
పాత ల్యాప్‌టాప్, మూలన పడ్డ టీవీ, పాడైపోయిన ఫోన్.. సరిగ్గా వెతికితే ఇంట్లో ఇలాంటి వాడని ఎలక్ట్రానిక్ వస్తువులు చాలానే ఉంటాయి. చాలామంది వాటితో ఎలాంటి ఉపయోగం లేకపోయినా రకరకాల కారణాల వల్ల పారేయడానికి ఇష్టపడరు. కానీ.. అలా పనికిరాని వస్తువుల్లో బంగారం, వెండి లాంటి విలువైన మెటల్స్ ఉంటాయి. వాటిని ఆ పరికరాల నుంచి వేరు చేసేందుకే అటెరో అనే స్టార్టప్ పెట్టారు ఇద్దరు బ్రదర్స్. ఆ మెటల్స్‌ని మళ్లీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు అమ్మి డబ్బు సంపాదిస్తున్నారు.
పండగలప్పుడు ఇంట్లో సామాన్లు సర్దుతుంటే అల్మారాల్లో ఎన్నో పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులు కనిపిస్తుంటాయి. వాటి లోపల విలువైన బంగారం, వెండి, లిథియం, కోబాల్ట్ లాంటివి ఉంటాయి. వాటిని బయటికి తీసి మళ్లీ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, సోలార్ ప్యానెల్స్ లాంటి వాటిలో వాడొచ్చు. కానీ.. ఈ విషయం తెలియక చాలామంది పనికిరాని వస్తువులను చెత్తకుప్పల్లో పారేస్తుంటారు. చెత్త నిర్వహణ సరిగ్గా లేకపోతే అలాంటివన్నీ లోతట్టు ప్రాంతాల్లో పేరుకుపోయి కాలుష్యానికి దారితీస్తాయి.
ప్రపంచంలో ఈ వేస్ట్‌ని ఉత్పత్తి చేసే మూడో అతిపెద్ద దేశం మనదే. ఏటా 3.2 మిలియన్ టన్నులకు పైగా పరికరాలు ఈ వేస్ట్‌గా మారుతున్నాయి. వాటిలో దాదాపు 95 శాతం వేస్ట్‌ని ప్రాపర్‌గా రీసైకిల్ చేయడం లేదు. వాటి నుంచి వచ్చే సీసం(లెడ్), పాదరసం(మెర్క్యూరీ) లాంటివి వాటర్ టేబుల్‌ని కలుషితం చేస్తాయి. సరైన పద్ధతిలో రీసైకిల్ చేస్తే.. మైనింగ్‌తోపాటు మన దేశం దిగుమతులపై ఆధారపడటాన్ని కూడా తగ్గించవచ్చు. అదే పని అటెరో స్టార్టప్ చేస్తుంది.
పాత ల్యాప్‌టాప్.. కొత్త మార్గం
రోహన్, నితిన్ గుప్తాలు వాడుతున్న ఒక ల్యాప్‌టాప్ 2007లో పాడైపోయింది. దాన్ని చెత్తలో పారేస్తే జరిగే నష్టం గురించి వాళ్లకు తెలుసు. అందుకే ఎలక్ట్రానిక్ వేస్ట్‌ని రీసైక్లింగ్ చేసేవాళ్లకు ఇవ్వాలి అనుకున్నారు. కానీ.. అలాంటివాళ్లు దొరకకపోవడంతో ‘‘ల్యాప్‌టాప్‌ను పారవేయడానికి సురక్షితమైన మార్గాలు ఏంటి?’’ అని గూగుల్‌లో వెతికారు. వాళ్లకు రీ సైకిల్ చేయడానికి మించిన పరిష్కార మార్గం కనిపించలేదు.
అందుకే వినూత్నమైన, పర్యావరణ అనుకూల పరిష్కారాలను వెతికారు. కొన్ని నెలల రీసెర్చ్ తర్వాత టెలివిజన్ సెట్లు, కంప్యూటర్ మానిటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, కీబోర్డులు, మౌస్‌లు, కేబుల్స్, సర్క్యూట్ బోర్డులు, బల్బులు, కాలిక్యులేటర్లు, ఫోన్లు, డీవీడీలు.. మొదలైన ఎలక్ట్రానిక్ స్క్రాప్‌కు ఎండ్–టు–ఎండ్ రీసైక్లింగ్ పరిష్కారాలను అందించడానికి అటెరో రీసైక్లింగ్ పేరుతో ఒక స్టార్టప్‌ని స్థాపించారు.
