మంచు తుఫాన్ తో వణికిపోతున్న అమెరికా

మంచు తుఫాన్ తో వణికిపోతున్న అమెరికా
  • దేశవ్యాప్తంగా తీవ్రమైన మంచు తుఫాన్ 
  • మైనస్ 48 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్లు
  • 15 లక్షలకుపైగా ఇండ్లకు కరెంట్ కట్    
  • పైపుల్లో నీళ్లూ గడ్డకడుతున్నయ్  
  • 15 మంది మృతి.. 20 కోట్లకుపైగా మందిపై ఎఫెక్ట్  

వాషింగ్టన్‌: అమెరికాలో క్రిస్మస్ పండుగ వేళ.. శీతాకాలపు మంచు తుఫాన్ జనాలను గజగజా వణికిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నాటికి మరింత తీవ్రమైన తుఫాన్​ను.. ‘బాంబ్ సైక్లోన్’గా పిలుస్తున్నారు. టెంపరేచర్లు ఆయా ప్రాంతాల్లో మైనస్ 20 డిగ్రీల నుంచి మైనస్ 48 డిగ్రీల వరకూ పడిపోయాయి. దేశవ్యాప్తంగా కురుస్తున్న విపరీతమైన మంచు, ఎముకలు కొరికే చలితో కోట్లాది మంది అల్లాడిపోతున్నారు. హైవేలన్నీ క్లోజ్ అయ్యాయి. వేలాది విమానాలు ఎయిర్ పోర్టుల్లోనే ఆగిపోయాయి. బయటికొచ్చే పరిస్థితి లేక ప్రజలు క్రిస్మస్ ప్రయాణాలనూ మానుకుని ఇండ్లలోనే ఉండిపోతున్నారు. మంచు తుఫాన్ కారణంగా15 లక్షలకుపైగా ఇండ్లకు కరెంట్ సప్లై నిలిచిపోయి అనేక ప్రాంతాల్లో అంధకారం అలముకుంది. అనేక రాష్ట్రాల్లో టెంపరేచర్లు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పైపుల్లో నీరు సైతం గడ్డకట్టడంతో వాటర్ సప్లై కూడా ఆగిపోయింది. ఏటా ఈ సమయంలో నార్మల్ టెంపరేచర్లు ఉండే దక్షిణాది రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత పెరిగి జనం అవస్థలు పడుతున్నారు. 

22.3 ఇంచ్ ల మంచు కురిసింది.. 

యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ రిపోర్ట్ ప్రకారం శుక్రవారం దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత మైనస్ -48 డిగ్రీల దాకా పడిపోయింది. న్యూయార్క్ స్టేట్ లోని బఫెలో సిటీలో రికార్డ్ స్థాయిలో ఒక్క రోజులోనే 22.3 ఇంచ్ లు మంచు కురిసింది. మంచు తుఫాన్ వల్ల ఇప్పటివరకూ 15 మంది చనిపోయారు. దాదాపు 20 కోట్ల మందికిపైగా ప్రజలపై ప్రభావం పడింది. కరెంట్ సప్లై లేక, బయటకు వెళ్లలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.   

మంచు వర్షం.. భీకర గాలులు   

మంచు తుఫాన్ కొనసాగుతూ.. ఇరవై నాలుగు గంటలపాటు నిరంతరం ప్రెజర్ డ్రాప్ అయిపోతే దానిని ‘బాంబ్ సైక్లోన్’గా పిలుస్తారు. బాంబ్ సైక్లోన్ పరిస్థితి ఏర్పడితే భారీ వర్షాలు లేదా విపరీతంగా మంచు వర్షం కురుస్తుంది. తీర ప్రాంతాల్లో వరదలూ సంభవిస్తాయి. బాంబ్ సైక్లోన్ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో హరికేన్ తుఫాన్ స్థాయిలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ప్రస్తుత బాంబ్ సైక్లోన్ వల్ల లేక్ ఇరీలో 8 మీటర్ల మేరకు వేవ్స్ వస్తున్నాయని కెనడాలోని టొరంటోకు చెందిన మెటియోరాలజిస్ట్ కెల్సీ మెక్ ఎవెన్ ట్వీట్ చేశారు. ఓహియోలోని ఫైర్ పోర్ట్ హార్బర్ వద్ద గంటకు 120 కిలోమీటర్ల స్పీడ్ తో గాలులు వీస్తున్నాయని నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించింది. 

5 వేల విమానాలు రద్దు 

మంచు తుఫాన్ కారణంగా అమెరికాలో శుక్రవారం ఒక్కరోజే 5 వేల విమానాలు రద్దయ్యాయి. మరో 7,600 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఒహియోలో మంచు తుఫాన్ కారణంగా 50 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోయాడు. మిచిగాన్‌లోనూ 9 ట్రాక్టర్లు ఢీకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు ప్రకటన చేశారు. కంటిన్యూగా మంచు కురుస్తుండటంతో రోడ్లపై ఏమీ కన్పించడంలేదని చెప్పారు.  

మరిగే నీళ్లూ గాలిలోనే గడ్డకడ్తున్నయ్    

కెంటకీ స్టేట్ లోని గ్లాస్గోలో, మోంటానా స్టేట్ లో టెంపరేచర్లు రాత్రికి రాత్రే మైనస్ 48 డిగ్రీలకు పడిపోయాయి. ఇక్కడ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ అధికారి రిచ్ మలియావ్ కో హెచ్చరించారు. చలి నుంచి రక్షణ కోసం జాకెట్లు, గ్లౌజ్ ల వంటివి వాడాలని, లేకపోతే చర్మాన్ని ఐదు నిమిషాల్లోనే మంచు కొరికేస్తుందన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నీళ్లు పైపుల్లోనే గడ్డకడుతున్నాయి. మరిగే నీళ్లు సైతం గాలిలోకి విసిరేస్తే గడ్డకడుతున్నాయి. దీంతో అనేక మంది మరిగే నీటిని విసిరి.. నీళ్లు గడ్డ కడుతుండటాన్ని వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. ‘బాయిలింగ్ వాటర్ చాలెంజ్’ అంటూ సోషల్ మీడియాలో సవాల్ విసురుతున్నారు. ఇక టెక్సాస్ కు మెక్సికో నుంచి వలస వచ్చిన వాళ్లు చర్చిలు, స్కూళ్లు, ఇతర షెల్టర్లలో తలదాచుకుంటున్నారు. ఇమిగ్రేషన్ ఆఫీసర్లు పట్టుకుంటారన్న భయంతో కొంతమంది చలిలోనే బయట తిరుగుతున్నారు. షికాగో, తదితర ప్రాంతాల్లో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో షెల్టర్లు ఓపెన్ చేస్తున్నారు. బాధితులకు దుప్పట్లు, గ్లౌజ్ లు, కోట్లు, ఇతర వస్తువులను అందిస్తున్నారు.