
- ఓనర్ ను బెదిరించి పొడిచిన దుండగులు
మేడ్చల్, వెలుగు: పట్టపగలు గోల్డ్ షాపులో దొంగలు చొరబడి యజమానిని పొడిచి దోపిడీకి యత్నించిన ఘటన మేడ్చల్ లో జరిగింది. షాపు ఓనర్ దొంగలను నెట్టేసి తప్పించుకుని బయటకు పరుగులు తీశాడు. దీంతో భయంతో దొంగలు బైక్ పై పారిపోయారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న జగదాంబ జువెలరీ షాపు ఉంది. గురువారం మధ్యాహ్నం ఇద్దరు దుండగులు పల్సర్ బైక్ పై వచ్చారు.
ఒకరు బుర్ఖా వేసుకోగా మరొకరు హెల్మెట్ పెట్టుకుని వచ్చి.. గోల్డ్ షాపు ఓనర్ శేషారామ్ను నగదు, గోల్డ్ బ్యాగులో వేయమని కత్తితో బెదిరించి పొడిచారు. ఆపై ఆభరణాలను దోచుకుంటుండగా.. దొంగల నుంచి తప్పించుకొని నెట్టేసి.. చోర్ చోర్ అంటూ ఓనర్ శేషారామ్ బయటకు పరుగులు తీశారు. దీంతో భయపడిన దొంగలు వచ్చిన బైక్ పైనే పారిపోయారు.
ఘటన అంతా సీసీ పుటేజ్ లో రికార్డ్ అయింది. షాప్ ఓనర్ కంప్లయింట్ చేయగా పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, అడిషనల్ ఏసీపీ, మేడ్చల్ సీఐ వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.