
చండీగఢ్: పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటున్న పంజాబ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ బార్డర్స్‌లో బీఎస్‌ఎఫ్ నియంత్రణ పరిధిని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఈ రాష్ట్రాల బార్డర్‌లో 15 కి.మీ.లు బీఎస్ఎఫ్ పరిధిలో ఉండగా.. ఇప్పుడు దాన్ని 50 కి.మీ.లకు పెంచడంపై ఆయా స్టేట్స్ భగ్గుమంటున్నాయి. దీన్ని ఫెడరలిజం మీద చేస్తున్న దాడిగా పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ అభివర్ణించారు.
‘అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాల బార్డర్‌లో 50 కి.మీ.ల రేంజ్ వరకు బీఎస్ఎఫ్‌కు ప్రత్యేక అధికారాలు ఇస్తూ కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని ఖండిస్తున్నా. ఇది ఫెడరలిజంపై చేస్తున్న అటాక్. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి’ అని పంజాబ్ సీఎం చన్నీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. ‘కేంద్ర నిర్ణయాన్ని మేం ఖండిస్తున్నాం. ఇది సమాఖ్య వ్యవస్థను ఉల్లంఘించడమే. ఇది పంజాబ్‌లో భయాందోళనలను రేకెత్తిస్తోంది. దీన్ని ప్రజలు సహించరు. మా రాష్ట్రంలో ఇప్పటివరకు మతహింస చోటుచేసుకోలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించొద్దు’ అని పంజాబ్ హోం మంత్రి సుఖ్‌జిందర్ రణ్‌ధావా.. ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.
I strongly condemn the GoI's unilateral decision to give additional powers to BSF within 50 KM belt running along the international borders, which is a direct attack on the federalism. I urge the Union Home Minister @AmitShah to immediately rollback this irrational decision.
— Charanjit S Channi (@CHARANJITCHANNI) October 13, 2021
బీఎస్‌ఎఫ్‌కు ప్రత్యేక అధికారాలు
కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆర్డర్ వల్ల పంజాబ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల సరిహద్దుల్లో 50 కిలో మీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో సోదాలు, అరెస్టులు, సీజ్‌లు చేయడానికి బీఎస్ఎఫ్‌కు ప్రత్యేక అధికారాలు దక్కనున్నాయి. ఉదాహరణకు పంజాబ్‌లోని అమృత్‌సర్, తారా తరన్, పఠాన్‌కోట్ లాంటి ప్రాంతాల్లో బీఎస్‌ఎఫ్ రెయిడ్స్, అరెస్టులు చేయొచ్చు. అయితే దీని వల్ల రాష్ట్ర పోలీసులు, బీఎస్ఎఫ్‌కు మధ్య ఘర్షణ ఏర్పడే ప్రమాదముందని విశ్లేషకులు అంటున్నారు.