బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిపై కత్తితో దాడి

బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిపై కత్తితో దాడి
  • పాతకక్షతో దాడికి పాల్పడిన వ్యక్తి

  • వికారాబాద్ జిల్లాలో ఘటన

వికారాబాద్, వెలుగు: హోలీ వేడుకల్లో భాగంగా బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ మండలం పులుసుమామిడికి చెందిన నారేగూడం కమల్ రెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్. అతను  వికారాబాద్ లో ఉంటూ సొంతూరికి వెళ్లొస్తుంటాడు. సర్పంచ్ గా ఉన్నప్పుడు  గ్రామానికి చెందిన కొత్తగడి నాగిరెడ్డి, లలిత దంపతుల మధ్య గొడవలు అవుతుండగా.. భార్య తరఫు బంధువులు గతేడాది పంచాయితీ పెట్టారు. అప్పుడు సర్పంచ్ గా కమల్ రెడ్డి వెళ్లి దంపతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడమే కాకుండా నాగిరెడ్డిని మందలించాడు. ఆ సమయంలోనే లలిత బంధువులు నాగిరెడ్డిపై దాడి చేసే క్రమంలో జరిగిన తోపులాటలో కింద పడడడంతో చేయి విరిగింది. దీంతో కమల్ రెడ్డిపై కక్షగట్టిన నాగిరెడ్డి అతడిని చంపుతానని గ్రామంలో చెబుతూ తిరిగేవాడు. పలు సందర్భాల్లోనూ దాడి చేసేందుకు కత్తితో తిరిగే వాడు. అదును కోసం చూసిన నాగిరెడ్డి హోలీ కావడంతో కమల్ రెడ్డి సొంతూరికి వచ్చాడు.  సోమవారం హోలీ ఆడుతుండగా ఒక్కసారిగా నాగిరెడ్డి కత్తితో అతనిపై దాడి చేశాడు. కమల్ రెడ్డి చేయి అడ్డు పెట్టడంతో చేయి, మెడకు గాయాలు అయ్యాయి. బాధితుడిని గ్రామస్తులు, బంధువులు వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆస్పత్రికి వెళ్లి కమల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పరామర్శించారు.