ఆగస్ట్ 8 నుంచే ‘అతడు’ ప్రీమియర్ షోలు.. అప్పట్లో హిట్టా.. ఫట్టా..? పార్థు ‘తాత’ నాజర్ కాదా..?

ఆగస్ట్ 8 నుంచే ‘అతడు’ ప్రీమియర్ షోలు.. అప్పట్లో హిట్టా.. ఫట్టా..? పార్థు ‘తాత’ నాజర్ కాదా..?

మహేష్ బాబు 50th బర్త్ డే గిఫ్ట్గా రీ రిలీజ్ అవుతున్న ‘అతడు’ సినిమాకు ఆగస్ట్ 8 సాయంత్రం నుంచే ప్రీమియర్ షోస్ పడుతున్నాయి. హైదరాబాద్ సిటీలోని కొన్ని సింగిల్ స్క్రీన్స్ థియేటర్లతో పాటు ప్రసాద్ ఐమ్యాక్స్, రవితేజ కొత్త మల్టీప్లెక్స్ ART సినిమాస్లో కూడా ‘అతడు’ ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. బుక్ మై షోకు టికెట్లను అందుబాటులో ఉంచారు. ఆగస్ట్ 8 సాయంత్రం నుంచే థియేటర్ల ముందు మహేష్ అభిమానులు తమ అభిమాన హీరో 50వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోబోతున్నారు.

మహేష్ బాబు కెరీర్లో ‘అతడు’ సినిమాకు వెండితెరపరంగా అంత ఆశించిన ఫలితం రాకపోయినప్పటికీ, ‘బుల్లితెర’పై మాత్రం ఈ సినిమా అప్పటిదాకా ఉన్న రికార్డులను తుడిచిపెట్టేసింది. ‘అతడు’ సినిమా విడుదలైన ఫస్ట్ వీకెండ్ (ఆగస్ట్ 10, 2005) ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. యావరేజ్ సినిమా అనే టాక్ తెచ్చుకుని అబౌవ్ యావరేజ్ సినిమాగా ‘అతడు’ సినిమా మిగిలిపోయింది.

ఇప్పట్లో మాదిరిగా అప్పట్లో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేదు. ఇలా వందల కోట్లు పోసి సినిమాలు తీసేవాళ్లు కూడా కాదు. అందుకే సినిమా లాంగ్ రన్ రిజల్ట్ను డిసైడ్ చేసేది. ఫస్ట్ వీకెండ్ ఫలితం సినిమా హిట్టో.. ఫట్టో తేల్చే రోజులివి. కానీ 2005లో అలా కాదు. 50 డేస్ ఆడితే యావరేజ్. 100 డేస్ ఆడితే హిట్. ఎక్కువ థియేటర్లలో 175 డేస్ ఆడితే బ్లాక్ బస్టర్. అప్పటి ఈ లెక్కల ప్రకారం.. ‘అతడు’ సినిమా 205 కేంద్రాల్లో 50 రోజులు, 37 కేంద్రాల్లో 100 రోజులు, 2 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ‘అతడు’ సినిమా రీరిలీజ్ సందర్భంగా మరోసారి ట్రెండ్ అవుతున్నాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను పవన్ కల్యాణ్తో చేయాలనుకున్నారు. పవన్ను కలిసి త్రివిక్రమ్ కథ చెప్పడం మొదలుపెట్టిన అర గంటకే పవన్ నిద్రలోకి జారుకున్నారు. త్రివిక్రమ్ చెప్పిన ‘అతడు’ సినిమా కథపై పవన్ ఆసక్తి చూపకపోవడంతో మహేష్ బాబుకు త్రివిక్రమ్ ఇదే స్టోరీని నెరేట్ చేశాడు. మహేష్కు కథ నచ్చడంతో ‘జయభేరి’ ఆర్ట్ ప్రొడక్షన్స్ ‘అతడు’ సినిమాను నిర్మించి ప్రేక్షకులకు అందించింది.

మురళీ మోహన్ ఈ సినిమాలో నాజర్ చేసిన సత్యనారాయణ మూర్తి క్యారెక్టర్ కోసం శోభన్ బాబును అప్రోచ్ అయ్యారు. ఆయన ఈ పాత్ర చేయనని సున్నితంగా తిరస్కరించడంతో నాజర్కు ఆ పాత్ర పోషించే అవకాశం దక్కింది. ఇవీ.. ‘అతడు’ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు. ‘అతడు’ సినిమా రీరిలీజ్ షోస్కు మంచి స్పందనే కనిపిస్తోంది. ఆన్ లైన్ మూవీ బుకింగ్ సైట్స్ అయిన బుక్ మై షో, డిస్ట్రిక్ట్లో టికెట్లు బాగానే అమ్ముడుపోతుండటం విశేషం.