బిహారీలకు ఛత్ పూజ అనగానే గుర్తొచ్చేది ‘థెకువా’ అనే శ్నాక్స్. పండుగ రోజు గోధుమ పిండి, బెల్లం, నెయ్యితో థెకువాలను చేసి, బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయిస్తారు. తిలక్ వాళ్ల ఇంట్లో కూడా ప్రతి సంవత్సరం థెకువాలు చేస్తుంటుంది. వాటిని కుటుంబమంతా కలిసి ఇష్టంగా తింటుంటారు.
చిన్న స్టాల్‌లో అమ్మి..
తిలక్ చదువుతున్న కాలేజీలో జరిగిన ఒక ఫెస్ట్‌లో అందరూ చిన్న చిన్న స్టాల్స్ పెట్టి ఫుడ్ ఐటమ్స్ అమ్మారు. తిలక్ కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి రెగ్యులర్ శ్నాక్స్‌కి బదులు థెకువాతో స్టాల్ పెట్టాలి అనుకున్నాడు. ఆ విషయం వాళ్ల అమ్మకు చెప్పి, రూ. 5 వేలు ఖర్చు పెట్టి థెకువాలు చేయించాడు. వాటితో స్టాల్ ఏర్పాటు చేసిన కొద్దిసేపటికే స్టాక్ అంతా అమ్ముడైంది. అప్పటికే కొన్నవాళ్లు మళ్లీ వచ్చి ఇంకొన్ని కావాలని అడిగారు. ఇంకొందరేమో ‘ఇప్పుడు ఆర్డర్ తీసుకోండి. కుదిరినప్పుడు చేసి ఇవ్వండి’ అని రిక్వెస్ట్ చేశారు. వాటి టేస్ట్ అక్కడివాళ్లకు అంతలా నచ్చింది. అది చూసి తిలక్ చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడే థెకువాలను తనలాగే ఎంతోమంది ఇష్టపడతారని అర్థమైంది.
ఆన్‌లైన్ స్టోర్
థెకువాలకు ఉన్న డిమాండ్‌ని చూసి తిలక్ బిజినెస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ.. అప్పటివరకు అతనికి గానీ, ఆ ఫ్యామిలీకి గానీ బిజినెస్ చేసిన అనుభవం లేదు. అయినా.. అన్నీ స్వయంగా నేర్చుకున్నాడు. ఆన్‌లైన్ స్టోర్ నడపడం నుంచి లాజిస్టిక్స్, ప్యాకేజింగ్‌ను మేనేజ్ చేయడం వరకు ప్రతీది తెలుసుకున్నాడు. 2020లో ‘దేశీ టెసి’ పేరుతో ఒక స్టార్టప్ పెట్టాడు. ఆ తర్వాత వాళ్ల అమ్మతో ఇంట్లోనే థెకువాలు చేయిస్తూ ఆన్‌లైన్‌లో అమ్మడం మొదలుపెట్టాడు. కానీ.. మొదట్లో పెద్దగా ఆర్డర్లు రాలేదు. ఎక్కువ పెట్టుబడి పెట్టి బిజినెస్ పెంచుకుందామంటే అతని దగ్గర డబ్బు కూడా లేదు. అందుకే బ్రాండ్ గురించి జనాలకు తెలియడానికి కాస్త టైం పట్టింది. కొన్నాళ్లకు మౌత్ టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కస్టమర్లు ఇచ్చే రివ్యూల ద్వారా బ్రాండ్ పాపులర్ అయ్యింది.
రెండేళ్లకు..
దేశీ టెసి పెట్టిన రెండేళ్లకు దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ ఆర్డర్లు రావడం మొదలైంది. తిలక్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా క్రియేటివ్‌గా ప్రమోషన్ చేయడం వల్ల అతని బ్రాండ్ గురించి అందరికీ తెలిసింది. తనముందు ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకున్నాడు. అందుకే థెకువా సాంస్కృతిక ప్రాముఖ్యత, తయారీ విధానం, కస్టమర్లు ఇచ్చే రివ్యూలు.. ఇలా అన్ని విషయాలను ఆకర్షణీయమైన పోస్ట్‌ల ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దాంతో ఎంతోమంది ఈ తరం వాళ్లకు థెకువా ప్రాముఖ్యత తెలిసింది. గతంలో ఛాత్ రోజే థెకువాను తినేవాళ్లు. కానీ.. ఆన్‌లైన్‌లో దొరకడంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి తెప్పించుకోవడం మొదలుపెట్టారు. బిజినెస్ పెరిగిన తర్వాత థెకువాని మరికొన్ని ఫ్లేవర్స్‌తో తీసుకొచ్చాడు. దేశీటెసిని మార్కెట్‌లో ప్రత్యేకంగా నిలబెట్టే మరో విషయం ఏంటంటే.. ఏ సీజన్‌లో అయినా, ఎంత డిమాండ్ ఉన్నా థెకువాలని చేత్తో మాత్రమే తయారుచేస్తారు. ఎలాంటి మెషీన్లను వాడరు. అదే విషయాన్ని తెలిపేందుకు ప్రతి ప్యాక్ మీద ‘హ్యాండ్ మేడ్’ అని ప్రింట్ చేయిస్తున్నాడు తిలక్.
ఏమీ లేకున్నా..
అన్ని స్టార్టప్‌ల్లా నిధుల సేకరణ, సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్స్ లాంటివి లేకుండానే దేశీటెసి సక్సెస్ అయ్యింది. ఒక చిన్న ప్రయోగంగా ప్రారంభమైన దేశీటెసి ఇప్పుడు పాన్-ఇండియా బ్రాండ్‌గా ఎదిగింది. ఇప్పటికీ అతని స్టార్టప్‌కి పెద్ద పెట్టుబడిదారులు లేరు. పెద్ద పెద్ద తయారీ యూనిట్లు లేవు. కుటుంబ సాయంతోనే డిమాండ్‌కు అనుగుణంగా ప్రొడక్షన్ పెంచుతున్నాడు. ప్రతి ఆర్డర్‌ను ఇంట్లోనే అందరూ కలిసి తయారుచేసి, జాగ్రత్తగా ప్యాక్ చేస్తారు. ఇక డెలివరీలు, కస్టమర్ ఫీడ్‌బ్యాక్ లాంటివన్నీ తిలక్ చూసుకుంటాడు. క్వాలిటీ తగ్గకూడదని చిన్న చిన్న బ్యాచ్‌లుగా స్టాక్‌ని రెడీ చేస్తుంటారు. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం, తయారీలో ప్రీమియం దేశీ నెయ్యి, బెల్లం వాడడం, ఆకట్టుకునే ప్యాకేజింగ్ వల్ల బ్రాండ్ జనాలకు మరింత చేరువయ్యింది. అందుకే ఇప్పుడు దేశీ టెసి ద్వారా తిలక్ ప్రతి సంవత్సరం లక్షల్లో సంపాదిస్తున్నాడు.