ఎన్నికల విధుల్లో కరోనాతో చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి పరిహారం

ఎన్నికల విధుల్లో కరోనాతో చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి పరిహారం

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై  అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల  జరిగిన పంచాయతీ ఎన్నికల విధులకు హాజరై..కరోనాతో చనిపోయిన పోలింగ్‌ అధికారులకు కోటి రూపాయల పరిహారం చెల్లించాల్సిందేనని  అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పరిహారం తక్కువగా ఉండటంపై కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, క్వారంటైన్‌ సెంటర్లలో పరిస్థితులపై దాఖలైన  పిటిషన్ పై విచారించిన జస్టిస్‌ సిద్ధార్ధ్‌ వర్మ, జస్టిస్‌ అజిత్‌ కుమార్లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పరిశీలన చేసింది. కుటుంబంలో ఆదాయాన్ని ఆర్జించే వ్యక్తి మరణిస్తే.. ఆ లోటు ఎవరూ పూడ్చలేనిదని తెలిపింది. RTPCR  రిపోర్టు లేకున్నా..విధులు నిర్వర్తించాలని రాష్ట్రం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ బలవంతపు చర్యల కారణంగా... బాధితులకు పరిహారం కనీసం కోటి రూపాయలు ఉండాలని చెప్పింది. నష్టపరిహారంపై ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వం పునరాలోచించుకుని...వచ్చే విచారణ నాటికి తమకు అభిప్రాయాన్ని తెలుపుతున్నారని ఆశిస్తున్నామని తెలిపింది. 

మీరట్‌లో 20 మంది రోగులు చనిపోవడంపై స్పందిస్తూ....అందులో చనిపోయిన వారంతా కరోనా రోగులుగా గుర్తించాలని తెలిపింది. ఆస్పత్రుల్లో  కరోనా మరణాలు తగ్గించేందుకు నాన్‌ కొవిడ్‌ కేసులుగా చూపించవద్దని  కోర్టు తెలిపింది. 20 మంది ఎలా చనిపోయారో ఖచ్చితమైన నివేదికలను మీరట్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ అందించాలని ఆదేశించింది.