బీజేపీ కార్నర్ ​మీటింగ్​పై బీఆర్ఎస్ దాడి

బీజేపీ కార్నర్ ​మీటింగ్​పై బీఆర్ఎస్ దాడి
  • బీజేపీ కార్నర్ ​మీటింగ్​పై బీఆర్ఎస్ దాడి
  • వివేక్ ​వెంకటస్వామి మాట్లాడుతుండగా బాల్కసుమన్ అనుచరుల వీరంగం
  • మంచిర్యాల జిల్లా సుద్దాలలో కరెంట్ కట్ చేసి, బీజేపీ కార్యకర్తలపై పిడిగుద్దులు 
  • వీ6 వెహికల్ పై దాడి చేసి, అద్దాలు ధ్వంసం 
  • బాల్క సుమన్ ఖబడ్దార్.. నీ గూండాయిజం ఇక నడ్వదు: వివేక్​ 
  • కేసీఆర్​ను, సుమన్​ను గద్దెదించే దాకా పోరాడ్తమని హెచ్చరిక

మంచిర్యాల/చెన్నూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుద్దాలలో శుక్రవారం రాత్రి నిర్వహించిన బీజేపీ స్ర్టీట్ కార్నర్ మీటింగ్​పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు దాడిచేశారు. బీజేపీ జాతీయకార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​వెంకటస్వామి మాట్లాడుతుండగా.. ప్రసంగానికి అడ్డుతగులుతూ వీరంగం సృష్టించారు. కరెంట్ కట్ చేసి, చీకట్లో బీజేపీ కార్యకర్తలపై పిడిగుద్దులు కురిపించారు. కవరేజీకి వచ్చిన వీ6 వెహికల్​పై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. బాల్క సుమన్ అనుచరుల దాడిని బీజేపీ నేతలు, కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొని మీటింగ్ కొనసాగించారు. దాడిపై వివేక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘బాల్క సుమన్ ఖబడ్దార్.. నీ గూండాయిజం, రౌడీయిజానికి బీజేపీ కార్యకర్తలు భయపడరు. కేసీఆర్​ను, నిన్ను గద్దె దించే వరకు పోరాటం ఆగదు’’ అని హెచ్చరించారు. చెన్నూర్ నియోజకవర్గంలో బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే సుమన్ తన అనుచరులకు మందు తాగించి దాడులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. మీటింగ్​కు ప్రజలు పెద్ద సంఖ్యలో రావడం చూసి కరెంట్ కట్ చేస్తున్నారంటేనే బీజేపీకి ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోందన్నారు.  

సమస్యలు చెప్పుకున్న గ్రామస్తులు 

సుద్దాల గ్రామంలోని సమస్యలపై ప్రజలు వివేక్ వెంకటస్వామికి చెప్పుకున్నారు. కరెంట్ 10 గంటలు కూడా రావడం లేదన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంటలు మునుగుతున్నాయని, న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఇసుక అక్రమ రవాణాతో రోడ్లు పాడయ్యాయని, లారీలతో యాక్సిడెంట్లు అయి ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పెన్షన్లు, కొత్త రేషన్లు కార్డులు రాలేదని, డబుల్ బెడ్​రూం ఇండ్లు ఇవ్వలేదన్నారు. సర్కారు వైద్యం అందడం లేదని బాధలు చెప్పుకున్నారు. బెల్ట్ షాపులు పెట్టి తమ భర్తలను, పిల్లలను మద్యానికి బానిసలు చేస్తున్నారని మహిళలు మండిపడ్డారు. అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెస్తున్నారన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య ఉందని మొరపెట్టుకున్నారు. ఇప్పటికే సుద్దాలలో ఐదు బోర్లు వేయించానని, అవసరాన్ని బట్టి మరో రెండు బోర్లు వేయిస్తానని వివేక్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ జాయింట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్లు, పార్టీ చెన్నూర్ మండల అధ్యక్షుడు ఆలం బాపు, టౌన్ ప్రెసిడెంట్​ సుద్దపల్లి సుశీల్, తదితరులు పాల్గొన్నారు.  

రాష్ట్రాన్ని కేసీఆర్ ​దివాలా తీయించిండు 

సీఎం కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించాడని, మరోవైపు ప్రాజెక్టుల పేరిట ఖజానా ఖాళీ చేసి సొంత ఆస్తులు పెంచుకున్నాడని వివేక్​ ఫైర్ అయ్యారు. ప్రజలకు అనేక హామీలిచ్చి ఎన్నికల్లో గెలిచాక మోసం చేశాడని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్​రూం ఇండ్లు, మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఇంటింటికి నీళ్లు, రైతు రుణమాఫీ లాంటి హామీని నెరవేర్చలేదన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం పేదలకు ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్ ఆ నిధులను దారి మళ్లించాడన్నారు. పేదలకు ఇండ్లు కట్టించలేదు కానీ తాను మాత్రం వంద గదులతో ప్రగతిభవన్ కట్టుకున్నాడని, కొడుకు, కూతురుకు వందల ఎకరాల్లో ఫామ్​హౌస్​లు కట్టించాడన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోని కేసీఆర్.. పంజాబ్ రైతు కుటుంబాలకు చెక్కులు అందించాడని విమర్శించారు. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ర్టాలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించినా రాష్ట్రంలో తగ్గించలేదన్నారు. తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు, కరెంట్, బస్ ​చార్జీలు ఎక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే అభివృద్ది జరుగుతుందన్నారు.