పార్టీలో ఉందమా.. పోదామా ?.. డైలమాలో కార్పొరేటర్లు

పార్టీలో ఉందమా.. పోదామా ?..  డైలమాలో కార్పొరేటర్లు
  • గ్రేటర్ కార్పొరేటర్లలో ముగ్గురికి మాత్రమే ప్రధాన పార్టీల టికెట్లు
  •     డైలమాలో మిగతా కార్పొరేటర్లు 
  •      టికెట్ దక్కని వారిలో ఇప్పటికే కొందరు జంప్
  •     బీజేపీ కార్పొరేటర్లపై బీఆర్ఎస్ ఫోకస్

హైదరాబాద్, వెలుగ :  ఎన్నికల వేళ గ్రేటర్​లోని ప్రధాన పార్టీల కార్పొరేటర్లు డైలామాలో పడ్డారు. ఆయా పార్టీల నుంచి ఎమ్మెల్యే టికెట్​ ఆశించిన పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే పక్క పార్టీలో చేరుతున్నారు.  మరి కొందరు కూడా అదే ఆలోనలో ఉన్నట్టు తెలుస్తోంది.  బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​కు, కాంగ్రెస్ నుంచి బీఆర్​ఎస్​కు, బీజేపీ  నుంచి బీఆర్​ఎస్​కు ఇలా.. పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే పార్టీలు మారారు. బీజేపీ కార్పొరేటర్లపై అధికార బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.

టికెట్ రాలేదని అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ పెద్దలు  ప్రయత్నిస్తున్నారు. 4 రోజుల కిందట హిమాయత్​నగర్ కార్పొరేటర్ బీజేపీని వీడి బీఆర్ఎస్​లో చేరారు.  వెంటనే రంగంలోకి దిగిన ఆ పార్టీ స్టేట్ చీఫ్  కిషన్ రెడ్డి కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టికెట్ రాలేదని నిరాశపడకుండా పార్టీ కోసం పనిచేయాలని, భవిష్యత్​లో తమకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. కిషన్ రెడ్డి ప్రయత్నాలకు కూడా ఫలితం దక్కనట్లుగానే కనిపిస్తోంది. ఇయ్యాల ఎల్​బీ స్టేడియంలో జరగనున్న ప్రధాని మోదీ సభకు కూడా కొందరు కార్పొరేటర్లు దూరంగా ఉండనున్నట్లు సమాచారం.  ఇంకొందరు బీజేపీ కార్పొరేటర్లు అధికార బీఆర్ఎస్​తో టచ్​లో ఉన్నట్లు తెలిసింది. అంతా ఓకే అయితే వచ్చే వారం చేరికలు జరిగేలా కనిపిస్తోంది. 

అధికార పార్టీ నుంచి ఒక్కరూ లేరు..

 గ్రేటర్ లో ప్రస్తుతం 150 డివిజన్లు ఉండగా.. గుడి మల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ మృతితో ఆ డివిజన్ ఖాళీగా ఉంది. ప్రస్తుతం 149 కార్పొరేటర్లు ఉండగా..  బీఆర్ఎస్ కార్పొరేటర్లు 60, ఎంఐఎం 44, బీజేపీ 40, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఐదుగురు ఉన్నారు. ఈ 149 మందిలో సగం మంది ఎమ్మెల్యే టికెట్లను ఆశించారు.

అయితే, ముగ్గురికి మాత్రమే ప్రధాన పార్టీల టికెట్లు దక్కాయి. ఇందులో  శేరిలింగంపల్లి నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, రాజేంద్రనగర్ బీజేపీ అభ్యర్థిగా  మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా షేక్ పేట కార్పొరేటర్ రషీద్ ఫరాజుద్దీన్ టికెట్ దక్కించుకున్నారు. అధికార పార్టీ నుంచి ఒక్కరికి కూడా టికెట్ దక్కలేదు. 

18 మంది కార్పొరేటర్లతో గులాబీ పార్టీ మంతనాలు..
 

ప్రస్తుతం బీజేపీ కార్పొరేటర్లు 40 మంది ఉన్నారు. ఇప్పటికే ఆరుగురు బీజేపీ కార్పొరేటర్లు గులాబీ గూటికి చేరారు.  ఇంకొందరు జంప్ అవుతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇటీవల 18 మంది కార్పొరేటర్లతో బీఆర్ఎస్​ పార్టీ నేతలు మంతనాలు జరిపినట్లు సమాచారం. ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్ పార్టీ.. ఆపరేషన్ ఆకర్ష్​ను మరింత వేగం చేసినట్లు కనిపిస్తోంది. నియోజకవర్గ స్థాయి లీడర్లతో పాటు పోటీ చేసే అభ్యర్థులు అవసరమైతే ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్​లో టికెట్ ఆశించిన భంగపడ్డ ఏఎస్​రావు నగర్ కార్పొరేటర్ శిరీషా రెడ్డి భర్త సోమశేఖర్ రెడ్డి.. ఇటీవల  బీఆర్ఎస్​లో చేరారు. బీఆర్ఎస్​ కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్​లో చేరారు. జగదీశ్వర్​ గౌడ్ కాంగ్రెస్ నుంచి శేరిలింగంపల్లి టికెట్ దక్కించుకున్నాడు.   

పార్టీలు మారింది ఇలా..

    బీఆర్ఎస్ నుంచి 56 మంది కార్పొరేటర్లు గెలుపొందగా, ముగ్గురు కార్పొరేటర్లు ఇటీవల  కాంగ్రెస్​లో చేరారు. 
    బీజేపీ నుంచి గెలిచిన ఆరుగురు కార్పొరేటర్లు  బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
    కాంగ్రెస్ కార్పొరేటర్ ఒకరు ఇటీవల బీఆర్ఎస్​లో చేరారు.