ఎయిర్​పోర్టుపై మిసైళ్లతో దాడి

ఎయిర్​పోర్టుపై మిసైళ్లతో దాడి
  • పూర్తిగా ధ్వంసమైన  విన్నిట్సియా ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు.. ఎగసిపడుతున్న మంటలు
  • 8 మిసైళ్లతో ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుపై దాడి కీవ్, ఖార్కివ్, మికోలైవ్, చెర్నిహివ్, సుమీ సిటీల ముట్టడి

కీవ్/ల్వీవ్/మాస్కో: వందల ప్రాణాలు పోతున్నా.. ఊర్లకు ఊర్లు నాశనం అవుతున్నా.. రష్యా దాడులు ఆగడం లేదు. రాజధాని కీవ్‌‌‌‌ మొదలుకొని.. ప్రతి సిటీపైనా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. మిలిటరీ బేస్‌‌‌‌లు, ఎయిర్‌‌‌‌‌‌‌‌బేస్‌‌‌‌లు, ప్రభుత్వ బిల్డింగులు, ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులు, ఇండ్లు, బ్రిడ్జిలు.. ఇలా అన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ పోతున్నది. ఆదివారం సెంట్రల్ ఉక్రెయిన్‌‌‌‌లోని విన్నిట్సియా ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుపై మిసైళ్ల వర్షం కురిపించింది. 8 మిసైళ్లు వరుసగా దూసుకురావడంతో పౌర విమానాశ్రయం మొత్తం ధ్వంసమైంది. కొన్ని మీటర్ల ఎత్తు దాకా ఎగసిన పొగలు.. దాడుల తీవ్రతను చెప్పకనే చెప్పాయి. కనీసం కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా రష్యా సక్కగ పాటించలేదు. గ్యాప్ ఇస్తున్నట్లు ప్రకటించి షెల్లింగ్ కొనసాగించిందని ఉక్రెయిన్ ఆరోపించింది. దీంతో రెండో రోజు కూడా మరియుపోల్, వోల్నోవాఖా సిటీల నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. ఉక్రెయిన్ పోరాటం ఆపేదాకా, తమ డిమాండ్లు నెరవేరే దాకా దాడులు కొనసాగుతాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి స్పష్టం చేశారు. 

చెర్నిహివ్‌‌‌‌పై 500 కిలోల బాంబు.. 
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌‌‌కు మరింత దగ్గరగా వచ్చిన రష్యా సైన్యం.. బుచా, ఇర్పిన్ వంటి పట్టణాలపైనా విరుచుకుపడుతోంది. చెర్నిహివ్ పై దాదాపు 500 కిలోల బాంబును వేయగా, పేలలేదు. ఆ ఫొటోను అధికారులు షేర్ చేశారు. వరుసగా రెండో రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందం అమలు కాలేదు. మరియుపోల్ నుంచి ప్రజల తరలింపు ప్రక్రియ మరోసారి విఫలం అయింది.  రష్యా దళాలు ఉక్రెయిన్‌‌‌‌లోని జనావాసాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయని బ్రిటిష్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చెప్పింది. ఉక్రెయిన్ సైన్యం బలంగా ప్రతిఘటిస్తుండటంతో రష్యా చాలా నెమ్మదిగా  కదులుతున్నదని తెలిపింది. 
 

11 వేల మందిని చంపినం: ఉక్రెయిన్
ఇప్పటిదాకా 11 వేల మంది రష్యా సైనికులను హతమార్చామని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్‌‌‌‌లో 351 మంది పౌరులు చనిపోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అయితే వాస్తవ లెక్కలు ఇంతకు భారీగా ఉండే అవకాశముంది.

రష్యాలో నిరసనలు.. ఉక్రెయిన్‌‌‌‌లో అడ్డగింతలు
క్రెమ్లిన్ ఆక్రమణకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలంటూ రష్యన్లను జెలెన్‌‌‌‌స్కీ ఆదివారం కోరారు. కొన్ని రోజులుగా రష్యాలో నిరసనలు కొనసాగుతుండగా.. ఆదివారం మరింత ఎక్కువయ్యాయి. రష్యాలోని 49 సిటీల్లో ప్రజలు నిరసనలు చేపట్టారు. వీధుల్లోకి వచ్చి పుతిన్‌‌‌‌కు వ్యతిరేకంగా ‘యుద్ధం వద్దు’.. ‘షేమ్ ఆన్ యూ’ అంటూ నినదించారు. ఆదివారం ఒక్కరోజే 2,500 మందికి పైగా నిరసనకారులను రష్యాలో అరెస్టు చేశారు.  అలాగే రష్యన్లు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లోని ఉక్రేనియన్లు ప్రతిఘటించాలని జెలెన్‌‌‌‌స్కీ పిలుపునిచ్చారు. జెలెన్‌‌‌‌స్కీ పిలుపుతో వేలాది మంది ఉక్రెయిన్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రష్యా మిలటరీ వాహనాలపైకి ఎక్కి.. తమ జెండాలను ఎగురవేశారు. ముందుగా రష్యా అధీనంలోకి వచ్చిన ఖెర్సన్‌‌‌‌ సిటీలో ఇవే దృశ్యాలు కనిపించాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు రష్యా సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారు. కానీ జనం మాత్రం వెనక్కి తగ్గలేదు.

ఉక్రెయిన్ పోరు ఆపేదాకా దాడులు ఆగవ్: పుతిన్
ఉక్రెయిన్ పోరాటం ఆపేదాకా, తమ డిమాండ్లు నెరవేరేదాకా.. దాడులు ఆగబోవని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్‌‌‌‌తో ఆయన ఆదివారం ఫోన్‌‌‌‌లో మాట్లాడారు. అంతా తమ ప్లాన్ ప్రకారమే జరుగుతోందని చెప్పారు.  ఉక్రెయిన్ తీరు ఇలాగే ఉంటే.. ఆ దేశానికి స్వతంత్ర  దేశ హోదా కూడా ఉండబోదని హెచ్చరించారు. కాగా, ప్రజలను తరలించేందుకు కాల్పుల విరమణ పాటించాలని పుతిన్‌‌‌‌కు ఎర్డోగన్ విజ్ఞప్తి చేశారు. 

ఇప్పటికైనా ‘నో ఫ్లై జోన్’ ప్రకటించాలె: జెలెన్‌‌‌‌స్కీ
విన్నిట్సియాలో ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుపై రష్యా దాడి తర్వాతనైనా ఉక్రెయిన్‌‌‌‌ను నో ఫ్లై జోన్‌‌‌‌గా ప్రకటించాలంటూ పాశ్చాత్య దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌‌‌‌స్కీ మరోసారి కోరారు. తమ ఎయిర్‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌ను మూసివేసేందుకు కావాల్సిన బలం ప్రపంచానికి ఉందన్నారు. ‘‘రోజూ అడుగుతూనే ఉన్నం. ఉక్రెయిన్‌‌‌‌ గగనతలాన్ని మూసేయండి. రష్యన్ మిసైళ్లు, ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌లు, వాళ్ల టెర్రరిస్టులను అడ్డుకోండి” అని కోరారు. కనీసం తమను తాము కాపాడుకునేందుకు యుద్ధ విమానాలైనా ఇవ్వాలన్నారు.