నల్గొండలో పోలీసుల భూమి కబ్జా చేసేందుకు యత్నం

నల్గొండలో పోలీసుల భూమి కబ్జా చేసేందుకు యత్నం
  • నల్గొండలో సీసీఎస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల కోసం 3 ఎకరాలు కేటాయింపు
  • కోర్టు వివాదంలో ల్యాండ్.. ఆగిన పనులు 
  • ఇదే అదనుగా ఆక్రమణకు రూలింగ్ పార్టీ నేతల యత్నం 

నల్గొండ, వెలుగు : నల్గొండ పట్టణంలో పోలీసుల భూమినీ ఆక్రమించడానికి కబ్జాదారులు ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆక్రమణను అడ్డుకోగలిగారు. నల్గొండ పట్టణంలో సెంట్రల్​ క్రైమ్​ స్టేషన్​(సీసీఎస్), ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు పక్కా భవనాలు నిర్మించేందుకు 2012లో ఎస్ఎల్బీసీ వద్ద 3 ఎకరాల ల్యాండ్ ప్రభుత్వం కేటాయించింది. నల్గొండ పరిధిలోని కతాల్​గూడెం, మామిళ్లగూడెం, గంధవారిగూడెం మధ్య కొంత గ్యాప్ ఏరియా ఉంది. దీన్ని మాతృక ల్యాండ్ అని పిలుస్తారు. ఇలాంటి భూములకు ప్రత్యేకంగా సర్వే నంబర్లు ఉండవు. ప్రభుత్వ భూమిగానే పరిగణిస్తారు. సుమారు 4.3 ఎకరాలున్న ఈ ల్యాండ్​లో రోడ్డు భాగం మినహా మిగిలిన మూడెకరాలు రెవెన్యూ డిపార్ట్​మెంట్​తో సర్వే చేయించి పోలీస్ డిపార్ట్​మెంట్​కు కేటాయించారు. దీంతో ఆ స్థలంలో సీసీఎస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల బిల్డింగ్ పనులు చేపట్టారు. 2018లో ఓ వ్యక్తి ఆ ల్యాండ్​లో తమకు ప్లాట్ ఉందని చెప్పి హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు బిల్డింగ్ వర్క్స్ మధ్యలోనే ఆపేశారు. అప్పటి నుంచి కేసు కోర్టులో నడుస్తోంది. పోలీసులు ఈ ల్యాండ్ పోలీస్ డిపార్ట్​మెంట్​కు చెందిందని బోర్డు పెట్టి వదిలేశారు. సిరోంచ – -రేణిగుంట రోడ్డు ఇటుగా పోతుండటంతో ప్రస్తుతం ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే మూడెకరాలకు నలువైపులా ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇదే ప్రాంతంలో మెడికల్ కాలేజీ, బత్తాయి మార్కెట్, గురుకులాలకు భూములు కేటాయించారు. దీంతో పోలీసుల ల్యాండ్​ కబ్జాకు రూలింగ్​ పార్టీ లీడర్లు తెరలేపారు. 

స్థానికుల ఫిర్యాదుతో..

పోలీసులదంటూ బోర్డు పెట్టిన భూమి కబ్జాకు గురవుతోందంటూ సోమవారం పోలీసులకు స్థానికుల నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని విచారించారు. ఆ వ్యక్తి నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్​ లీడర్​ పేరు చెప్పడంతో పోలీసులు ఆయనకు ఫోన్​ చేశారు. ఆ లీడర్​ తనకు పోలీసుల భూమి కబ్జాతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. దీంతో పోలీసులు మంగళవారం ఉదయం ల్యాండ్​దగ్గరకు వెళ్లారు. అక్కడ నిర్మాణాలు కనిపించడంతో డోజర్​పెట్టి వాటిని తొలగింపజేశారు. ‘అది పోలీస్ డిపార్ట్​మెంట్ ల్యాండ్ అని, ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని’ అక్కడున్నవారిని హెచ్చరించారు. మరోవైపు ఆ ల్యాండ్ గవర్నమెంట్​దని భావించిన కాంట్రాక్టర్లు రోడ్డు వెడల్పులో భాగంగా తవ్విన మట్టినంతా తీసుకొచ్చి అక్కడ గుట్టలుగా పోస్తున్నారు. దీనిపై కూడా పోలీసులు సీరియస్​గా స్పందించి ఆ 
కాంట్రాక్టర్​ను హెచ్చరించారు. 

నిర్మాణాలు చేపట్టొద్దు

డిపార్ట్​మెంట్​కు కేటాయించిన ల్యాండ్ అది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. వాళ్లు ఏదో హడావుడి చేయబోతే కోర్టులో తేలేవరకు ఆగాలని, ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని చెప్పాం. ఆ ప్లేస్​లో బండలు, రాళ్లు తోలితే డోజర్ పెట్టి తీసేయించాం.
– వెంకటేశ్వరరెడ్డి, డీఎస్పీ, నల్గొండ