ఏటీఎంలో రూ.500 కొడితే.. రూ.2500 వచ్చాయి

ఏటీఎంలో రూ.500 కొడితే.. రూ.2500 వచ్చాయి

ఓ వ్యక్తి ఏటీఎంకు వెళ్లాడు.. రూ.500 డ్రా చేసే ప్రయత్నం చేయగా, రూ.500 నోట్లు ఐదు వచ్చాయి. మరోసారి రూ.500 డ్రా చేసేందుకు యత్నించగా.. అలాగే రూ.2,500 వచ్చాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని  నాగ్పూర్ కు దాదాపు 30 కిలోమీటర్ల  దూరంలోని ఖాపర్ ఖేడా పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. ఇక్కడి ఏటీఎంలో.. 5 రెట్లు ఎక్కువ సంఖ్యలో నోట్లు వస్తున్నాయనే వార్త దావానలంలా వ్యాపించింది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు సైతం క్యూ కట్టి.. డబ్బులు డ్రా చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీనిపై బ్యాంకు వినియోగదారుడు ఒకరు అందించిన సమాచారంతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని ఏటీఎం సెంటర్ ను మూసేశారు. అనంతరం ఈవిషయాన్ని సంబంధిత బ్యాంకుకు తెలియజేశారు. ఏటీఎం మెషీన్ లోని డబ్బులు ఉంచే ట్రే లో రూ.100 నోట్లు ఉంచాల్సిన చోట పొరపాటున రూ.500 నోట్లు పెట్టారని అధికారులు గుర్తించారు. ఇందువల్లే ఐదు రెట్లు ఎక్కువగా డబ్బులు డ్రా అయ్యాయని పేర్కొన్నారు.