నల్లమల నుంచి గిరిజనులను బయటకు పంపే ప్రయత్నాలు

నల్లమల నుంచి గిరిజనులను బయటకు పంపే ప్రయత్నాలు

ప్రకృతి సంపదకు, జీవవైవిధ్యానికి నిలయంగా ఉన్న నల్లమల అడవి నుంచి గిరిజనులను బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పులుల రక్షణ చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని, వాటి సంతతి పెరుగుతున్నందున వాటి నుంచి ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఫారెస్ట్​అధికారులు అడవి బిడ్డలైన చెంచులు, ఇతర తెగల వారిని బయటకు పంపుతున్నారు. బయట అన్ని రకాల సౌలత్​లు కల్పిస్తామని చెబుతూ వారిని అడవికి దూరం చేసే ఓ కుట్ర జరుగుతోంది. పులిని బూచిగా చూపి యురేనియం తవ్వకాలకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేసుకోవడం భాగంగానే ఫారెస్ట్​అధికారులు తమను బయటకు పంపుతున్నారని చెంచులు అంటున్నారు. అవును అడవిని నమ్ముకొని బతికే ఆదివాసీలకు పులి నుంచి ప్రమాదం ఉందని చెప్పడం సహజంగానే నమ్మశక్యంగానే లేదు.   

చెంచుల జీవనం
నల్లమల అటవీ ప్రాంతంలో ఐదు జిల్లాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్నది. దేశంలో జీవవైవిధ్యం ఉన్న పెద్ద టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఇది. గత కొన్ని రోజుల పరిణామాలను గమనిస్తుంటే గిరిజనులను అడవి నుంచి తరిమేసి, అడవిని, ప్రకృతిని ధ్వంసం చేసి యురేనియం తవ్వకాలను కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అర్థమవుతోంది. యురేనియం తవ్వకాల పేరుతో అడవిని నాశనం చేయడం మంచిది కాదు. 33.31% అడవులకు దేశంలో 24.35 % మాత్రమే ఉన్నాయి. వెలకట్టలేని అపార సంపదను, జీవవైవిధ్యాన్ని కొంతమంది పెట్టుబడిదారులకు అప్పజెప్పే కుట్ర జరుగుతున్నది. అమ్రాబాద్ మండలంలో42 గ్రామాలు ఉన్నాయి. దాదాపు120 చెంచు పెంటలు ఉన్నాయి. చెంచుల పూర్తి జీవనం అడవిపై ఆధారపడి ఉంటుంది. అక్కడ యురేనియం తీయడం అంటే వారి ఉనికిని, జీవ వైవిద్యాన్ని ధ్వంసం చేయడమే అవుతుంది. 

2017లో ఇలాంటి చర్యలే..
యురేనియం తీస్తున్నారని తెలిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతారని గిరిజనుల దృష్టి మరల్చే ప్రయత్నాలు గతంలో కూడా జరిగాయి. -2017లో ఫారెస్ట్ అధికారులతో చేతులు కలిపిన ఓ సంస్థ రంగు రాళ్లు, ఖనిజాలు, అల్యూమినియం, ఇతర అనేక రకాల గనుల పేరుతో నల్లమలను జల్లెడ పట్టింది. బంగారం ఉందని అడవుల్లోకి ఎవరిని వెళ్లనీయలేదు. కర్నూలు జిల్లా జొన్నగిరి, మహానంది, మహాదేవపురంలో వజ్రాలు దొరుకుతున్నాయని ప్రచారం చేశారు. మళ్లీ మాట మార్చి పులులు తిరుగుతున్నాయని, వాటికి హానీ చేయకూడదని మరో వాదన తెరమీదకు తెచ్చారు. ఇటీవల లక్ష్మాపూర్ తండా తిరుములాపూర్ పరిధిలో ఉన్న రెవెన్యూ భూమి సర్వేనెంబర్135, 54, 35లలో 402 ఎకరాల భూమి, జ్యోతియా నాయక్ తండా సర్వే నంబర్ 221,227లో 313 ఎకరాల భూమిని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -లక్ష్మాపూర్ చెంచు పలుగు తండా గిరిజనులు విప్ప పూలకు వెళితే రాత్రిపూట 23 మందిని తలలు పగలగొట్టి, కాళ్లు చేతులు విరగొట్టి, తమ దగ్గర ఉన్న వంట సామగ్రి గిన్నెలను బట్టలను తగలబెట్టారు. చిత్రహింసల గురి చేశారు. మద్దిమడుగు ప్రాంతంలో పశువులను కాస్తున్న గిరిజనులను ఉడుములు పట్టుకున్నారనే నెపంతో కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టారు. ఇలా గిరిజనులకు అడవి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు. -

తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజన సంఘం, ఇతర జేఏసీల నేతృత్వంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు జరిగాయి. ప్రజల పోరాట ఫలితంగా 2019 సెప్టెంబర్16న తెలంగాణ ప్రభుత్వం యురేనియం వెలికితీతకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించింది. నల్లమలలోనే కాదు తెలంగాణ జిల్లాల్లో ఎక్కడా యురేనియం తవ్వకాలకు, సర్వేలకు అనుమతులు ఇవ్వబోమని, కేంద్రం అలాంటి ప్రయత్నం చేస్తే పోరాటం చేస్తావని కేసీఆర్ ​అసెంబ్లీలో చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఓ జెట్ విమానం నల్లమలపై తిరుగుతూ స్కానింగ్​చేసింది. దీనిపై ఏపీకి చెందిన ఓ ఎంపీ పార్లమెంటులో మాట్లాడుతూ నల్లమలలో యురేనియం తవ్వకాలు జరుపబోతున్నారా అని ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు ఆనాటి కేంద్ర అటవీ శాఖ మంత్రి ప్రకాశ్​ జవదేకర్ మాట్లాడుతూ నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపడం లేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం సర్వేకు అనుమతినిచ్చిందని జెట్ విమానం గుట్టువిప్పారు. ఇవన్నీ చర్యలు యురేనియం తీయాలనే ప్రయత్నం కొనసాగుతున్నట్లుగా రుజువు చేస్తున్నాయి. నల్లమల ప్రాంతమంతా ఐదో షెడ్యూల్​లో ఉన్నది. 1/70 చట్టం, సమతా జడ్జిమెంట్, అటవీ హక్కుల చట్టం, పంచాయతీరాజ్ చట్టం ఉన్నా లెక్కచేయకుండా -వారి హక్కులను కాలరాసే ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఫారెస్ట్​ కన్జర్వేషన్​ రూల్స్ 2022
అటవీ సంరక్షణ చట్టంలో భాగంగా ఫారెస్ట్​కన్జర్వేషన్​రూల్స్​2022 పేరుతో కేంద్రం కొత్త నిబంధనల ముసాయిదా సిద్ధం చేసింది. పార్లమెంట్​ఆమోదమే తరువాయి. తాజా నిబంధనల ప్రకారం గ్రామ సభ అనుమతి లేకుండా ప్రైవేట్ కార్పొరేట్ ​కంపెనీలకు అడవిని అప్పజెప్పవచ్చు. ఏ ప్రాజెక్టుకైనా అతి తక్కువ రోజుల్లోనే క్లియరెన్స్ ఇచ్చేలా కొత్త రూల్స్​ సిద్ధం చేశారు. అటవీ భూమిని అటవీయేతర భూమిగా మార్చడానికి12 రోజులు క్లియరెన్స్ ఇచ్చే వెసులుబాటు కల్పించింది. aమైనింగ్ కోసమైతే 150 రోజుల్లో అనుమతి దొరికేలా ప్రతిపాదనలు రూపొందించింది. ఇవన్నీ గిరిజనులను అడవి నుంచి దూరం చేసి, సహజ సంపదను కొల్లగొట్టడంలో భాగమే! గిరిజనుల కష్టాలను నేరుగా చేసి, ప్రస్తుతం రాష్ట్రపతి ఉన్న ద్రౌపతి ముర్ము ఫారెస్ట్​కన్జర్వేషన్​కొత్త రూల్స్​కు  ఆమోదం తెలుపొద్దు. అడవుల రక్షణను, అడవిబిడ్డల హక్కులను కాలరాసేలా రూపొందించిన ఈ నిబంధనలను రద్దు చేయాలి. అప్పుడే సుస్థిరాభివృద్ధి లక్ష్యం నెరవేరుతుంది. జీవవైవిధ్యం పెరుగుతుంది.