
- 40 మంది మృతి.. శిథిలాల కింద మరికొంత మంది..?
- అమెరికా రిక్వెస్ట్‌ను లెక్క చేయని ఇజ్రాయెల్
గాజాస్ట్రిప్: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడు లు ఆగడంలేదు. యుద్ధానికి విరామం ఇవ్వాలని అమెరికా కోరినా, కాల్పుల విరమణ ప్రకటించాలని అరబ్ దేశాలు కోరినా ఇజ్రాయెల్ వినిపించుకోలేదు. హమాస్ మిలిటెంట్ల అంతుచూస్తామంటూ ఇప్పటికే ప్రకటించింది. ఆదివారం తెల్లవారుజామున గాజాలోని శరణార్థుల క్యాంప్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 40 మంది చనిపోయారు.
పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అక్కడక్కడా వ్యతిరేకత పెరుగుతున్నది. పలు దేశాలు ఆయన వైఖరిపై విమర్శలు చేస్తున్నారు. దాడుల్లో ఇప్పటి దాకా 9,400 మందికి పైగా పాలస్తీనియులు చనిపోయారు.
మృతుల్లో 8 మంది చిన్నారులు
ఆదివారం తెల్లవారుజామున సెంట్రల్ గాజాలోని మఘాజీ శరణార్థుల క్యాంప్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో 40 మంది చనిపోయారని, 34 మంది గాయపడ్డారని పాలస్తీనా హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వివరించింది.
చనిపోయిన వాళ్లల్లో 8 మంది చిన్నారులున్నారు. కాగా, హమాస్ మిలిటెంట్లు అమాయక ప్రజలను అడ్డుపెట్టుకుని యుద్ధం చేస్తున్నారని ఇజ్రాయెల్ ఆర్మీ మండిపడింది. తమ టార్గెట్ సాధారణ పౌరులు కాదని.. మిలిటెంట్లేనని ప్రకటించింది. తాము దాడులు ఆపాలంటే గాజా ప్రజలే హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను కనిపెట్టి అంతం చేయాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లాంత్ కోరారు.
అణు బాంబు వేస్తమన్న మంత్రిపై నెతన్యాహు ఫైర్
గాజా స్ట్రిప్ పై న్యూక్లియర్ బాంబ్ వేసే ఆప్షన్ కూడా తమకుందని ఇజ్రాయెల్ మంత్రి అమిచై ఎలియాహు చేసిన కామెంట్లపై దుమారం చెలరేగుతున్నది. గాజావాసులను నాజీలతో పోలుస్తూ.. వారందరితో హమాస్‌కు సంబంధాలున్నాయని ఆయన చెప్పాడు. అణుబాంబు కామెంట్లను ప్రధాని నెతన్యాహు ఖండించారు.