ప్రధాని పట్టా ఇచ్చిన భూములూ  ఫారెస్ట్ వేనట! 

ప్రధాని పట్టా ఇచ్చిన భూములూ  ఫారెస్ట్ వేనట! 
  • మూడు గ్రామాలకు శాపంగా మారిన భూరికార్డుల మార్పులు


మెదక్/ రామాయంపేట, వెలుగు: సాక్షాత్తు దేశ ప్రధాన మంత్రి చేతుల మీదుగా ప్రారంభించిన భూపంపిణీ కార్యక్రమంలో పట్టాలిచ్చిన్రు. పదహారేండ్ల నుంచి సాగు చేస్తూ పంటలు పండించుకుంటుండగా ఇప్పుడు ఆ భూములు ఫారెస్ట్​లో ఉన్నవంటున్రు. అట్లని చెప్పి పార్ట్​ బిలో పెట్టడంతో కొత్త పాస్​బుక్​లు ఇయ్యలేదు. దాంతో రైతుబంధు సాయం అందుతలేదు. రైతు బీమా స్కీం వర్తిస్తలేదు. ఇది ఏ ఐదుగురో, పది మంది సమస్యనో కాదు... సుమారు 300 మంది రైతుల సమస్య. మూడేండ్ల నుంచి బాధిత రైతులు తహసీల్దార్ మొదలుకుని కలెక్టర్​ దాక దరఖాస్తులు ఇచ్చినా.. ఎన్నిసార్లు ఆఫీస్​ల చుట్టు తిరిగినా సమస్య పరిష్కరిస్తలేరు. కొత్త పాస్​బుక్​లు ఇస్తలేరు. రెవెన్యూ, ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​లు జాయింట్​ సర్వే చేసి సమస్య పరిష్కరించాల్సింది పోయి జాప్యం చేస్తుండటంతో రెండు శాఖల మధ్య వందలాది మంది రైతులు నలిగిపోతున్నారు. 
మొత్తం 550 ఎకరాలు
మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్ శివారులోని సర్వే నంబర్ 881లో 550 ఎకరాల భూమి ఉంది. రాయిలాపూర్, సుతారిపల్లి, వెంకటాపూర్​ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు దశాబ్దాలుగా ఆ భూమి సాగు చేసుకుంటున్నారు. బోర్లు వేసుకుని పంటలు పండించుకుంటున్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్​ ప్రభుత్వం రూలింగ్​ లో ఉన్నప్పుడు 2005 ఆగస్టు 21న మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్​ చేతుల మీదుగా భూపంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులకు పట్టాలు అందజేశారు. అందులో భాగంగా రాయిలాపూర్, సుతారిపల్లి, వెంకటాపూర్​ గ్రామాలకు చెందిన 300 మంది  రైతులకు భూమి పట్టాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం అసైన్​మెంట్​ భూమి పంపిణీ చేసినప్పుడు రైతులకు పట్టా సర్టిఫికెట్​ఇవ్వడంతోపాటు రెవెన్యూ ఆఫీసర్లు వారికి కేటాయించిన భూమి ఎక్కడుందనేది పొజిషన్​ చూపించాలి. 2005లో భూపంపిణీ కార్యక్రమం సందర్భంగా జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇదివరకు ప్రభుత్వ భూమిలో కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న రైతులకే పట్టాలిచ్చారు. రాయిలాపూర్, సుతారిపల్లి, వెంకటాపూర్​లోనూ అదే జరిగింది. దాదాపు ముప్పై ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములకే భూ పంపిణీలో భాగంగా రైతులకు పట్టాలిచ్చారు. అప్పటివరకు రైతులు అనధికారికంగా ఆ భూములు సాగు చేసుకుంటుండగా, పట్టాలివ్వడంతో వారికి ఆ భూమిపై హక్కులు లభించాయి. దీంతో చాలామంది రైతులు బోర్లు వేసుకోవడంతోపాటు, బ్యాంక్​లు, సొసైటీల నుంచి క్రాప్​లోన్​తీసుకుని పంటలు పండించుకుంటున్నారు.
 జాయింట్​ సర్వే పూర్తి కాక..
భూ రికార్డుల మార్పుల తర్వాత గ్రామంలో ఇతర సర్వే నంబర్​లలో భూములున్న రైతులకు కొత్త పాస్​బుక్​లు ఇచ్చి 881 సర్వే నంబర్​లో ఉన్న భూములను మాత్రం పార్ట్​ బిలో చేర్చారు. కొత్త పాస్​ బుక్​లు జారీ చేయకపోవడంతో బాధిత రైతులు రామాయంపేట తహసీల్దార్ కు పలుసార్లు విన్నవించారు. అయినా ఫలితం లేకపోవడంతో కొందరు రైతులు మెదక్ వెళ్లి  కలెక్టర్ ను కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్​ ఆదేశాల మేరకు గతేడాది రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు జాయింట్​ సర్వే జరిపారు. అయితే దాదాపు 50 ఎకరాలకు సంబంధించి మాత్రమే సుమారు 30 మంది రైతులకు కొత్త పాసు బుక్​లు జారీ చేశారు.  ఆ భూములు రెవెన్యూవా, ఫారెస్ట్​వా అనేది ఇంకా తేలలేదని చెప్పి దాదాపు 250 మంది రైతులకు పాస్​ బుక్కులు ఇవ్వలేదు. భూమి రైతుల కబ్జాలోనే ఉండి సాగు చేసుకుంటున్నప్పటికీ పాస్​ బుక్కులు లేకపోవడంతో ప్రభుత్వం రైతు బంధు స్కీం కింద ఇచ్చే పెట్టుబడి సాయం అందడం లేదు. అలాగే రైతు బీమా స్కీంలోనూ చేరలేకపోతున్నారు. పాస్ బుక్కులు లేకపోవడంతో భూములు ఉంటాయో.. పోతాయో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జాయింట్​సర్వే పూర్తి చేసి తమకు కొత్త పాసు బుక్కులు ఇవ్వాలని కోరుతున్నారు.

