బాలికపై లైంగిక దాడికి యత్నం ..నల్గొండ జిల్లా షాబ్దుల్లాపురంలో ఘటన

బాలికపై లైంగిక దాడికి యత్నం ..నల్గొండ జిల్లా షాబ్దుల్లాపురంలో  ఘటన

నల్గొండ అర్బన్, వెలుగు :  బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటన నల్గొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.   కనగల్ మండలం షాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన దళిత బాలిక నల్గొండలో చదువుతుండగా.. కాలేజీకి సెలవు ఉండడంతో గత శుక్రవారం సొంతూరుకు వెళ్లింది. 

గ్రామంలో గణేశ్​శోభాయాత్ర నిర్వహిస్తుండగా చూసేందుకు బాలిక వెళ్లింది. అదే గ్రామానికి చెందిన సోమ సుఖేందర్ ఆమెను చూసి సైగలు చేస్తూ వేధింపులకు పాల్పడగా భరించలేని ఆమె  ఇంటికి వెళ్లిపోయింది. అదేరోజు రాత్రి బాలిక ఇంటికి సోమ సుఖేందర్ గుట్టు చప్పుడు కాకుండా వెళ్లాడు. 

బాత్రూమ్ లో ఉండగా.. లోపలికి వెళ్లి గడియ పెట్టి ఆమె నోరు మూసి.. లైంగిక దాడికి యత్నిస్తుండగా కేకలు వేసింది. అప్పుడే ఇంటికి వచ్చిన ఆమె అన్న బాత్రూమ్ తలుపులు నెట్టి చూడగా సోమ సుఖేందర్ కనిపించాడు. వెంటనే సుఖేందర్ ఫోన్ చేసి మాట్లాడి మన్నెం రాంబాబు, సోమ చంటిని అక్కడికి రప్పించాడు. బాధితురాలి కుటుంబ సభ్యులను కులం పేరుతో తిడుతూ దాడికి పాల్పడి పారిపోయారు. 

నాలుగు రోజులుగా ఇరువర్గాల మధ్య రాజి కుదుర్చేందుకు గ్రామపెద్దలు ప్రయత్నించినా  ఫలితం లేదు.  బుధవారం బాధిత కుటుంబం కనగల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సుఖేందర్ పై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడితో పాటు అతని అనుచరులపైనా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధిత కుటుంబంతో పాటు దళిత సంఘాలు డిమాండ్ చేశారు.