వేస్ట్ నుంచి బంగారం
నితిన్ ఐఐటీ ఢిల్లీ నుంచి బీటెక్ పట్టా అందుకున్నాడు. రోహన్ ఆర్‌ఈసీ జైపూర్ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో బీఈ గ్రాడ్యుయేట్ చేశాడు. ఇద్దరూ కలిసి ఈ–వ్యర్థాల నుంచి 98శాతం మెటల్స్‌ని తీయగల మెకానికల్, హైడ్రోమెటలర్జికల్ టెక్నాలజీలతో ఒక ప్రత్యేకమైన రీసైక్లింగ్ ప్రక్రియను డెవలప్ చేశారు. ఈ ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ కూడా చాలా తక్కువగా వెలువడుతుంది. మన దేశంలో ఈ–వేస్ట్ గురించి పెద్దగా అవగాహన లేని ఆ టైంలోనే ఈ ఇద్దరు అన్నదమ్ములు దాని నుంచి బంగారం, వెండి, రాగి, అల్యూమినియం, లిథియం, కోబాల్ట్, మాంగనీస్, నికెల్ లాంటి లోహాలను తీసి, మార్కెట్‌లో అమ్మడం ప్రారంభించారు.
‘‘మేము కంపెనీ పెట్టేటప్పటికి దీనిపై చాలామందికి అవగాహన లేదు. పాత ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు లాంటివాటిని నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడే పారేసేవారు. లేదంటే స్క్రాప్ డీలర్లకు అమ్మేవాళ్లు. వాళ్లు ఏమాత్రం సురక్షితం కాని పద్ధతుల్లో రీసైక్లింగ్ చేసేవాళ్లు. దాంతో చాలామంది తీవ్రమైన ఆరోగ్యం పాలయ్యారు. పర్యావరణ ప్రమాదాలు జరిగాయి” అని నితిన్ చెప్పుకొచ్చాడు.
నేరుగా అమ్ముకోవచ్చు
మొదట్లో ఈ వేస్ట్‌ని రకరకాల పద్ధతుల్లో సేకరించారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ఈ వేస్ట్ రీసైకిలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఏడు జనవరిలో భారతదేశ అసంఘటిత స్క్రాప్ మార్కెట్‌ను డిజిటలైజ్ చేసే ఒక ప్లాట్‌ఫామ్‌ని తీసుకొచ్చారు. దానికి ‘మెటల్ మండి’ అని పేరుపెట్టారు. ఇది ఏఐతో పనిచేస్తుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న స్క్రాప్ డీలర్లు మెటల్ స్క్రాప్‌ను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా కంపెనీకి అమ్ముకోవచ్చు.
ప్రస్తుతం అటెరోకు 70 శాతం ఈ– వేస్ట్ మెటల్‌మండి ద్వారానే వస్తోంది. అటెరో ద్వారా 2024లో ‘సెల్‌స్మార్ట్’ పేరుతో డైరెక్ట్–టు–కన్జ్యూమర్ (డీ2సీ) ప్లాట్‌ఫామ్‌ని కూడా స్థాపించారు. ఇందులో ఎవరైనా తమ పాత ఫోన్ల నుంచి ఎయిర్ కండిషనర్ల వరకు అన్ని రకాల ఎలక్ట్రానిక్స్‌ని అమ్ముకోవచ్చు. డోర్ స్టెప్ పికప్ సర్వీస్ కూడా ఉంది. అటెరో ఇన్‌పుట్ వాల్యూమ్‌లో 10 శాతం వరకు ‘సెల్‌స్మార్ట్’ నుంచి వస్తోంది.
ఎన్నో కంపెనీల నుంచి ఆర్డర్లు
ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో అత్యాధునిక సౌకర్యాలతో రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటుచేశారు. 2025 నాటికి అటెరో దేశంలోని ప్రముఖ ఈ- వేస్ట్, లిథియం-అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్ కంపెనీగా అవతరించింది. గత నాలుగేండ్లలో కంపెనీ బాగా అభివృద్ధి చెందింది. ఇప్పటివరకు 5 లక్షల మెగా టన్నులకుపైగా ఈ–వేస్ట్‌ని, సుమారు పదివేల మెగా టన్నుల లిథియం-అయాన్ బ్యాటరీలను రీసైకిల్ చేసి భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రానిక్ వేస్ట్ రీసైకిలర్‌గా ఎదిగింది. గడిచిన నాలుగేండ్లలో అటెరో ఆదాయం 30 రెట్లు పెరిగింది. దీనికి ఏసర్, ఎల్‌జి, గోద్రేజ్, రిలయన్స్ జియో, ఎంజి మోటార్స్, మారుతి లాంటి పెద్ద కంపెనీల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి.
మొదటి కంపెనీ
పరిమాణం, ఆకారంతో సంబంధం లేకుండా పర్యావరణ అనుకూల పద్ధతిలో లిథియం-అయాన్ బ్యాటరీలను రీసైకిల్ చేసిన మొదటి కంపెనీ వాళ్లదే అని నితిన్, రోహన్ బ్రదర్స్ చెప్తున్నారు. అటెరో ఇప్పుడు చాలా దేశాలకు విస్తరించింది. అమెరికా, దక్షిణ కొరియా, యూరప్‌లలో ఆఫీస్‌లు కూడా ఉన్నాయి. అంతేకాదు.. అటెరో 46 గ్లోబల్ పేటెంట్లను కూడా పొందింది. రీసైక్లింగ్ చేస్తున్నందుకు కార్బన్ క్రెడిట్‌లను పొందిన ప్రపంచంలోని ఏకైక సంస్థ ఇది.