ఫారెస్ట్​ భూములని పార్ట్​ - బి లో పెట్టారు 
2005లో రైతులకు పట్టాలివ్వగా 2017లో ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన చేపట్టేవరకు ఎలాంటి ఇబ్బందులు లేవు. రికార్డుల మార్పు చేపట్టినప్పుడు రాయిలాపూర్​ శివారులోని 881 సర్వే నంబర్​లోని భూములు ఫారెస్ట్ పరిధిలో ఉన్నాయని రెవెన్యూ అధికారులు ఆ భూములను పార్ట్​బిలో చేర్చి రైతులకు కొత్త పాస్ బుక్ లు జారీ చేయలేదు. 2005లో ప్రభుత్వమే పట్టా సర్టిఫికెట్​లు ఇచ్చిందని, వాటి ఆధారంగా అప్పట్లో రెవెన్యూ ఆఫీసర్లు పాసు పుస్తకాలు కూడా ఇచ్చారని రైతులు చెప్పినా వినిపించుకోలేదు. దాదాపు ఇరవై ఏళ్లుగా పంటలు పండించుకుంటుండగా ఇప్పుడు ఫారెస్ట్​ పరిధిలో ఉన్నాయని కొత్త పాస్​ బుక్​లు ఇవ్వకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు పట్టాలిచ్చేటపుడు ప్రభుత్వ భూమిగా ఉండి, కొత్త పాస్ బుక్​ల జారీకి వచ్చేసరికి అది ఫారెస్ట్​ భూమి ఎట్లా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. 


మా గెజిట్​లో లేదు
సర్వే నంబర్ 881 మా గెజిట్ లో లేదు. కానీ రెవెన్యూ రికార్డుల్లో ఫారెస్ట్ భూములు అని ఉంది. మా ఫారెస్ట్​ గెజిట్ లో ఉంటే మేమే స్వాధీనం చేసుకునేవాళ్లం.
                                                                                                                                                                       – కుత్బుద్దీన్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామాయంపేట