సూర్యాపేటలో రైస్ మిల్లులపై దాడులు

సూర్యాపేటలో రైస్ మిల్లులపై  దాడులు

  సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటతో పాటు తిరుమలగిరి, కోదాడ, హుజూర్ నగర్ పరిధిలోని నాలుగు రైస్ మిల్లులపై జిల్లా అడిషనల్​కలెక్టర్ల నేతృత్వంలో రెవెన్యూ, సివిల్ సప్లయీస్, ఎలక్ట్రిసిటీ ఆఫీసర్ల బృందం ఆకస్మికంగా దాడులు నిర్వహించింది. ఈ సీజన్​ముందు జిల్లాలో దాదాపు 34  రైస్ మిల్లులను డిఫాల్ట్ మిల్లులుగా గుర్తించి బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఇందులో ఆరు రైస్ మిల్లులు గత రబీ సీజన్ సంబంధించి ఒక్క మెట్రిక్ టన్ను ధాన్యం కూడా ఎఫ్​సీఐకి అప్పగించలేదు. దీంతో మిల్లుల్లో ధాన్యం ఉన్నదీ లేనిదీ తెలుసుకునేందుకు కలెక్టర్ ఎస్. వెంకట్రావు..అడిషనల్ కలెక్టర్ల నేతృత్వంలో రెండు బృందాలను ఏర్పాటు చేశారు.

 మంగళవారం ఈ టీమ్స్​ఒకే టైంలో  నాలుగు మిల్లులపై దాడులు నిర్వహించగా..రెండు మిల్లుల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. తిరుమలగిరిలోని...సూర్యాపేట రైస్ మిల్లర్ల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మిడి సోమనర్సయ్యకు చెందిన సంతోషిమాత రైస్​మిల్, రఘురామ రైస్ ఇండ్రస్ట్రీలో దాదాపు రూ.220 కోట్ల సీఎమ్మార్ రైస్ పక్కదారి పట్టినట్లు అంచనా వేశారు. వీటితో పాటు కోదాడ శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ లో రూ.90కోట్ల సీఎమ్మార్ రైస్ మాయమైనట్లు గుర్తించారు.

 రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ సేకరణలో సూర్యాపేట జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. బకాయిపడ్డ సీఎంఆర్ బియ్యం ఇవ్వాల్సిందిగా అధికారులు పలుమార్లు గడువు ఇచ్చినా వినలేదు. దీంతో ఈ సారి ఖరీఫ్ సీజన్ ధాన్యాన్ని బకాయి ఉన్న మిల్లర్లకు కేటాయించలేదు. మరో వైపు బకాయి పడ్డ బియ్యం కోసం తనిఖీలు చేస్తున్నారు.